న్యూఢిల్లీ: పట్టణ నివాస ప్రాంతాల్లో కోవిడ్–19 కేసులు ఎక్కువ సంఖ్యలో బయటపడుతుండటంతో కేంద్రం మరిన్ని వనరులను ఉపయోగించుకునేందుకు యోచిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు స్థానికులతో సన్నిహితంగా ఉండే రాజకీయ, మత నాయకుల సేవలను ఉపయోగించుకోవాలని రాష్ట్రాలను కోరింది. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేలా ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను వీరికి అప్పగించాలంది. అదేవిధంగా, ‘పట్టణ ప్రాంతాల్లో ‘సంఘటన ప్రతిస్పందన వ్యవస్థ’ను ఏర్పాటు చేసి, సమర్థుడైన వ్యక్తిని ‘ఇన్సిడెంట్ కమాండర్’గా నియమించాలి. ఈ కమాండర్ కరోనా సంబంధిత అంశాలపై ఎప్పటికప్పుడు మున్సిపల్ కమిషనర్‌కు సమాచారం అందించడంతోపాటు ఆయా కంటైన్‌మెంట్‌లలో ప్రణాళిక, నిర్వహణ, రవాణా, ఆర్థిక వ్యవహారాలను అమలు చేస్తుంటారు.
ఇన్సిడెంట్ కమాండర్ నేతృత్వంలో ఏర్పాటయ్యే సమన్వయ కమిటీలో ఆరోగ్య, మహిళాశిశు సంక్షేమ శాఖల అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, ఇప్పటికే ఆ ప్రాంతంలో సేవలందిస్తున్న ఎన్జీవోలు సభ్యులుగా ఉంటారు’ అని పేర్కొంది. ‘ప్రజలు తమ నివాస ప్రాంతాలకే పరిమితమయ్యేందుకు సెక్షన్–144 అమలు చేయడంతోపాటు, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇంటింటికీ వెళ్లి పరిశీలించాలి. ఇతర ప్రాంతాల నుంచి కంటైన్‌మెంట్లలోకి రాకపోకలను పూర్తిగా నిషేధించాలి. వీటిని ఎంత కచ్చితంగా అమలు చేస్తే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి’అని తెలిపింది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 80 శాతం వరకు ఏపీ, తెలంగాణల్లోని కర్నూలు, గ్రేటర్ హైదరాబాద్‌లతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 30 మున్సిపాలిటీల్లోనే ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment