
స్వైన్ ఫ్లూ అరికట్టేందుకు 144 సెక్షన్!
గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాను గడగడలాడిస్తున్న స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ విచిత్ర ఆదేశాలు జారీచేశారు. రోడ్లపై నలుగురు కలిసి నడవకూడదంటూ ఒక చోట గుమిగూడరాదంటూ భారతీయ శిక్షాస్మృతిలోని 144వ సెక్షన్ కింద జిల్లావ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించారు. ‘గుజరాత్‌లో, ముఖ్యంగా అహ్మదాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశం. ప్రజలు గుంపులు గుంపులుగా సంచరిస్తుండడం వల్ల ముక్కు ద్వారా, మూతి ద్వారా స్వైన్ ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఈ కారణంగా ముందస్తు అనుమతి లేకుండా గుంపులుగా ఎవరూ సంచరించకుండా ఇండియన్ పీనల్ కోడ్‌లోని 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధిస్తున్నాం’ అని మంగళవారం కలెక్టరేట్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
గత జనవరి నెల నుంచి ఇప్పటి వరకు గుజరాత్‌లో 231 మంది మరణించగా ఒక్క అహ్మదాబాద్ జిల్లాలోనే దాదాపు 50 మంది మరణించారు. గుజరాత్‌లో ఇప్పటి వరకు 3,527 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్‌లోనే ఈ వ్యాధి కారణంగా ఎక్కువమంది మరణించారని వైద్యాధికారులు తెలియజేశారు.