
అట్టుడుకుతున్న దక్షిణ కర్ణాటక
బంట్‌వాల్‌లో గత మే 26వ తేదీన ఓ ముస్లిం యువకుడిని కత్తితో పోడవడంతో మత ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీంతో మొదటిసారి బంట్‌వాల్‌లో నిషేధాజ్ఞలు విధించారు. జూన్ 21వ తేదీన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన ఆటో డ్రైవర్ ఆష్రాఫ్ కలాయ్ (35)ని గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు ఆటో నుంచి బయటకులాగి హత్యచేశారు. జూలై 4వ తేదీన శరత్ మడివాలా అనే ఆరెస్సెస్ కార్యకర్తపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి తీవ్రంగా కట్టారు. ఆ తర్వాత మూడు రోజులకు ఆయన గాయాలతో మరణించారు. ఈ మూడు సంఘటనల్లో ప్రతి సంఘటన కూడా మత ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆరెస్సెస్ కార్యకర్త హత్యానంతరం ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. జూలై 8 తేదీన ఆయన నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న హిందువులు రాళ్లు, సీసాలు విసిరారు.
నిందితులపై కేసులు దాఖలు చేయనప్పుడు, అరెస్ట్‌లు చేయనప్పుడు అల్లర్లు సమసిపోకపోవడమే కాకుండా మరింత పెరుగుతాయి. అల్లర్ల పేరిట సంఘ విద్రోహ శక్తులు మరింత పేట్రేగిపోయే ప్రమాదం ఉంటుంది. మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ నిర్వహించనున్న శాంతి ప్రదర్శనలో పాల్గొనాలంటూ కాంగ్రెస్, బీజేపీలకు జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు కుమార స్వామి పిలుపునిచ్చారు. శాంతి ప్రదర్శనలో పాలక, ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా పాల్గొని తమ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది.