రిమ్స్ ఆస్పత్రి
సాక్షి, ఆదిలాబాద్: రిమ్స్ కోవిడ్ విభాగానికి సంబంధించి నెలకో నోడల్ అధికారి మారుతున్నాడు. దీంతో ఆ విభాగంలో సేవలకు కొంత అంతరా యం ఏర్పడుతుంది. కొత్తగా వచ్చే నోడల్ అధికారి అక్కడి పరిస్థితులను తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జనరల్ మెడిసిన్‌కు సంబంధించి ఐదుగురు వైద్యులు ఉండగా, ప్రస్తుతం ఇద్దరు నోడల్ అధికారులు మారారు. మంగళవారం మ రో ఎండీకి బాధ్యతలను అప్పగించారు. దీంతో ఇ టు వైద్యారోగ్య శాఖాధికారులకు కూడా ఈ మా ర్పుల కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని సమాచారం. నోడల్ అధికారి పోస్టు మార్పు చేయకుండా చూడాల్సిన రిమ్స్ డైరెక్టర్ నెలకోసారి ఇలా మార్పు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇతర వైద్యులకు ఇస్తే ప్రయోజనం
నోడల్ అధికారి పోస్టును జనరల్ మెడిసిన్ వైద్యులకు కాకుండా ఈఎన్‌టీ, అప్తాల్మిక్, సివిల్ సర్జన్, ఇతర వైద్యులకు అప్పగిస్తే ఎండీల ద్వారా కోవిడ్ బాధితులకు మరింతగా వైద్యసేవలు అందుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. నోడల్ అధికారిగా ఉన్న వ్యక్తి రోజుకు ఎన్ని టెస్టులు జరిగాయి, ఎంతమందికి పాజిటివ్, ఎంతమందికి నెగిటివ్, ఎంతమంది డిశ్చార్జి అయ్యారు, ఎవరైనా మరణించారా.. కిట్స్, గ్లౌజులు, తదితర పరికరాలు అందుబాటులో ఉన్నాయా.. లేవా అనే విషయాన్ని తెలుసుకుంటారు. అయితే ఎవరైతే నోడల్ అధికారిగా ఉంటారో వారు కోవిడ్ బాధితులకు వైద్యసేవలు చేయకుండానే ఈ పోస్టులో ఉంటారని పలువురు వైద్యులు చెబుతున్నారు. అయితే జనరల్ మెడిసిన్‌లో ఐదుగురు మాత్రమే వైద్యులు ఉన్నారు. వీరికి ఐదు రోజులు విధులు కేటాయిస్తారు. వీరితో పాటు జూనియర్ డాక్టర్లే కోవిడ్ బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నారు. జనరల్ మెడిసిన్ వైద్యులే కీలకం కావడంతో పనిభారం పెరుగుతుందని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. ఇతర డిపార్ట్‌మెంట్లకు చెందినవారికి నోడల్ అధికారి బాధ్యతలు అప్పగిస్తే కొంత పనిభారం తగ్గే అవకాశం ఉండటంతో పాటు కోవిడ్ బాధితులకు నాణ్యమైన వైద్యసేవలు అందుతాయని భావిస్తున్నారు. అయితే కోవిడ్ విభాగం ఏర్పాటు చేసినప్పుడు మొదట డాక్టర్ సందీప్ జాదవ్, ఆ తర్వాత డాక్టర్ తానాజీ నోడల్ అధికారులుగా వ్యవహరించగా, ప్రస్తుతం డాక్టర్ శ్రీనివాస్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు.
ఉన్నా.. నిరుపయోగమే
రిమ్స్‌లో కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు లక్షలాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఆర్టీపీసీఆర్ యంత్రం గత కొన్ని నెలలుగా నిరుపయోగంగా మూలన పడి ఉంది. ఈ యంత్రం ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు టెక్నీషియన్ లేకపోవడంతో మూలన పడింది. ప్రస్తుతం ట్రూనాట్, సీబీనాట్ ద్వారానే కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. వీటి ద్వారా రోజుకు 50 నుంచి 60 వరకు మాత్రమే ఫలితాలు వస్తున్నాయి. ఆర్టీసీపీఆర్ ద్వారా రోజుకు వందకు పైగా టెస్టులు చేయొచ్చు. ప్రస్తుతం రిమ్స్‌లో ఐదుగురు టెక్నీషియన్లు ఉండగా, ఇద్దరు కోవిడ్ బారినపడ్డారు. ముగ్గురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ఈ కోవిడ్ పరీక్షలతో పాటు ఇతర రక్త నమూనాలను కూడా చేస్తుండటంతో పనిభారం పెరుగుతుందని చెబుతున్నారు.
నెలకొకరికి బాధ్యతలు అప్పగిస్తున్నాం
నోడల్ అధికారిగా నెలకొకరికి బాధ్యతలు అప్పగిస్తున్నాం. కోవిడ్ నేపథ్యంలో ఎవరికీ పనిభారం కలగకుండా చూస్తున్నాం. జనరల్ మెడిసిన్ వారికి బాధ్యతలు ఇవ్వాల్సి ఉంది. త్వరలోనే ఆర్టీపీసీఆర్ యంత్రం ద్వారా కోవిడ్ టెస్టులు చేసేలా టెక్నీషియన్‌ను నియమిస్తాం. – బలరాం, రిమ్స్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment