సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ ఇచ్చిన బంద్ పిలుపు విఫలమైంది. యధావిధిగా ప్రజా జీవనం కొనసాగింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్.. రిమాండ్ మీద రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం తెలిసిందే. ఈ పరిణామాలను నిరసిస్తూ.. టీడీపీ, అనధికారిక మిత్రపక్షం జనసేన పార్టీలు ఇవాళ(సోమవారం) ఏపీ వ్యాప్తంగా బంద్‌కు పిలుపు ఇచ్చాయి. అయితే చంద్రబాబు అరెస్ట్‌లాగానే.. ఈ బంద్ పిలుపును కూడా ఏపీ ప్రజలు అసలు పట్టించుకోలేదు.
చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ జనం నుంచి స్పందన కరువైంది. బంద్‌కు మద్దతుగా వ్యాపార, విద్యా సంస్థల నుండి ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. సోమవారం వేకువ జాము నుంచే ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్స్ రోజూ వారిలాగే నడుస్తున్నాయి. అదే విధంగా.. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. విద్యాసంస్థలు సైతం మాములుగానే నడుస్తున్నాయి. అదే సమయంలో.. తెలుగు తమ్ముళ్లు రోడ్లపైన కనిపించ లేదు.
ఇంకోవైపు ఇరు పార్టీల ముఖ్య నేతలు దాదాపుగా ఈ బంద్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొందరు కార్యకర్తలు మాత్రం రోడ్డెక్కి హడావిడి చేస్తున్నారు. కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు అతి చేష్టలకు దిగగా.. అరెస్టుల పర్వం కొనసాగింది. టీడీపీ సంగతి ఏమోగానీ.. జనసేన కార్యకర్తలు బంద్‌ను అసలు పట్టించుకోలేదు.
విజయవాడ: నగరంలో బంద్ ప్రభావం కనిపించడం లేదు. ఆర్టీసీ బస్సులు యధాతధంగా తిరుగుతున్నాయి. అయితే ముందస్తు జాగ్రత్తగా.. పండిట్ నెహ్రూబస్ స్టేషన్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రత్యేకించి.. రాజమండ్రి నగరంలో బంద్ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. రాజమండ్రిలో ఉదయాన్నే దుకాణాలు షాపులు తెరుచుకున్నాయి. బస్సులు యధావిధిగా తిరుగుతున్నాయి. ప్రజల రోజు వారి కార్యకలాపాలు మాములుగానే కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ బంద్‌కు బీజేపీ దూరంగా ఉన్న సంగతీ తెలిసిందే.
ఏపీలో 144 సెక్షన్ విధింపు
ఇదిలా ఉంటే.. చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు విధ్వంసానికి తెగబడే అవకాశాల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అల్లర్లు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ర్యాలీలు, సభలకు అనుమతి లేదని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.
జిల్లాలో సెక్షన్30 అమలు
టీడీపీ అధినేత చంద్రబాబును రిమాండ్ నిమిత్తం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకువస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. దీని ప్రకారం జిల్లాలో ఎటువంటి ధర్నాలు, నిరసనలకు అనుమతి లేదు. ఈ నిబంధనలు 10వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ నెలాఖరు వరకూ అమలులో ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించనున్నామని తెలిపారు. కాగా, జిల్లా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా విస్తృతంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ వాహ నాలతో ప్రత్యేక పోలీసు బృందాలతో పాటు, స్పెషల్ పార్టీ పోలీసులను నియమించారు.
విజయనగరం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి ఇచ్చిన బంద్ పిలుపునకు స్పందన కొరవడింది. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు కొందరు టిడిపి కార్యకర్తలు చేరుకొని బస్సులను ఆపాలని ప్రయత్నించారు. బంద్‌కు అనుమతి లేకపోవడంతో పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి బస్సులు రాకపోకలకు ఆటంకం లేకుండా నియంత్రించారు. ఈ చర్యలతో బస్సు ప్రయాణికుల కు ఎక్కడా అసౌకర్యం కలగలేదు. బస్ లు యధావిధిగా గా నడుస్తున్నాయి.
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో టీడీపీ బంద్ ప్రభావం కనిపించడం లేదు. బస్సులు యధావిధిగా తిరుగుతుండగా.. వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి. రోడ్డు మీద కొందరు టీడీపీ కార్యకర్తలు జెండాలతో హడావిడి చేస్తున్నా.. అవేం పట్టించుకోని జనాలు తమ పనులు తాము చేసుకుంటున్నారు.
కుప్పంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఓవరాక్షన్
టీడీపీ బంద్ పిలుపులో భాగంగా.. కుప్పంలో టీడీపీ శ్రేణులు బస్సు అద్దాలు ధ్వంసం చేశాయి. ఆ సమయంలో అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా.. ఎమ్మెల్సీ శ్రీకాంత్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
అనకాపల్లి: జిల్లాలో బంద్ ప్రభావం కనిపించడం లేదు. బస్సుల రాకపోకలు యధావిదిగా కనిపిస్తున్నాయి. పాయకరావుపేట ఎలమంచిలి అనకాపల్లి చోడవరం మాడుగుల పట్టణాల్లో తెరుచుకున్న దుఖానాలు.. యధావిధిగా జనజీవనం నడుస్తోంది.
తిరుపతి: శ్రీకాళహస్తి లో టిడిపి బంద్ ప్రభావం కనిపించడం లేదు. ఉదయం నుంచే వ్యాపార సముదాయాలు, మార్కెట్లు యధావిధిగా తెరచుకున్నాయి. ప్రజాజీవనం యధాతధంగా నడుస్తోంది.
పలాసలో బందు విఫలం
చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకిస్తూ,టీడీపీ పార్టీ సోమవారం చేపట్టిన బంద్ శ్రీకాకుళంలో పూర్తిగా విఫలమైంది. జన జీవనం యధావిధిగా కొనసాగుతుంది. ఆర్టీసీ బస్సులను ఆపడానికి ప్రయత్నించిన టీడీపీ క్యాడరును అరెస్టు చేసి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment