
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 144 సెక్షన్ విధిస్తూ ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ 144 ప్రకారం ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడడానికి వీల్లేదని, ఇండియా గేటు వద్ద ప్రజలను అనుమతించమని తెలిపారు. ఢిల్లీ వ్యాప్తంగా నిషేధ ఉత్తర్వులు అమలులో ఉంటాయని కమిషనర్ స్పష్టం చేశారు. ఇండియా గేట్ చుట్టూ ఎటువంటి సమావేశాలకు అనుమతి లేదని ఢిల్లీ డీసీపీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా ఇండియా గేటు వద్ద సాయుధ పోలీసులు పహరా కాస్తున్నారు.
యూపీ హథ్రాస్ జిల్లాలో సామూహిక హత్యాచార ఘటనపై కాంగ్రెస్ నిరసనల మధ్య ఈ ప్రకటన వెలువడింది. ముఖ్యంగా బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి వెళుతుండగా మాజీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఇండియా గేట్, శాస్త్రి భవన్ సమీపంలో నిరసన ప్రదర్శన అనంతరం ఈ ప్రకటన వచ్చింది గత నెల 28వ తేదీన 20 మంది పంజాబ్ యూత్ కాంగ్రెస్ సభ్యులు ఇండియా గేటు వద్ద కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ట్రాక్టరును దహనం చేసి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. (కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!)