
సాక్షి, ఢిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రాత్రి 9 గంటల నుంచి మార్చి 31 అర్ధ రాత్రి వరకు ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. సభలు, సమావేశాలు, గుంపులుగా తిరగడంపై ఆంక్షలు విధించారు. ప్రజా ఆరోగ్యం, భద్రత దృష్ణా చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31వరకు అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం రోజున దాదాపు 3,700 సర్వీసులను రైల్వే శాఖ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 341గా నమోదు కాగా, మృతుల సంఖ్య 6 కి చేరింది. మరోవైపు ప్రధాని పిలుపు మేరకు చేపట్టిన జనతా కర్ఫ్యూకు విశేషమైన స్పందన లభిస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ప్రధాన నగరాలన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment