ప్రయాగ్‌రాజ్‌లో పోలీసుల కవాతు; ఢిల్లీలో ముస్లిం యువకుల ఆందోళనలు
కోల్‌కతా/లక్నో/రాంచీ: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలతో రగిలిన కార్చిచ్చు దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో పాంచ్లా బజార్‌లో రెండో రోజు శనివారం కూడా హింస చోటుచేసుకుంది. ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలంటూ నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. వారిపై రాళ్లు రువ్వారు. ఇళ్లకు నిప్పు పెట్టారు. బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దాడిలో పోలీసులు గాయపడ్డారు. బాష్పవాయువు ప్రయోగించి జనాన్ని చెదరగొట్టారు. హౌరా, ముర్షిదాబాద్ జిల్లాల్లో పలుచోట్ల ఇంటర్నెట్ సేవలు ఈ నెల 14వ తేదీ దాకా నిలిపేశారు. పలు ప్రాంతాల్లో 15వ తేదీ దాకా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ సుకాంత మజుందార్‌ను 144 సెక్షన్ అమల్లో ఉన్న హౌరా జిల్లాకు వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బెంగాల్ జమ్మూ కశ్మీర్‌లా మారుతోందని సుకాంత ఆరోపించారు. శుక్రవారం నిరసనల్లో బాలులను భాగస్వాములను చేశారన్న అభియోగాలపై ఫిర్జాదా ఆఫ్ ఫర్ఫురా షరీఫ్‌కు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ షోకాజులిచ్చింది. బెంగాల్‌లో శాంతిభద్రతలు దిగజారుతున్నాయంటూ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆదేశించారు. నిందితుల పట్ల ఔదార్యం చూపుతుండడం దురదృష్టకరమంటూ ట్వీట్ చేశారు.
యూపీలో 255 మంది అరెస్టు
యూపీలో శుక్రవారం హింసాత్మక ఘటనలకు సంబంధించి 255 మందిని జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద అరెస్టు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ప్రయాగ్‌రాజ్‌లో పోలీసులపై రాళ్ల దాడికి చిన్నపిల్లలను దుండగులు నియోగించినట్లు గుర్తించారు. కారకులపై 29 సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు చెప్పారు. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ తల నరికేస్తున్నట్టు వీడియో రూపొందించి యూట్యూబ్‌లో పెట్టిన జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఫైజల్ వనీ అనే యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోయలో పలుచోట్ల కర్ఫ్యూ కొనసాగుతోంది.
ఢిల్లీలో జామా మసీదు బయట ప్రదర్శనల ఉదంతానికి సంబంధించి కేసు నమోదైంది. ప్రతి మసీదు, మదర్సా లోపల, బయట హై క్వాలిటీతో కూడిన సీసీ కెమెరాలు పెట్టాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. ఆందోళనకారులు ఏయే ప్రార్థనా స్థలాల్లో నుంచి బయటికొచ్చి గొడవకు దిగారో అవే ఈ విధ్వంసానికి బాధ్యత వహించాలని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ డిమాండ్ చేశారు. భారత్‌లో పాలన రాజ్యాంగం ప్రకారం నడుస్తుందే తప్ప షరియా ప్రకారం కాదని విధ్వంసకులు తెలుసుకోవాలన్నారు. నుపుర్ శర్మకు బీజేపీ వివాదాస్పద ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మద్దతుగా నిలిచారు.
ఆలయంపైకి పెట్రోల్ బాంబులు
జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. శుక్రవారం నిరసనల్లో పోలీసుల కాల్పుల్లో గాయపడిన ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు. వారు బులెట్ గాయాలతో చనిపోయినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఈ హింసకు నిరసనగా హిందూ సంఘాలు శనివారం రాంచీ బంద్‌కు పిలుపునిచ్చాయి. దాంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హింసకు కారకులపై కేసులు పెట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నామరు. నగరంలో 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. రాంచీలోని ఓ ఆలయంలో పూజారి, ఆయన కుటుంబం ప్రాంగణంలో నిద్రిస్తుండగా శుక్రవారం అర్ధరాత్రి దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శుక్రవారం జరిగిన నిరసనలకు సంబంధించి 100 మందికిపైగా వ్యక్తులపై కేసులు పెట్టారు.
విమర్శకు ఎవరూ అతీతులు కారు: తస్లీమా
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మతోన్మాదుల ఆగడాలను చూస్తే దిగ్బ్రాంతి కలుగుతోందని బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. వాటిని చూస్తే మహ్మద్ ప్రవక్త దిగ్భ్రాంతికి గురయ్యేవారని అభిప్రాయపడ్డారు. ‘‘విమర్శలకు ఎవరూ అతీతులు కాదు. ఏ మనిషీ, మత గురువూ, మత బోధకుడూ, ప్రవక్తా, దేవుడూ... ఎవరూ అతీతులు కారు. ప్రపంచాన్ని మరింత ఉత్తమంగా మార్చాలంటే సూక్ష్మ పరిశీలన, విమర్శ అవసరం’’ అని కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment