ఆదివాసీల పోరాటం
‘‘వర్షం పడ్డప్పుడు పాత నీరు వెళ్లిపోయి కొత్త నీరు వస్తుంటుంది. అదే విధంగా చిత్రపరిశ్రమలోకి కొత్త నటులు, సాంకేతిక నిపుణులు రావాలి. ‘నా తొలి చిత్రం ‘సింహరాశి’లో బాలనటుడిగా చేశాడు మహేంద్రన్. ‘పోరాటం’ సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. వీళ్ల ప్రయత్నం సక్సెస్ అవ్వాలి’’ అని దర్శకుడు సముద్ర అన్నారు. మహేంద్రన్, కిన్నీ వినోద్, తనూశెట్టి, ఐశ్వర్య, నాజర్ ప్రధాన పాత్రల్లో ఎం. ప్రతాప్ మురళి దర్శకత్వంలో శ్రీనివాస్‌రావు నిర్మిస్తోన్న చిత్రం ‘పోరాటం’. హరీష్–సతీష్ స్వరపరచిన ఈ చిత్రం పాటలు, ట్రైలర్‌ను తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ రిలీజ్ చేశారు.
‘‘ఓ సినిమాను ఒక్క భాషలో తీసినా, మూడు భాషల్లో తీసినా ఖర్చు విషయంలో పెద్ద తేడా ఉండదు. మూడు భాషల్లో తీస్తే మంచి బిజినెస్ ఉంటుంది. చిన్న సినిమాకి పబ్లిసిటీ అవసరం. అప్పుడే థియేటర్లు దొరుకుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ‘పోరాటం’ ఈ సినిమాకు అవసరమైన థియేటర్లు సమకూర్చేందుకు నా వంతు సహకారం అందిస్తా’’ అన్నారు ప్రతాని రామకృష్ణగౌడ్. ‘‘తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటన నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. రాజకీయ నాయకులు, పోలీసుల వల్ల తమకు జరుగుతున్న అన్యాయంపై ఆదివాసీల పోరాటమే ఈ సినిమా’’ అన్నారు.