జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి
సాక్షి, ఆదిలాబాద్: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా రిమ్స్‌లో కొంతమంది వైద్యుల తీరు మారడం లేదు. నవిపోదురూ.. నాకేంటి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గిరిజన మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి 2008లో రూ.125 కోట్లతో రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)ను ఏర్పాటు చేశారు. 500 పడకలతో
ఈ ఆస్పత్రిని నిర్మించారు. కార్పొరేట్ వైద్యం అందుతుందని భావించిన ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదు. జ్వరం, చిన్నపాటి రోగాలు తప్పా గుండెనొప్పి, క్యాన్సర్ తదితర వ్యాధుల చికిత్స కోసం నాగ్‌పూర్, యావత్‌మాల్, హైదరాబాద్, తదితర ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు. గుండెనొప్పితో రిమ్స్‌లో చేరిన కన్జర్వేటర్ ఫారెస్టుకు సరైన వైద్యం అందక ఆస్పత్రిలోనే మృతిచెందిన సంఘటనలు అనేకం. జూనియర్ డాక్టర్లతోనే నెట్టుకొస్తున్నారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందకపోవడంతో వారు ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతూ ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు.
మధ్యాహ్నమే ఇంటిముఖం..
రిమ్స్‌లో పనిచేసే వైద్యులు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వహించాలి. కానీ కొంతమంది వైద్యులు ఆలస్యంగా రావడమే కాకుండా మధ్యాహ్నమే ఇంటిబాట పడుతున్నారు. ఈ విషయం రిమ్స్ అధికారులకు, జిల్లా అధికారులకు తెలిసినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ప్రైవేట్ క్లినిక్‌లు నిర్వహిస్తూ డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రిమ్స్‌లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేదు. కొంతమంది వైద్యులు విధులకు హాజరుకానప్పటికీ వేతనాలు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జూనియర్లతోనే వైద్యం..
రిమ్స్ ఆస్పత్రి జూనియర్ వైద్యులతోనే కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు. ఎమర్జెన్సీతో పాటు అన్ని వార్డుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు జూనియర్ డాక్టర్లే విధులు నిర్వహిస్తున్నారు. శిక్షణలో ఉన్న వీరు రోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉంటే రోగి పరిస్థితిని సీనియర్ వైద్యుడికి ఫోన్ ద్వారా విన్నవించి ఎలాంటి వైద్యం అందించాలి అనే వివరాలను తెలుసుకుంటున్నారు. రాత్రి వేళల్లో కనీసం ఒకరిద్దరు సీనియర్ వైద్యులు కూడా ఉండటం లేదు. రాత్రి డ్యూటీలో ఉండాల్సిన వైద్యులు ఇంటి వద్ద ఉండడంతో అత్యవసర సమయంలో వైద్యుడి ఇంటికి వాహనాన్ని పంపించి వారిని రిమ్స్‌కు తీసుకొస్తున్నారు.
ఖాళీల జాతర..
గత కొన్నేళ్లుగా రిమ్స్ ఆస్పత్రితో పాటు వైద్య కళాశాలలో పోస్టుల ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. దీంతో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందకపోగా మెడికోలకు సైతం సరైన రీతిలో విద్యాబోధన జరగడం లేదనే ఆరోపణలున్నాయి. రిమ్స్‌కు మొత్తం 151 పోస్టులు మంజూరు ప్రస్తుతం 95 మంది వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారు. 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్టులు 21కి ఏడుగురు పనిచేస్తుండగా, 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ 30 పోస్టులకు 15 మంది పనిచేస్తుండగా, మరో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ 41 పోస్టులకు గాను 34 పనిచేస్తున్నారు. 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ట్యూటర్ పోస్టులు 59కి 39 మంది విధులు నిర్వహిస్తున్నారు. మరో 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఆస్పత్రి అంతా కంపు కంపు
రిమ్స్ ఆస్పత్రి ఆవరణతో పాటు వార్డులన్నీ కంపు కొడుతున్నాయి. మరుగుదొడ్లు సరిగా లేవు. చెత్తాచెదారం శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. రిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన వారు ముక్కున వేలుసుకొని, మూతికి గుడ్డ పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ఆస్పత్రిలో రోగులను చూడటానికి వచ్చిన వారి బంధువులు రోగాల భారీన పడాల్సి వస్తుందని చర్చించుకుంటున్నారు. పారిశుధ్యం కోసం నెలకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ కరుణాకర్, రిమ్స్ సూపరింటెండెంట్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా వారు స్పందించ లేదు.
సెప్టెంబర్ 14న జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ రిమ్స్‌ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒకరిద్దరు వైద్యులు తప్పా ఎవరూ అందుబాటులో లేరు. వైద్యులు విధులను విస్మరించి ప్రైవేట్ క్లీనిక్‌లు నిర్వహిస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ పలుసార్లు రిమ్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులతో సమావేశం నిర్వహించారు. రోగులకు నాణ్యమైన సేవలు అం దించాలని, సమయపాలన పాటించాలని సూచిం చారు. విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని పలు మార్లు ఆదేశించినప్పటికీ రిమ్స్ వైద్యుల తీరులో మా త్రం మార్పు కానరావడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తనిఖీలు చేపడుతున్నప్పటికీ కూడా వారిలో చలనం లేకుండా పో యిందని పలు వురు పేర్కొంటున్నారు. ఇదీ రిమ్స్ వైద్యుల తీరు..
Comments
Please login to add a commentAdd a comment