అల్లంచర్ల రాజుపాలెం, కొత్తగూడెంలలో 144 సెక్షన్ | 144 section in kottagudem, allamcharla rajupalem | Sakshi
Sakshi News home page

అల్లంచర్ల రాజుపాలెం, కొత్తగూడెంలలో 144 సెక్షన్

Published Mon, Jul 28 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM

144 section in kottagudem, allamcharla rajupalem

టి.నరసాపురం : అల్లంచర్లరాజుపాలెం, కొత్తగూడెం గ్రామాల్లో భూవివాదాల కారణంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తహసిల్దార్ ఎల్.దేవకీదేవి ఆదివారం ఆ రెండు గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. శనివారం రాత్రి అల్లంచర్ల రాజుపాలెం, కొత్తగూడెం గ్రామాల్లో 18 మంది రైతులకు చెందిన వ్యవసాయ బోర్లను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో నరికి ధ్వంసం చేశారు. గ్రామంలో వివాదంలో ఉన్న భూమిలో అరటి పంటను తరలించకుండా అల్లంచర్ల కొత్తగూడెం గ్రామస్తులు, మహిళలు అడ్డుకోవడం తెలిసిందే. దీంతో శనివారం రాత్రి పలువురు రైతులకు సంబంధించిన వ్యవసాయ బోర్లను వ్యతిరేక వర్గీయులు ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.

ఆదివారం ఉదయం పొలాలకు వెళ్లినప్పుడు బోర్లు ధ్వంసం అయ్యాయని గుర్తించిన రైతులు, స్థానికులు అల్లంచర్ల గ్రామానికి చెందిన రైతు నల్లూరి సత్యనారాయణ, అతని అనుచరులే దీనికి కారకులను భావించి అతని ఇంటిని ముట్టడించారు. మోటార్ సైకిళ్లను ధ్వంసం చేశారు. దీంతో అల్లంచర్ల రాజుపాలెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బాధిత రైతుల నుంచి ఫిర్యాదు తీసుకుని నల్లూరి సత్యనారాయణ, అతని అనుచరులు సుమారు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని చింతలపూడికి తరలించారు. పోలీసులు సత్యనారాయణను జీపులో తరలిస్తుండగా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వీరిని నెట్టివేశారు. గ్రామంలో పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేశారు.

తహసిల్దార్ ఎల్.దేవకీదేవి బాధిత రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించేందుకు 144వ సెక్షన్ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉండగా, అల్లంచర్లరాజుపాలెం గ్రామాన్ని జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు, చింతలపూడి సీఐ ఎం.వెంకటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం సీఐ అంబికాప్రసాద్ బందోబస్తు నిర్వహించారు. కొత్త ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి అల్లంచర్ల, కొత్తగూడెంలలో ధ్వంసం చేసిన బోర్లను పరిశీలించారు. అలాగే అదనపు ఎస్పీ కె.చంద్రశేఖర్ అల్లంచర్ల, కొత్తగూడెం గ్రామంలోని వివాదాస్పద భూములను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement