అధికారుల అంచనా తప్పిందా!? | Adivasis Novement In Adilabad Completed 2 years | Sakshi
Sakshi News home page

అంచనా తప్పిందా!?

Published Wed, Nov 20 2019 9:44 AM | Last Updated on Wed, Nov 20 2019 9:44 AM

Adivasis Novement In Adilabad Completed 2 years - Sakshi

కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌, ఎంపీ సోయం బాపురావు, ఎస్పీ ఎస్‌ వారియర్‌

సాక్షి, ఆదిలాబాద్‌ :అంచనా తప్పిందా.. ఆదివాసీ ఉద్యమం విషయంలో యంత్రాంగం తప్పటడుగు పడిందా.. అంటే అవుననే సమాధానమే వస్తుంది. సద్దుమణిగిందనే భావన.. ఇంటెలిజెన్స్‌ నివేదికలు అలాగే ఉన్న పరిస్థితుల్లో మరోసారి ఉద్యమ గళం ఉలిక్కిపడేలా చేసింది. డిసెంబర్‌ 9న ఢిల్లీలో తలపెట్టిన ఆదివాసీ సభ నేపథ్యంలో తాజాగా ఆదివాసీలు ఉట్నూర్‌లో కదం తొక్కడం బలప్రదర్శనగానే భావిస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి నేరుగానే హెచ్చరికలు జారీ చేశారు. రెండేళ్ల కిందట జిల్లాలో ఉత్పన్నమైన పరిస్థితుల నుంచి పూర్తిగా కుదుట పడ్డామన్న భావనలో ఉన్న జిల్లా యంత్రాంగానికి ఇది మింగుడుపడని వ్యవహారమే. తాజా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆందోళనకరమే.

రెండేళ్ల పరిస్థితుల నుంచి..
డిసెంబర్‌ 9.. మళ్లీ ఈ తేదీకి ప్రాధాన్యం ఏర్పడింది. సరిగ్గా రెండేళ్ల క్రితం 2017లో ఆదివాసీలు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఆధ్వర్యంలో చలో హైదరాబాద్‌ కార్యక్రమం నిర్వహించారు. సరిగ్గా ఆ రోజే ఈ ఉద్యమానికి నాంది పడింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఆ రోజు హైదరాబాద్‌ సభకు పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివెళ్లారు. అప్పుడు ఈ ఉద్యమం పెద్దస్థాయిలో రాజుకుంటుందని అంచనా వేయలేకపోయారు. ఆ సభ తర్వాత ఉమ్మడి జిల్లాలో పూర్తిగా శాంతిభద్రతలు అదుపుతప్పి ఉద్యమ తీవ్రతను చాటింది. ఈ పరిస్థితుల్లో అప్పుడు ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు ప్రాధాన్యం సంతరించుకుంది. అప్పటి ఆదిలాబాద్‌ కలెక్టర్‌ జ్యోతిబుద్ధప్రకాష్, నిర్మల్‌ కలెక్టర్‌ ఇలంబరిది, కుమురంభీం కలెక్టర్‌ చంపాలాల్, ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్, కుమురంభీం ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ల బదిలీలు చోటుచేసుకున్నాయి.

వారి స్థానంలో అప్పుడున్న పరిస్థితుల్లో ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా దివ్యదేవరాజన్, నిర్మల్‌ కలెక్టర్‌గా ప్రశాంతి, కుమురంభీం కలెక్టర్‌గా ప్రశాంత్‌ జీవన్‌పాటిల్, విష్ణు ఎస్‌.వారియర్‌ను నిర్మల్‌ నుంచి ఆదిలాబాద్‌ ఎస్పీగా, కుమురంభీం జిల్లా ఎస్పీగా కల్మేశ్వర్‌లను నియమించారు. ఆ తర్వాత క్రమంలో కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్, ఎస్పీ కల్మేశ్వర్‌ల బదిలీలు జరిగాయి. ఇక దివ్యదేవరాజన్, ప్రశాంతి, విష్ణు ఎస్‌.వారియర్‌లు అప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోనే ఉన్నారు. ప్రధానంగా శాంతిభద్రతలను అదుపులోకి తేవడం, ఆదివాసీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఆ తర్వాత క్రమంలో ఉమ్మడి జిల్లాలో పరిస్థితులు మారాయి. వరుసగా ఎన్నికలు రావడం, ఎన్నికల అనంతరం ఆదివాసీ ఉద్యమానికి ప్రధానంగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోయం బాపురావు ఎంపీ కావడంతో ఇక్కడ వాతావరణం మారుతుందని యంత్రాంగం భావిస్తూ వచ్చింది. ప్రధానంగా ఆదిలాబాద్‌ కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ ఆదివాసీలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి ఈ రెండేళ్ల కాలంలో విశేషంగా చొరవ చూపారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమ రూపం మారిందేమోనన్న భావన యంత్రాంగంలో కనిపించింది. 

బలప్రదర్శన..
శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆదివాసీ ఉద్యమ తీవ్రత లేదనే భావనతో పోలీసు యంత్రాంగంలో కనిపించింది. అయితే ఇటీవల ఐటీడీఏ పాలకవర్గ సమావేశం రోజు ఉట్నూర్‌లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు సమావేశం నిర్వహించిన కుమురంభీం కాంప్లెక్స్‌ వద్దకు వచ్చి మీటింగ్‌ను అడ్డుకునే యత్నాలు చేయడం ఒక్కసారిగా పోలీసు వర్గాలను నివ్వేరపోయేలా చేసింది. ఊహించని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఆదివాసీలు కేబీ కాంప్లెక్స్‌కు తరలిరావడంతో వారికి ఈ పరిస్థితి కత్తిమీదా సాములా తయారైంది. అటు తర్వాత తాజాగా సోమవారం ఉట్నూర్‌లో ఆదివాసీలు తుడుందెబ్బ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించిన ర్యాలీని పోలీసు వర్గాలు అసలు అంచనా వేయలేకపోయింది. వేలాది మంది ఆదివాసీ మహిళలు, పురుషులు ఉట్నూర్‌కు తరలివచ్చిన విధానం పోలీసులకు ఇప్పటికీ అంతుపట్టని రీతిలో ఉంది. ఇక్కడ ఇంటెలిజెన్స్‌ వర్గాలు పూర్తిగా విఫలమయ్యారన్న ప్రచారం జరుగుతోంది.

ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు ఉట్నూర్‌కు అంతా పెద్దఎత్తున తరలిరావడం, అసలు ఎక్కడి నుంచి ఇంతమంది ఒక్కసారిగా వచ్చారు.. ఓ మెమోరాండం ఇచ్చేందుకు వస్తున్నారని తెలిసినా ఇంత పెద్ద ఎత్తున వస్తారని ఊహించలేకపోయారు. వీరందరు ఉట్నూర్‌ వరకు ఎలా వచ్చారన్న సమాచా రం లేకపోవడంతో పోలీసు శాఖలోనే విస్మ యం వ్యక్తం చేస్తోంది. అలాగే ఆదివాసీ ఉద్యమంలో సోమవారం జరిగిన ర్యాలీ చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది. వారు ర్యాలీ నిర్వహిం చిన విధానం ఎవ్వరికి అంతుపట్టని రీతిలో ఉం ది. పోలీసు వర్గాలనే విస్మయ పర్చేలా ఆదివాసీ ఉద్యమ నాయకత్వం వ్యూహాలు రచిస్తున్నాయనడానికి నిన్న జరిగిన ర్యాలీయే నిదర్శనమన్న చర్చ సాగుతోంది. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఎంపీ సోయం బాపురావు పార్లమెం ట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్న సమయంలో అసలు ఈ ర్యాలీని ఎవరు అంచనా వేయలేకపోయారు. మరోపక్క ఎంపీ సో యం బాపురావు తాను ప్రత్యక్ష కార్యాచరణలో లేకపోయినా ఆయన కనుసన్నల్లోనే ఇది జరుగుతుందనేది పోలీసుల భావన. అయితే ఎవరికీ అంతుపట్టని రీతిలో ఉద్యమాన్ని కొనసాగించడం ద్వారా ఆదివాసీలు తమ సత్తా చాటుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అదే గళం..
డిసెంబర్‌ 9న ఢిల్లీలో ఆదివాసీలు భారీ సభ నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇందుకోసం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి వేలాది మంది ఢిల్లీ తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సభ కోసం ఉమ్మడి జిల్లా నుంచి ప్రత్యేక రైళ్లను బుక్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు అనేక బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో తరలివెళ్లేందుకు ఆదివాసీలు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా అనేక మంది ఆదివాసీలు విమానయానం ద్వారా కూడా హస్తీన బాట పట్టనున్నారు. దీంతో ఇప్పుడు మరోసారి డిసెంబర్‌ 9 ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానంగా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్‌తో 2017 డిసెంబర్‌ 9న హైదరాబాద్‌ సభ ద్వారా పడిన అడుగుకు ఇది కొనసాగింపుగా నిర్వహిస్తున్న సభగా నిర్వహిస్తున్నారు. ఆదివాసీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడి తరలివెళ్లేందుకు సిద్ధమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉంటే ఐటీడీఏ సమావేశం రోజు ఎంపీ సోయం బాపురావు వ్యాఖ్యలు అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొంతమంది అధికారులు ఆదివాసీల భాష నేర్చుకోవడం ద్వారా, గుస్సాడీ నృత్యం చేయడం ద్వారా ఉద్యమాన్ని అణచివేశారనే భావనలో ఉండవద్దని పరోక్షంగా హెచ్చరించడం ప్రస్తుత పరిస్థితులను తేటతెల్లం చేస్తున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement