భగ్గుమన్న ఏజెన్సీ | tense at Utnoor agency amid Adivasis agitation, 144 section imposed | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 15 2017 9:47 PM | Last Updated on Sat, Dec 16 2017 4:13 AM

tense at Utnoor agency amid Adivasis agitation, 144 section imposed - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌/ఉట్నూర్‌/ఉట్నూర్‌రూరల్‌/నార్నూర్‌/ఆసిఫాబాద్‌:  
ఆదివాసీలు, లంబాడీల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. శుక్రవారం ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడంతో ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ ఏజెన్సీ అల్లకల్లోలంగా మారింది. ఏజెన్సీలోని నార్నూర్‌ మండలం బేతాల్‌గూడలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కుమురం భీం విగ్రహానికి చెప్పులదండ వేయడంతో వివాదం రాజుకుంది. విషయం తెలుసుకున్న ఆదివాసీలు.. శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో కుమురం భీం విగ్రహం వద్దకు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కానీ ఈ విషయం వాట్సాప్, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందడంతో ఏజెన్సీ  అట్టుడికిపోయింది. నార్నూర్‌ మండలం తాడిహత్నూర్‌లో ఇరువర్గాల వారు రోడ్డుపైకి చేరుకుని పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దుకాణాలు మూయించివేశారు. మరోవైపు గంగాపూర్, నార్నూర్, భీంపూర్‌ తదితర గ్రామాల్లో ఇరువర్గాల వారు కర్రలు పట్టుకొని రోడ్లపైకి వచ్చారు. బేతాల్‌గూడ ఘటనను నిరసిస్తూ ఆదివాసీలు ఇంద్రవెల్లి మండల కేంద్రంలో సేవాలాల్‌ జెండాలు ధ్వంసం చేశారు. అటు నార్నూర్‌ ఎక్స్‌రోడ్డులో ఉన్న ఆదివాసీ జెండాలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు.

హస్నాపూర్‌లో బీభత్సం
ఉట్నూర్‌ మండలం హస్నాపూర్‌లో ఆదివాసీలు ధర్నా చేస్తుండగా.. అక్కడికి లంబాడీలు చేరుకోవడంతో ఘర్షణ జరిగింది. ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఆదివాసీలు సోయం జుగాదిరావు, చాకటి బాపురావులకు గాయాలయ్యాయి. దీంతో గొడవలు మరింత ముదిరి ఇరువర్గాలు బీభత్సం సృష్టించాయి. ఉట్నూర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆందోళనకారులు హస్నాపూర్‌లోని మద్యం దుకాణానికి నిప్పుపెట్టారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అయినా ఇరువర్గాల వారు కర్రలు చేతపట్టుకుని ప్రధాన రహదారుల వెంట బీభత్సం సృష్టించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని నినాదాలు చేస్తూ ఆదివాసీలు ఆందోళనలు నిర్వహించారు.

ఉద్రిక్తంగానే పరిస్థితి..
ఇరువర్గాల మధ్య గొడవల సెగ శుక్రవారం రాత్రి సమయానికి మారుమూల గ్రామాలకు కూడా పాకింది. సిర్పూర్‌ (యూ) మండల కేంద్రంలో లంబాడీలకు చెందిన రామారావు మహరాజ్‌ విగ్రహాన్ని ఆదివాసీలు ధ్వంసం చేశారు. మండలకేంద్రంలోని లంబాడీలకు చెందిన పలు ఇళ్లపై దాడి చేశారు. దీంతో ఏజెన్సీలో ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. ఓ గిరిజన తండాకు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెస్తుండగానే.. మరో తండాలో గొడవలు మొదలయ్యాయన్న సమాచారంతో పోలీసు బలగాలు ఉరుకులు పరుగులు పెట్టాయి. పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు.

పోలీసు దిగ్బంధంలో ఏజెన్సీ
ఆదివాసీలు, లంబాడీల మధ్య ఘర్షణ, ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఉద్రిక్తత నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు.. కరీంనగర్‌ డీఐజీ సి.రవివర్మ శుక్రవారం సాయంత్రం ఉట్నూర్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు జ్యోతి బుద్ధప్రకాశ్, ఆర్వీ కర్ణన్, రామగుండం, కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్లు విక్రంజిత్‌ దుగ్గల్, కమలాసన్‌రెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల ఎస్పీలు కూడా ఉట్నూర్‌కు చేరుకుని భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గుడిపేట 13వ బెటాలియన్, డిచ్‌పల్లి 7వ బెటాలియన్‌ బలగాలు ఉట్నూర్‌కు చేరుకున్నాయి. నిర్మల్, మంచిర్యాల, డిచ్‌పల్లి, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం ప్రాంతాల నుంచి పోలీసు సిబ్బందిని రప్పించారు. శుక్రవారం రాత్రికే 600 మందికిపైగా పోలీసు బలగాలు మొహరించినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని పోలీసు బలగాలు ఏజెన్సీ ప్రాంతాలకు చేరుకుంటున్నాయి.

మూడు రోజుల పాటు 144 సెక్షన్‌
ఆదిలాబాద్‌ ఏజెన్సీ ప్రాంతంలో మూడు రోజులపాటు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. ఆదివాసీలు, లంబాడీలు శాంతించాలని విజ్ఞప్తి చేశారు.

ఘర్షణలో ప్రమాదం.. ఇద్దరు మృతి
హస్నాపూర్‌లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకుంటున్న సమయంలో రహదారిపై వెళుతున్న ఓ వాహనం నలుగురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో హస్నాపూర్‌కు చెందిన లంబాడీ యువకుడు రాథోడ్‌ జితేందర్‌ (28), జ్ఞానేశ్వర్, జాదవ్‌మోహన్‌లతోపాటు ఉట్నూర్‌కు చెందిన ఎస్‌కే.ఫారూక్‌ (45) గాయపడ్డారు. వారిని పోలీసులు వెంటనే ఉట్నూర్‌ ఆసుపత్రికి తరలించగా.. రాథోడ్‌ జితేందర్, ఎస్‌కే.ఫారూక్‌ మృతి చెందారు. ఈ ఘటనకు కారణమైన వాహనాన్ని గుర్తించలేదు. అయితే రాథోడ్‌ జితేందర్‌ను ఆదివాసీలే రాళ్లతో కొట్టి చంపారంటూ లంబాడీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు.

నేడు బంద్‌కు ఆదివాసీ సంఘాల పిలుపు
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం జిల్లాల పరిధిలో శనివారం బంద్‌కు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. కుమురం భీం విగ్రహాన్ని అవమానించడాన్ని ఆదివాసీ హక్కుల పొరాట సమితి, తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘం, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ తదితర సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

వదంతులను నమ్మొద్దు: డీఐజీ రవివర్మ
ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో ఎవరూ చనిపోలేదని డీఐజీ రవివర్మ పేర్కొన్నారు. ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయని తెలిపారు. దాడులు, మరణాల వదంతులు నమ్మవద్దని, పరిస్థితి చక్కబడేదాకా ఇళ్లు విడిచి బయటికి రావొద్దని గిరిజనులకు సూచించారు.

పరిస్థితి అదుపులోనే ఉంది: డీజీపీ
సాక్షి, హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉందని, భారీగా బలగాలను రంగంలోకి దింపామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. రెండు కంపెనీల ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌) బలగాలను ఆ ప్రాంతాలకు తరలించామని ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించేందుకు, అవసరమైన చర్యలు చేపట్టేందుకు ముగ్గురు ఐజీ ర్యాంకు అధికారులు డీఎస్‌ చౌహాన్, అనిల్‌కుమార్, వై నాగారెడ్డిలను పంపించామన్నారు. ప్రజాప్రతినిధులు కూడా నిగ్రహం పాటించాలని, సాధారణ పరిస్థితులు నెలకొనేలా అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. హింసాత్మక ఘటనలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘర్షణల్లో పలువురు చనిపోయినట్లుగా సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని.. వాటిని నమ్మవద్దని సూచించారు. ఈ ఘటనల్లో ఎవరూ మృతి చెందలేదని, నార్నూర్‌ మండలం హస్నాపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాత్రం ఇద్దరు మాత్రం చనిపోయారని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement