ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: కరోనా మొదటి దశలో పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. గత ఏడాది పిల్లలు, టీనేజర్లు కరోనా బారిన పడిన దాఖలాలు చాలా తక్కువగా కనిపించాయి. కానీ సెకండ్ వేవ్‌లో మహమ్మారి పిల్లలను కూడా వదలడం లేదు. చిన్నారులకు కోవిడ్ సోకుతున్న కేసులు ఇటీవల దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయి.
కారణమేంటంటే..
ఈ ఏడాది ప్రారంభంలో కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. దాంతో పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోవడం మొదలుపెట్టారు. యువత కాలేజీలు, పాఠశాలలకు వెళ్లారు. ఈ లోపు కరోనావైరస్‌లో కొత్త మ్యుటేషన్లు పుట్టుకొచ్చాయి. బహిరంగ ప్రదేశాల్లో రద్దీ పెరగడం, సామాజిక దూరం పాటించకపోవడం, వైరస్ కొత్త మ్యుటేషన్‌లకు వేగంగా సోకే లక్షణం ఉండటం.. కేసుల పెరుగుదలకు కొన్ని కారణాలుగా భావిస్తున్నారు.
కరోనా సోకిన పిల్లల్లో ఉండే లక్షణాలేంటి..
పిల్లల్లో కోవిడ్ లక్షణాలు ఉన్నాయో లేదో.. ఒకవేళ చిన్నారులు మహమ్మారి బారిన పడితే తీసుకోవాల్సిన చర్యల గురించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేక మార్గాలు, మార్గదర్శకాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇక మంత్రిత్వ శాఖ ప్రకారం పిల్లల్లో ఎక్కువ మంది లక్షణాలు లేకుండానే మహమ్మారి బారిన పడుతున్నారని.. చాలా తక్కువ కేసుల్లోనే సింప్టమ్స్ కనిపిస్తున్నాయని తెలిపింది.
(ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)
పిల్లల్లో జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు,రుచి, వాసన కోల్పోవడం, మయాల్జియా(కండరాల నొప్పి, స్నాయువులో నొప్పి), రినోరియా(ముక్కు నుంచి విపరీతంగా నీరు కారడం.. క్రమేణా అది చిక్కని శ్లేష్మంగా మారడం), కొద్ది మంది పిల్లల్లో జీర్ణశయాంతర సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వీటితో పాటు వాంతులు, విరేచనాలు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటే కచ్చితంగా కరోనావైరస్ సోకిందని అనుమానించాలి. పసివాళ్లు నొప్పిగా ఉందని చెప్పలేరు కాబట్టి వాళ్లు నిరంతరం ఏడుస్తున్నా, విచిత్రంగా ప్రవర్తిస్తున్నా నొప్పితో బాధపడుతున్నారని అనుమానించాలి.
చికిత్స, ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితులు
సాధారణంగా పిల్లలు కోవిడ్ బారిన పడితే త్వరగానే కోలుకుంటారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక లక్షణాలు కనిపంచని వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందివ్వాలని.. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది.
విడవకుండా గొంతు నొప్పి, దగ్గు ఉన్నప్పుడు, తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినా, ఆయసం, ఆక్సిజన్ లెవల్స్ 90 శాతం కన్నా పడిపోయినా, విడవకుండా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి ఉంటే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
(ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)
కోవిడ్ సెకండ్ వేవ్‌ల్‌లో పైన చెప్పినా లక్షణాలే కాక ఇతర లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. చర్మం, పెదవులు, గోళ్లు పాలిపోవడం, చిరాకు పడటం, ఆపకుండా ఏడ్వడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
చదవండి:
పిల్లలకు కరోనా వస్తే.. ఈ మందులు వాడొద్దు
12 ఏళ్లు పైబడిన పిల్లలపై క్లినికల్ ట్రయల్స్
Comments
Please login to add a commentAdd a comment