Adivasis fighting
-
అధికారుల అంచనా తప్పిందా!?
సాక్షి, ఆదిలాబాద్ :అంచనా తప్పిందా.. ఆదివాసీ ఉద్యమం విషయంలో యంత్రాంగం తప్పటడుగు పడిందా.. అంటే అవుననే సమాధానమే వస్తుంది. సద్దుమణిగిందనే భావన.. ఇంటెలిజెన్స్ నివేదికలు అలాగే ఉన్న పరిస్థితుల్లో మరోసారి ఉద్యమ గళం ఉలిక్కిపడేలా చేసింది. డిసెంబర్ 9న ఢిల్లీలో తలపెట్టిన ఆదివాసీ సభ నేపథ్యంలో తాజాగా ఆదివాసీలు ఉట్నూర్‌లో కదం తొక్కడం బలప్రదర్శనగానే భావిస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి నేరుగానే హెచ్చరికలు జారీ చేశారు. రెండేళ్ల కిందట జిల్లాలో ఉత్పన్నమైన పరిస్థితుల నుంచి పూర్తిగా కుదుట పడ్డామన్న భావనలో ఉన్న జిల్లా యంత్రాంగానికి ఇది మింగుడుపడని వ్యవహారమే. తాజా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆందోళనకరమే. రెండేళ్ల పరిస్థితుల నుంచి.. డిసెంబర్ 9.. మళ్లీ ఈ తేదీకి ప్రాధాన్యం ఏర్పడింది. సరిగ్గా రెండేళ్ల క్రితం 2017లో ఆదివాసీలు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. సరిగ్గా ఆ రోజే ఈ ఉద్యమానికి నాంది పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆ రోజు హైదరాబాద్ సభకు పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివెళ్లారు. అప్పుడు ఈ ఉద్యమం పెద్దస్థాయిలో రాజుకుంటుందని అంచనా వేయలేకపోయారు. ఆ సభ తర్వాత ఉమ్మడి జిల్లాలో పూర్తిగా శాంతిభద్రతలు అదుపుతప్పి ఉద్యమ తీవ్రతను చాటింది. ఈ పరిస్థితుల్లో అప్పుడు ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు ప్రాధాన్యం సంతరించుకుంది. అప్పటి ఆదిలాబాద్ కలెక్టర్ జ్యోతిబుద్ధప్రకాష్, నిర్మల్ కలెక్టర్ ఇలంబరిది, కుమురంభీం కలెక్టర్ చంపాలాల్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్, కుమురంభీం ఎస్పీ సన్ప్రీత్సింగ్ల బదిలీలు చోటుచేసుకున్నాయి. వారి స్థానంలో అప్పుడున్న పరిస్థితుల్లో ఆదిలాబాద్ కలెక్టర్‌గా దివ్యదేవరాజన్, నిర్మల్ కలెక్టర్‌గా ప్రశాంతి, కుమురంభీం కలెక్టర్‌గా ప్రశాంత్ జీవన్‌పాటిల్, విష్ణు ఎస్.వారియర్‌ను నిర్మల్ నుంచి ఆదిలాబాద్ ఎస్పీగా, కుమురంభీం జిల్లా ఎస్పీగా కల్మేశ్వర్లను నియమించారు. ఆ తర్వాత క్రమంలో కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఎస్పీ కల్మేశ్వర్‌ల బదిలీలు జరిగాయి. ఇక దివ్యదేవరాజన్, ప్రశాంతి, విష్ణు ఎస్.వారియర్లు అప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోనే ఉన్నారు. ప్రధానంగా శాంతిభద్రతలను అదుపులోకి తేవడం, ఆదివాసీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఆ తర్వాత క్రమంలో ఉమ్మడి జిల్లాలో పరిస్థితులు మారాయి. వరుసగా ఎన్నికలు రావడం, ఎన్నికల అనంతరం ఆదివాసీ ఉద్యమానికి ప్రధానంగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోయం బాపురావు ఎంపీ కావడంతో ఇక్కడ వాతావరణం మారుతుందని యంత్రాంగం భావిస్తూ వచ్చింది. ప్రధానంగా ఆదిలాబాద్ కలెక్టర్ దివ్యదేవరాజన్ ఆదివాసీలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి ఈ రెండేళ్ల కాలంలో విశేషంగా చొరవ చూపారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమ రూపం మారిందేమోనన్న భావన యంత్రాంగంలో కనిపించింది. బలప్రదర్శన.. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆదివాసీ ఉద్యమ తీవ్రత లేదనే భావనతో పోలీసు యంత్రాంగంలో కనిపించింది. అయితే ఇటీవల ఐటీడీఏ పాలకవర్గ సమావేశం రోజు ఉట్నూర్‌లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు సమావేశం నిర్వహించిన కుమురంభీం కాంప్లెక్స్ వద్దకు వచ్చి మీటింగ్‌ను అడ్డుకునే యత్నాలు చేయడం ఒక్కసారిగా పోలీసు వర్గాలను నివ్వేరపోయేలా చేసింది. ఊహించని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఆదివాసీలు కేబీ కాంప్లెక్స్‌కు తరలిరావడంతో వారికి ఈ పరిస్థితి కత్తిమీదా సాములా తయారైంది. అటు తర్వాత తాజాగా సోమవారం ఉట్నూర్‌లో ఆదివాసీలు తుడుందెబ్బ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించిన ర్యాలీని పోలీసు వర్గాలు అసలు అంచనా వేయలేకపోయింది. వేలాది మంది ఆదివాసీ మహిళలు, పురుషులు ఉట్నూర్‌కు తరలివచ్చిన విధానం పోలీసులకు ఇప్పటికీ అంతుపట్టని రీతిలో ఉంది. ఇక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తిగా విఫలమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు ఉట్నూర్‌కు అంతా పెద్దఎత్తున తరలిరావడం, అసలు ఎక్కడి నుంచి ఇంతమంది ఒక్కసారిగా వచ్చారు.. ఓ మెమోరాండం ఇచ్చేందుకు వస్తున్నారని తెలిసినా ఇంత పెద్ద ఎత్తున వస్తారని ఊహించలేకపోయారు. వీరందరు ఉట్నూర్ వరకు ఎలా వచ్చారన్న సమాచా రం లేకపోవడంతో పోలీసు శాఖలోనే విస్మ యం వ్యక్తం చేస్తోంది. అలాగే ఆదివాసీ ఉద్యమంలో సోమవారం జరిగిన ర్యాలీ చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది. వారు ర్యాలీ నిర్వహిం చిన విధానం ఎవ్వరికి అంతుపట్టని రీతిలో ఉం ది. పోలీసు వర్గాలనే విస్మయ పర్చేలా ఆదివాసీ ఉద్యమ నాయకత్వం వ్యూహాలు రచిస్తున్నాయనడానికి నిన్న జరిగిన ర్యాలీయే నిదర్శనమన్న చర్చ సాగుతోంది. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఎంపీ సోయం బాపురావు పార్లమెం ట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్న సమయంలో అసలు ఈ ర్యాలీని ఎవరు అంచనా వేయలేకపోయారు. మరోపక్క ఎంపీ సో యం బాపురావు తాను ప్రత్యక్ష కార్యాచరణలో లేకపోయినా ఆయన కనుసన్నల్లోనే ఇది జరుగుతుందనేది పోలీసుల భావన. అయితే ఎవరికీ అంతుపట్టని రీతిలో ఉద్యమాన్ని కొనసాగించడం ద్వారా ఆదివాసీలు తమ సత్తా చాటుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే గళం.. డిసెంబర్ 9న ఢిల్లీలో ఆదివాసీలు భారీ సభ నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇందుకోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వేలాది మంది ఢిల్లీ తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సభ కోసం ఉమ్మడి జిల్లా నుంచి ప్రత్యేక రైళ్లను బుక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు అనేక బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో తరలివెళ్లేందుకు ఆదివాసీలు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా అనేక మంది ఆదివాసీలు విమానయానం ద్వారా కూడా హస్తీన బాట పట్టనున్నారు. దీంతో ఇప్పుడు మరోసారి డిసెంబర్ 9 ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానంగా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్‌తో 2017 డిసెంబర్ 9న హైదరాబాద్ సభ ద్వారా పడిన అడుగుకు ఇది కొనసాగింపుగా నిర్వహిస్తున్న సభగా నిర్వహిస్తున్నారు. ఆదివాసీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడి తరలివెళ్లేందుకు సిద్ధమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉంటే ఐటీడీఏ సమావేశం రోజు ఎంపీ సోయం బాపురావు వ్యాఖ్యలు అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొంతమంది అధికారులు ఆదివాసీల భాష నేర్చుకోవడం ద్వారా, గుస్సాడీ నృత్యం చేయడం ద్వారా ఉద్యమాన్ని అణచివేశారనే భావనలో ఉండవద్దని పరోక్షంగా హెచ్చరించడం ప్రస్తుత పరిస్థితులను తేటతెల్లం చేస్తున్నాయి. -
ఇంద్రవెల్లి ఘటనకు 38 ఏళ్లు
ఇంద్రవెల్లి(ఖానాపూర్): 1981 ఏప్రిల్.. 20న ‘జల్.. జంగల్.. జమీన్’ కోసం ఉద్యమించిన అడవి బిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. హక్కుల సాధనలో 13 మంది గిరిజనులు అమరులయ్యారు. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసిన అగ్నిశిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఈ ఘటనకు 38 ఏళ్లు. ఇప్పటికీ ఆ స్తూపం వద్ద ఏప్రిల్ 20న ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళులర్పించలేని దుస్థితి. గతం లోనైతే పోలీసుల బందూకుల నీడలో అమరుల స్తూపం ఉండేది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన తర్వాత 2015 సంవత్సరం నుంచి నామమాత్రపు ఆంక్షలు విధిస్తుండడంతో ఆదివాసీలు స్వేచ్ఛగా నివాళులర్పిస్తున్నారు. 33 ఏళ్లుగా నివాళులకు దూరం ఉమ్మడి రాష్ట్రం ఉన్నంత వరకు 33 ఏళ్లు అమరులకు నివాళులు అర్పించడానికి నాటి ప్రభుత్వం అనుమతిని వ్వలేదు. 20 ఏప్రిల్‌కు రెండు రోజుల ముందు నుంచే గుడిహత్నూర్, ఉట్నూర్ ప్రధాన రహదారిని దిగ్భందం చేయడంతోపాటు ఇంద్రవెల్లి మండల కేంద్రం పరిసరా ల్లో 19వ తేదీ ఉదయం నుంచి 25 వరకు 144 సెక్షన్ విధించేవారు. 2004లో అప్పటి బోథ్ ఎమ్మెల్యే సోయం బాపూరావ్, ఎంపీ మధుసూదన్‌రెడ్డితో కలిసి ఏప్రిల్ 20కి బదులు 25న నివాళులర్పించారు. అప్పటి నుంచి ఏటా ఆదివాసీ గిరిజనులు 25న వారి సంప్రదాయ ప్రకారం నివాళులర్పిస్తున్నారు. 2015న ఏప్రిల్‌లో ప్రత్యేక రాష్ట్రం లో ఆదివాసీ సంఘాల కోరిక మేరకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వకపోయినా ఆంక్షలు సడలించి స్తూ పం వద్ద నివాళులర్పించడానికి రెండు గంటల సమయం ఇస్తోంది. ఈసారి కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలీసు భద్రతతో కూడిన అనుమ తిని ఇవ్వడంతో ఏప్రిల్ 20న శనివారం స్తూపాన్ని చేరు కోవడానికి ఆదివాసులు సిద్ధమయ్యారు. అప్పుడేం జరిగిందంటే.. స్వాతంత్య్రం వచ్చి 35 ఏళ్లు దాటినా ఆదివాసీల సమస్యల పరిష్కారానికి నోచుకోలేదు. చట్టబద్ధమైన హక్కు ల సాధన కోసం పీపుల్స్‌వార్ ఆధ్వర్యంలో 1981 ఏప్రిల్ 20న గిరిజన రైతు కులీ సంఘం పేరిట ఇంద్రవెల్లి గిరిజనులు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతివ్వకపోయిన ఆ రోజు సోమవారం వారసంత కావడం.. ఇటు సభ ఏర్పాటు చేయడంతో ఉదయం నుం చే నలువైపులా నుంచి ఆదివాసీలు భారీగా తరలివచ్చా రు. మధ్యాహ్నం మూడు గంటలకే ఇంద్రవెల్లి గిరి పుత్రులతో కిక్కిరిసిపోయింది. సభ స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. గిరిజనులు వినకుండా ర్యాలీగా బయలుదేరారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతోపాటు ముందున్న గిరిజన యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఆ యువతి సదరు పోలీసుపై దాడి చేసి చంపేసింది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు తూటాల వర్షం కుర్పించారు. ఈ కాల్పుల్లో కేవలం 13 మంది మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వం రికార్డులో ఉంది. కానీ, సుమారు 60 మంది చనిపోయినట్లు పౌరహక్కుల సంఘం నిజనిర్ధరణ కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసింది. ఆదివాసీ సంఘాలు చేసిన సర్వేలో ప్రస్తుతం 20 మంది చనిపోయినట్లు ఉంది. ఈ ఘటన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య పిట్టబొంగరంను సందర్శించి బాధితులను ఆదుకుం టామని హామీ ఇచ్చిన నేటికీ నెరవేరలేదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అమరుల కుటుంబాలను ఆదుకోవాలని ఆదివాసీ గిరిజనులు కోరుతున్నారు. నేడు 144 సెక్షన్.. మండలంలో 19న సాయంత్రం నుంచి 20 వరకు 30 యాక్టుతోపాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని డీఎస్పీ డేవిడ్ తెలిపారు. ఆదివాసీలు ప్రశాంత వాతావరణంలో నివాళులర్పించాలనీ, తాము 500 మందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
‘ఆదివాసీ ఉద్యమాన్ని అణచివేస్తున్న సీఎం’
సాక్షి,ఆసిఫాబాద్: సీఎం కేసీఆర్ ఆదివాసీ ఉద్యమాన్ని అణగదొక్కుతూ, లంబాడాలకు వత్తాసు పలుకుతున్నారని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు, తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెస్రం మోతీరాం, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాయిసెంటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో లంబాడాలతో సమావేశం నిర్వహించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఆదివాసీల సమస్యను పక్కన పెట్టి గ్రామ పంచాయతీల పేరుతో తండాలకు ప్రాధాన్యం కల్పించడం బాధాకరమన్నారు. గత నాలుగు నెలలుగా ఆదివాసీ ఉద్యమం జరుగుతున్నా ప్రభుత్వం స్పందించక పోవడం శోఛనీయమని పేర్కొన్నారు. టీఆర్టీలో లంబాడాలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం కల్పించవద్దని డిమాండ్ చేశారు. అలాంటి పరిస్థితి వస్తే ఉద్యమాన్ని తిరిగి ప్రారంభిస్తామని హెచ్చరించారు. తమ సమస్యల పరిష్కారంలో భాగంగా ఈ నెల 9న నార్నూర్‌లో పెద్ద ఎత్తున ఆదివాసీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు, ఈ సమావేశానికి ఆదివాసీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో ఏటీఈ జిల్లా అధ్యక్షుడు కొట్నాక తెలంగరావు, ప్రధాన కార్యదర్శి కొట్నాక ప్రవీణ్, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి గెడం గోపీచంద్, ఏవీఎస్ జిల్లా ఇన్చార్జి కొట్నక గణపతి, సంఘ నాయకులు మడావి గణవంత్‌రావు, కొట్నాక మెహపత్‌రావు, వెడ్మ బాదు పటేల్, సుధాకర్, ఆత్రం అనిల్, సిడాం శంకర్ పాల్గొన్నారు. -
15 ఏళ్ల పోరాటంలో సాధించినదేమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో భూమి హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలపై పోలీసు తూటాలు పేలి 16 మంది ఆదివాసీలు మరణించిన సంఘటనకు సోమవారం నాటికి సరిగ్గా 15 ఏళ్లు. ఆ నాటి సంఘటనలో వినోద్ అనే పోలీసు అధికారి మరణించడంతోపాటు వందలాది మంది ఆదివాసీలు గాయపడ్డారు. వరుసగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఆదివాసీలకు భూమి హక్కులు కల్పిస్తామంటూ హామీలు ఇవ్వడం, నెరవేర్చక పోవడం పట్ల విసిగెత్తిన కేరళ ఆదివాసీలు 'ఆదివాసీ గోత్ర మహాసభ' పేరిట ఏకమయ్యారు. ఈ మహాసభ బ్యానర్ కింద కే. గీతానందన్, సీకే జాను అనే యువకులు వేలాది మంది ఆదివాసీ కుటుంబాలను సమీకరించి 2003, ఫిబ్రవరి 19వ తేదీన నిరసన ప్రదర్శన జరిపారు. కేరళ జనాభాలో ఆదివాసీలు కేవలం 1.1 శాతం, అంటే 3.6 లక్షల మంది ఉన్నారు. వారంతా వేయనాడు, పలక్కాడ్, ఇదుక్కి, పట్టణంతిట్ట, కొల్లాం, తిరువనంతపురం జిల్లాల్లోని అటవి ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకొని బతుకుతుండేవారు. 1970 దశకం నుంచి వారి నుంచి భూములు ఆదివాసేతరులకు అన్యాక్రాంతం అవుతూ వచ్చాయి. దాంతో అనేక ఆదివాసీ కుటుంబాలు వ్యవసాయానికి దూరమై పస్తులతో అవస్థలు పడసాగారు. 1975లో తిరిగి వారి భూములను వారికి వెనక్కి ఇచ్చేస్తామంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ చట్టాన్ని అమలు చేయడంలో సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ప్రభుత్వం విఫలమయ్యాయి. 2001లో రాష్ట్రమంతా ఓనం సందర్భంగా ప్రజలు పండుగ జరుపుకుంటుంటే 30 మంది ఆదివాసీలు ఆకలితో చనిపోయారు. దాంతో జాను అనే యువకుడి ఆధ్వర్యంలో భూమి హక్కుల కోసం పోరాడేందుకు ఆదివాసీ దళిత కార్యాచరణ సమితి ఏర్పడింది. అదే ఆ తర్వాత ఆదివాసీ గోత్ర మహాసభగా మారింది. దళిత కార్యాచరణ సమితి ఆధ్వర్యాన వేలాది మంది ఆదివాసీలు తిరువనంతపురం వెళ్లి అక్కడి సీఎం కార్యాలయం ముందు గుడిశెలు వేసి 48 గంటలపాటు ఆందోళన నిర్వహించారు. భూమిలేని ఆదివాసీలకు ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు భూమి ఇస్తామని సీఎం కార్యాలయం స్పష్టమైన హామీ ఇవ్వడంతో అప్పుడు ఆందోళనను విరమించారు. మరో రెండేళ్లు గడిచిపోయినా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. 2003, ఫిబ్రవరి నెలలో వేలాది మంది ఆదివాసీలు తమిళనాడు, కర్ణాటక సరిహద్దులోని ముతంగా అటవీ ప్రాంతాన్ని ఆక్రమించుకొని స్వయం పాలన ప్రకటించారు. భూమిని దున్నడం మొదలు పెట్టారు. వారిని అటవి నుంచి ఖాళీ చేయించేందుకు పోలీసులు బలప్రయోగం చేశారు. ఆ నాటి సంఘటనల్లో ఒక ఆదివాసి, ఓ పోలీసు అధికారి మాత్రమే మరణించారని ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించగా 16 మంది ఆదివాసీలను చంపేశారని ఆదివాసీ నాయకులు ఆరోపించారు. తమను కూడా పోలీసు స్టేషన్లో నిర్బంధించి తీవ్రంగా హింసించారని జాను, గీతానందన్లు నాడు ఆరోపించారు. 2014లో మరోసారి ఆదివాసీలు ఆందోళన చేశారు. కేంద్రం ప్రభుత్వం ఆధీనంలోని 19,600 అటవి భూములను పంచడంతోపాటు వారి డిమాండ్లన్నింటిని పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆదివాసీలు తమ 162 రోజుల ఉద్యమాన్ని నిలిపివేశారు. మరోసారి రాష్ట్ర ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోలేక పోయింది. 2016, కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాను ఆధ్వర్యంలో ఆదివాసీ గోత్ర మహాసభలోని ఓ వర్గం చీలిపోయింది. ఆమె తన వర్గానికి జనాధిపత్య రాష్ట్రీయ సభగా నామకరణం చేసి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయోలో చేరారు. మరోవర్గానికి గీతానందన్ నాయకుడిగా ఉండిపోయారు. ఆదివాసీ పోరాటం సందర్భంగా జానును జాతి వ్యతిరేక శక్తిగా, ఆదివాసీలను పరమతంలోకి మారుస్తోందని ఆరోపించిన బీజేపీనే ఆ తర్వాత ఆమె వర్గాన్ని ఎన్డీయోలో చేర్చుకోవడం విశేషం. నాడు ఆందోళనలో పాల్గొన్న 283 కుటుంబాలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు భూములు లభించాయి. ఇంకా వేలాది మంది ఆదివాసీ కుటుంబాలకు న్యాయం జరగాల్సి ఉంది. అయితే తాము నిర్వహించిన ఆందోళన ద్వారా ఆదివాసీల్లో పోరాట స్ఫూర్తి పెరిగిందని, ఆ స్ఫూర్తితోనే అందరికి భూములు లభించే వరకు పోరాటం కొనసాగిస్తామని జాను 15వ వార్షికోత్సవం సందర్భంగా మీడియాకు తెలిపారు. తమ పోరాటం ద్వారా అందరికి భూములు లభించక పోయినప్పటికీ ప్రభుత్వం ప్రణాళిక రూపకల్పనలో తమను భాగస్వాములను చేస్తున్నారని, అది తాము సాధించిన విజయమేనని గీతానందన్ చెప్పారు. పోలీసు అధికారిన చంపారంటూ 180 మంది ఆదివాసీలపై పెట్టిన కేసులో ఇంకా విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, జోగి అనే ఆదివాసీని పోలీసులు చంపారన్న కేసులో ఇంకా దర్యాప్తు ప్రారంభించాల్సి ఉంది. -
ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి ఉద్రిక్తత
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని నేరేడుగొండలో ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. లంబాడీలు దాడి చేశారంటూ జాతీయ రహదారిపై ఆదివాసీలు రాస్తారోకోకు దిగారు. దీంతో రహదారిపై 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మరో వైపు ఆదివాసీ మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి నిరసన తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత జరిగింది. కాగా జిల్లాలో 144 సెక్షన్ విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా జిల్లాలోని ఉట్నూరులో శుక్రవారం జరిగిన ఉద్రిక్తత నేపథ్యంలో ఆందోళనకారులు శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో జిల్లా కేంద్రంలో వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఎక్కడి బస్సులను అక్కడ నిలిచి పోయాయి. ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు మొహరించాయి. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుతున్నాయి. -
ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి ఉద్రిక్తత
-
ఓయూలో లంబాడీ విద్యార్థుల ధర్నా
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో లంబాడీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. విద్యార్థులు శనివారం తరగతులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులు వీసీ ఛాంబర్ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కాగా ఆదివాసీలు, లంబాడీలు శుక్రవారం పరస్పర దాడులకు దిగడంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే.ఏజెన్సీలోని నార్నూర్ మండలం బేతాల్‌గూడలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కుమురం భీం విగ్రహానికి చెప్పులదండ వేయడంతో వివాదం రాజుకుంది. -
భగ్గుమన్న ఏజెన్సీ
సాక్షి, ఆదిలాబాద్/ఉట్నూర్/ఉట్నూర్‌రూరల్/నార్నూర్/ఆసిఫాబాద్: ఆదివాసీలు, లంబాడీల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. శుక్రవారం ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ అల్లకల్లోలంగా మారింది. ఏజెన్సీలోని నార్నూర్ మండలం బేతాల్‌గూడలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కుమురం భీం విగ్రహానికి చెప్పులదండ వేయడంతో వివాదం రాజుకుంది. విషయం తెలుసుకున్న ఆదివాసీలు.. శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో కుమురం భీం విగ్రహం వద్దకు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కానీ ఈ విషయం వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందడంతో ఏజెన్సీ అట్టుడికిపోయింది. నార్నూర్ మండలం తాడిహత్నూర్‌లో ఇరువర్గాల వారు రోడ్డుపైకి చేరుకుని పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దుకాణాలు మూయించివేశారు. మరోవైపు గంగాపూర్, నార్నూర్, భీంపూర్ తదితర గ్రామాల్లో ఇరువర్గాల వారు కర్రలు పట్టుకొని రోడ్లపైకి వచ్చారు. బేతాల్‌గూడ ఘటనను నిరసిస్తూ ఆదివాసీలు ఇంద్రవెల్లి మండల కేంద్రంలో సేవాలాల్ జెండాలు ధ్వంసం చేశారు. అటు నార్నూర్ ఎక్స్‌రోడ్డులో ఉన్న ఆదివాసీ జెండాలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. హస్నాపూర్‌లో బీభత్సం ఉట్నూర్ మండలం హస్నాపూర్‌లో ఆదివాసీలు ధర్నా చేస్తుండగా.. అక్కడికి లంబాడీలు చేరుకోవడంతో ఘర్షణ జరిగింది. ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఆదివాసీలు సోయం జుగాదిరావు, చాకటి బాపురావులకు గాయాలయ్యాయి. దీంతో గొడవలు మరింత ముదిరి ఇరువర్గాలు బీభత్సం సృష్టించాయి. ఉట్నూర్ ఎక్స్‌రోడ్డు వద్ద పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆందోళనకారులు హస్నాపూర్‌లోని మద్యం దుకాణానికి నిప్పుపెట్టారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అయినా ఇరువర్గాల వారు కర్రలు చేతపట్టుకుని ప్రధాన రహదారుల వెంట బీభత్సం సృష్టించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని నినాదాలు చేస్తూ ఆదివాసీలు ఆందోళనలు నిర్వహించారు. ఉద్రిక్తంగానే పరిస్థితి.. ఇరువర్గాల మధ్య గొడవల సెగ శుక్రవారం రాత్రి సమయానికి మారుమూల గ్రామాలకు కూడా పాకింది. సిర్పూర్ (యూ) మండల కేంద్రంలో లంబాడీలకు చెందిన రామారావు మహరాజ్ విగ్రహాన్ని ఆదివాసీలు ధ్వంసం చేశారు. మండలకేంద్రంలోని లంబాడీలకు చెందిన పలు ఇళ్లపై దాడి చేశారు. దీంతో ఏజెన్సీలో ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. ఓ గిరిజన తండాకు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెస్తుండగానే.. మరో తండాలో గొడవలు మొదలయ్యాయన్న సమాచారంతో పోలీసు బలగాలు ఉరుకులు పరుగులు పెట్టాయి. పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. పోలీసు దిగ్బంధంలో ఏజెన్సీ ఆదివాసీలు, లంబాడీల మధ్య ఘర్షణ, ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఉద్రిక్తత నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు.. కరీంనగర్ డీఐజీ సి.రవివర్మ శుక్రవారం సాయంత్రం ఉట్నూర్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు జ్యోతి బుద్ధప్రకాశ్, ఆర్వీ కర్ణన్, రామగుండం, కరీంనగర్ పోలీస్ కమిషనర్లు విక్రంజిత్ దుగ్గల్, కమలాసన్‌రెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఎస్పీలు కూడా ఉట్నూర్‌కు చేరుకుని భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గుడిపేట 13వ బెటాలియన్, డిచ్పల్లి 7వ బెటాలియన్ బలగాలు ఉట్నూర్‌కు చేరుకున్నాయి. నిర్మల్, మంచిర్యాల, డిచ్పల్లి, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం ప్రాంతాల నుంచి పోలీసు సిబ్బందిని రప్పించారు. శుక్రవారం రాత్రికే 600 మందికిపైగా పోలీసు బలగాలు మొహరించినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని పోలీసు బలగాలు ఏజెన్సీ ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. మూడు రోజుల పాటు 144 సెక్షన్ ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో మూడు రోజులపాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఆదివాసీలు, లంబాడీలు శాంతించాలని విజ్ఞప్తి చేశారు. ఘర్షణలో ప్రమాదం.. ఇద్దరు మృతి హస్నాపూర్‌లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకుంటున్న సమయంలో రహదారిపై వెళుతున్న ఓ వాహనం నలుగురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో హస్నాపూర్‌కు చెందిన లంబాడీ యువకుడు రాథోడ్ జితేందర్ (28), జ్ఞానేశ్వర్, జాదవ్మోహన్లతోపాటు ఉట్నూర్‌కు చెందిన ఎస్కే.ఫారూక్ (45) గాయపడ్డారు. వారిని పోలీసులు వెంటనే ఉట్నూర్ ఆసుపత్రికి తరలించగా.. రాథోడ్ జితేందర్, ఎస్కే.ఫారూక్ మృతి చెందారు. ఈ ఘటనకు కారణమైన వాహనాన్ని గుర్తించలేదు. అయితే రాథోడ్ జితేందర్‌ను ఆదివాసీలే రాళ్లతో కొట్టి చంపారంటూ లంబాడీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. నేడు బంద్‌కు ఆదివాసీ సంఘాల పిలుపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం జిల్లాల పరిధిలో శనివారం బంద్‌కు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. కుమురం భీం విగ్రహాన్ని అవమానించడాన్ని ఆదివాసీ హక్కుల పొరాట సమితి, తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘం, ఆదివాసీ సంక్షేమ పరిషత్ తదితర సంఘాలు తీవ్రంగా ఖండించాయి. వదంతులను నమ్మొద్దు: డీఐజీ రవివర్మ ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో ఎవరూ చనిపోలేదని డీఐజీ రవివర్మ పేర్కొన్నారు. ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయని తెలిపారు. దాడులు, మరణాల వదంతులు నమ్మవద్దని, పరిస్థితి చక్కబడేదాకా ఇళ్లు విడిచి బయటికి రావొద్దని గిరిజనులకు సూచించారు. పరిస్థితి అదుపులోనే ఉంది: డీజీపీ సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉందని, భారీగా బలగాలను రంగంలోకి దింపామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. రెండు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలను ఆ ప్రాంతాలకు తరలించామని ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించేందుకు, అవసరమైన చర్యలు చేపట్టేందుకు ముగ్గురు ఐజీ ర్యాంకు అధికారులు డీఎస్ చౌహాన్, అనిల్‌కుమార్, వై నాగారెడ్డిలను పంపించామన్నారు. ప్రజాప్రతినిధులు కూడా నిగ్రహం పాటించాలని, సాధారణ పరిస్థితులు నెలకొనేలా అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. హింసాత్మక ఘటనలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘర్షణల్లో పలువురు చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని.. వాటిని నమ్మవద్దని సూచించారు. ఈ ఘటనల్లో ఎవరూ మృతి చెందలేదని, నార్నూర్ మండలం హస్నాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాత్రం ఇద్దరు మాత్రం చనిపోయారని వివరించారు. -
ఉట్నూరు, ఇంద్రవెల్లిల్లో 144 సెక్షన్
-
ఆదివాసీ బాంధవుడు బి.డి. శర్మ
ఆదివాసీ హక్కుల కోసం నిరంతరం తపనపడ్డ బ్రహ్మదేవ్ శర్మ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పట్టణంలో 1930 సంవత్సరంలో జన్మించారు. గణితశాస్త్రంలో డాక్టరేట్ డిగ్రీ (పిహెచ్ డి) పొందారు. 1952–53 సంవత్సరంలోనె సివిల్ సర్వీసులో చేరారు. అయన ఉన్నత కుటుం బంలో జన్మించి కూడా హజ్రత్ నిజమోద్దిన్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక మురికివాడలో నివసించారు. ఆయన ఉంటున్న చిన్న గది గది నిండా పుస్తకాలు తప్ప ఇక ఏ సౌకర్యాలూ లేవంటే నమ్మశాక్యం కాదు. తలుపులు తాళాలు లేని ఇల్లు ఎవరిదంటే ఆయనదే అని చెప్పవచ్చు. ఒక జాతీయ ఎలక్రానిక్ చానెల్ మహిళా రిపోర్టర్ ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన సందర్బంలో, బి.డి శర్మ జీవించే పద్ధతి చూసి చలించిపోయి ఏడవడం మొదలుపెట్టింది. ఈరోజుల్లో ఒక చిన్న పదవి ఉందంటే చాలు.. విలాసవంతమైన జీవితాలు గడిపే రోజులివి. మరి ఈయన అంత సంపన్నుడైనప్పటికీ కూడా ఇంతటి సాదాసీదా జీవితం గడుపుతున్నాడంటే ఎంతటి నిరాడంబరుడో, మాన్య మహనీయుడో అర్థమవుతున్నది. భారత రాజ్యాంగాన్ని 26 నవంబర్ 1949 రాజ్యాంగ సభ ఆమోదించడంతో భారత ప్రజలకు స్వాతంత్రం, రాజ్యాంగ పరమైన హక్కులు లభించాయని అందరూ భావించారు. కానీ ఆ రోజే ఈ దేశంలోని సమస్త ఆదివాసులు తమ స్వేచ్చను, తమ సహజమైన హక్కులను కోల్పోయారని కరాఖండిగా అన్ని వేదికల మీద గొంతెత్తిన పోరాటాయోదుడు బి.డి.శర్మ. దేశ వ్యాప్తంగా 5వ, 6వ షెడ్యుల్డ్ ప్రాంతాలలో నివసిస్తున్న ఆదివాసులకు ‘‘మా ఉళ్లో మా రాజ్యం’’ నినాదం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన అమూల్యమైన, విలువైన కానుక. శక్తిమంతమైన రక్షక కవచాల లాంటి 1917, 1919, 1935 భారత ఆదివాసీ చట్టాలను అవగాహన పరిచి 170 చట్టం ,పిసా1996, ఎల్టిఆర్ 1959, ఎస్సి, ఎస్టి నిరోధకచట్టం 1998 ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్, ఐటీడీఏల ఏర్పాటు ప్రక్రియలో ఒక రూపకర్తగా, ఒక ప్రముఖుడిగా శర్మ నిలిచిపోయారు. దీన్ని బట్టే ఆదివాసీలకు ఆయనకు ఉన్న సంబంధం ఏపాటిదో అర్థమౌతుంది. చివరికి ఆదివాసీలఫై ప్రభుత్వం వైఖరికి నిరసనగా తన ఐఏఎస్ ఉద్యోగానికే రాజీనామా చేసిన గొప్ప త్యాగధనుడు. చివరి క్షణం వరకూ ఆదివాసీల ప్రయోజనాల కోసమే జీవించారు. ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని ఒక ఉన్నత అధికారిగా ఉంటూ వ్యతిరేకించిన ధైర్యశాలి. అలాంటి మహా నుభావుడిని ఆదివాసులు ఏ విధంగా మరచిపోగలరు? ‘‘జీవితం ఒక తరం పాటే ఉంటుంది /మంచి పేరు చిరకాలం ఉంటుంది’’ అన్నట్లుగా ఆదివాసీలు బి.డి. శర్మను చిరకాలం గుర్తుంచుకోగలుగుతారు. ఆదివాసీ హక్కులు, చట్టాలు ఏ రోజైతే పరిపూర్ణంగా అమలవుతాయో అదే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి! (నేడు డా. బి.డి. శర్మ 2వ వర్ధంతి సందర్భంగా) - పెనుక ప్రభాకర్, ఆదివాసీ రచయితల సంఘం, తెలంగాణ ‘ మొబైల్ 94942 83038 -
గుజరాత్ పాలక పక్షానికి ఊహించని పరిణామం
సాక్షి, గాంధీనగర్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి ఊహించని ప్రతికూల పరిణామం ఎదురయింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 15 శాతం ఉన్న ఆదివాసీలు లేదా ఎస్టీ సర్టిఫికెట్ కలిగిన దళితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ఆడవుల్లో నివసించే గిరి జాతీయులకే కాకుండా రాబ్రి, భార్వడ్, చరణ్ కులస్థులకు కూడా ఎస్టీ హోదా కల్పించడం పట్ల వారు ఆగ్రహోదగ్రులవుతున్నారు. ఇతరులకు కూడా రిజర్వేషన్లు కల్పించడం వల్ల తమకు కేటాయించిన రిజర్వేషన్లు నీరుగారి పోతున్నాయని ఆరోపిస్తూ వారు రాష్ట్రంలో పలుచోట్ల ప్రదర్శనలు నిర్వహించారు. నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై రానున్న నవంబర్ 18వ తేదీన తాపి జిల్లాలోని వైరా వద్ద రాష్ట్ర స్థాయి సమ్మేళనం నిర్వహిస్తున్నారు. దీనికి 29 ట్రైబల్ ఉప కులాల అధ్యక్షులు హాజరవుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఆదివాసీలను సమీకరిస్తున్నారు. ఈ సమ్మేళనంలో తమ సమస్యను సమగ్రంగా చర్చించి భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించనున్నట్లు ఆదివాసీల ఆందోళనకు అగ్ర భాగాన నిలుస్తున్న ‘సమస్త్ ఆదివాసి సమాజ్’ అధ్యక్షుడు ప్రదీప్ గరాషియా తెలిపారు. తాత ముత్తాతలు అడవుల్లో నివసించిన ఆదివాసీలకు 1956లో రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ హోదాను కల్పించింది. అంతకుముందు ఎప్పుడో తమ తాత ముత్తాతలు కూడా అడవుల్లో నివసించారంటూ, తమకు ఎస్టీ హోదా ఇవ్వాలంటూ ముందుకు వచ్చిన రాబ్రి, భార్వడ్, చరణ్ కులాల వారిని ఎస్టీల కింద గుర్తించేందుకు అప్పటి ప్రభుత్వం అంగీకరించలేదు. రిజర్వేషన్ల విధానాన్ని విస్తరిస్తూ 2007లో, 2017, జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ల కింద ఆదివాసీల వారసులు ఎక్కడున్నా ఎస్టీ సర్టిఫికెట్ తీసుకోవచ్చనే వెసులుబాటును కల్పించింది. ఇంతకుమించి ఈ నోటిఫికేషన్ల వల్ల లాభనష్టాలేమిటో ఆదివాసీలు గ్రహించలేదు. మూడు నెలల క్రితం 68 మంది డిప్యూటి పోలీసు సూపరింటెండెంట్, డిప్యూటీ కలెక్టర్లకు నియామకాలు జరిగాయి. వీటిని ఎస్టీలకే కేటాయించగా, వాటిలో 35 పోస్టులు రాబ్రి, భార్వడ్, చరణ్ కులస్థులకు లభించాయి. కొత్త నోటిఫికేషన్ల ప్రకారం వారికి ఎస్టీ హోదా లభించడమే అందుకు కారణం. 1956లో ఎస్టీ హోదాకు అనర్హులైన వీరికి ఇప్పుడు ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల తాము నష్టపోతున్నామని గ్రహించిన ఆదివాసీలు, వారి ఉపకులాలు ఇప్పుడు ఆందోళన బాటపట్టాయి. కీలకమైన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివాసీలను కూడా మంచి చేసుకోవడం కోసం 2007 నాటితోపాటు గత అక్టోబర్ 11వ తేదీన జారీ చేసిన తాజా నోటిషికేషన్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు కేవలం ఓట్ల కోసమే స్థానిక బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్లను రద్దు చేసిందని, ఎన్నికల అనంతరం ఒక్క రాబ్రి, భార్వడ్, చరణ్ కులస్థులకే కాకుండా ఇతర కులాలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తు కొత్త చట్టం తీసుకొచ్చే ప్రమాదం ఉందని గ్రహించి ఆదివాసీలు పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. సకాలంలో ఆదివాసీల ఆందోళనను విరమింప చేయకపోతే రానున్న ఎన్నికల్లో నష్టపోవాల్సి వస్తుందని బారుచ్ బీజేపీ ఎంపీ మన్సుఖ్ వాసవ వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే దూరమైన పటీదార్లు, దూరం అవుతున్న ఠాకూర్లును ఎలా మంచి చేసుకోవాలనో అర్థం కాక తలపట్టుకు కూర్చున్న పాలక పక్ష బీజేపీకి ఆదివాసీల సమస్య మరింత తలనొప్పిగా తయారయింది. ఈ సమస్య పరిష్కారంలో తాత్సారం జరిగితే తల బొప్పికట్టక తప్పదు! ఎందుకంటే రాష్ట్రంలో ఎస్టీలకు 27 అసెంబ్లీ సీట్లు రిజర్వై ఉన్నాయి. వాటిలో గత ఎన్నికల్లో 16 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, బీజేపీ పది సీట్లను కైవసం చేసుకొంది. ఇప్పుడు 25 సీట్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. -
ఆదివాసీల పోరాటం
‘‘వర్షం పడ్డప్పుడు పాత నీరు వెళ్లిపోయి కొత్త నీరు వస్తుంటుంది. అదే విధంగా చిత్రపరిశ్రమలోకి కొత్త నటులు, సాంకేతిక నిపుణులు రావాలి. ‘నా తొలి చిత్రం ‘సింహరాశి’లో బాలనటుడిగా చేశాడు మహేంద్రన్. ‘పోరాటం’ సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. వీళ్ల ప్రయత్నం సక్సెస్ అవ్వాలి’’ అని దర్శకుడు సముద్ర అన్నారు. మహేంద్రన్, కిన్నీ వినోద్, తనూశెట్టి, ఐశ్వర్య, నాజర్ ప్రధాన పాత్రల్లో ఎం. ప్రతాప్ మురళి దర్శకత్వంలో శ్రీనివాస్‌రావు నిర్మిస్తోన్న చిత్రం ‘పోరాటం’. హరీష్–సతీష్ స్వరపరచిన ఈ చిత్రం పాటలు, ట్రైలర్‌ను తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ రిలీజ్ చేశారు. ‘‘ఓ సినిమాను ఒక్క భాషలో తీసినా, మూడు భాషల్లో తీసినా ఖర్చు విషయంలో పెద్ద తేడా ఉండదు. మూడు భాషల్లో తీస్తే మంచి బిజినెస్ ఉంటుంది. చిన్న సినిమాకి పబ్లిసిటీ అవసరం. అప్పుడే థియేటర్లు దొరుకుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ‘పోరాటం’ ఈ సినిమాకు అవసరమైన థియేటర్లు సమకూర్చేందుకు నా వంతు సహకారం అందిస్తా’’ అన్నారు ప్రతాని రామకృష్ణగౌడ్. ‘‘తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటన నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. రాజకీయ నాయకులు, పోలీసుల వల్ల తమకు జరుగుతున్న అన్యాయంపై ఆదివాసీల పోరాటమే ఈ సినిమా’’ అన్నారు.