లక్నోలో ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో అగ్నికి ఆహుతి అవుతోన్న మీడియా వాహనాలు
న్యూఢిల్లీ: ‘పౌర’ ఆగ్రహం తీవ్రమవుతోంది. ఆందోళనలపై ప్రభుత్వం కూడా తీవ్రంగానే స్పందిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. పలు పట్టణాలు, విశ్వవిద్యాలయాల్లో వామపక్ష పార్టీలు, వామపక్ష విద్యార్థి సంఘాలు భారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. యూపీ, బిహార్‌ల్లో ఆందోళనలు హింసాత్మకమయ్యాయి.
దేశంలోని పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఆందోళన ల్లో పాల్గొన్న లెఫ్ట్ నేతలు సీతారాం ఏచూరి, డీ రాజా, నీలోత్పల్ బసు, బృందా కారత్, స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్, చరిత్రకారుడు రామచంద్ర గుహ సహా ఆందోళనకారులను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. ఢిల్లీలోని ఎర్రకోట సహా పలు ప్రాంతాల్లో అధికారులు 144 సెక్షన్ విధించారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను, మొబైల్ సేవలను నిలిపేశారు. సీఏఏ వ్యతిరేక నిరసనల కేంద్రంగా నిలిచిన అస్సాం, మేఘాలయ, త్రిపురల్లో శాంతియుత నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. కేరళ, తమిళనాడు, చండీగఢ్, జమ్మూ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. మరోవైపు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)తో పాటు జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)ని దేశవ్యాప్తంగా అమలు చేయడం తథ్యమని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు.
ఢిల్లీలో..
144 సెక్షన్ విధించినప్పటికీ నిరసనకారులు వెనక్కుతగ్గలేదు. వేలాదిగా ఎర్రకోట, జంతర్‌మంతర్, మండిహౌజ్ తదితర ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు. 1975 నాటి ఎమర్జెన్సీ కన్నా పరిస్థితి దారుణంగా ఉందని మండిహౌజ్ వద్ద ఆందోళనల్లో పాల్గొని అరెస్టైన సీపీఎం నేత ఏచూరి అన్నారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో మునుపెన్నడూ లేని విధంగా కొన్ని గంటల పాటు కాల్స్, ఎస్‌ఎంఎస్, ఇంటర్నెట్ సహా అన్ని మొబైల్ సేవలను నిలిపేశారు. ‘నిర్భయ’ ఆందోళనలు, అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమ సమయంలోనూ పోలీసులు ఇంతటి చర్య తీసుకోలేదు.
ఉత్తరప్రదేశ్‌లో..
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో రణరంగమైంది. నగరవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఒక పోలీస్ ఔట్‌పోస్ట్ వెలుపల వాహనాలను ఆందోళనకారులు తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. సంబల్ ప్రాంతంలో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సును తగలపెట్టారు.
బిహార్‌లో..
వామపక్ష విద్యార్థులు రోడ్లను, రైల్వే ట్రాక్‌లను నిర్బంధించి నిరసన తెలిపారు. పట్నాలో మాజీ ఎంపీ పప్పు యాదవ్ నేతృత్వంలోని జన అధికార పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్లపై టైర్లను తగలబెట్టి వాహనాలను అడ్డుకున్నారు. జహానాబాద్‌లో సీపీఐఎంఎల్ కార్యకర్తలు రోడ్ రోకో నిర్వహించారు.
మహారాష్ట్రలో..
ముంబైలోని క్రాంతి మైదాన్‌లో కాంగ్రెస్, ఎన్సీపీ, పలు ఇతర పార్టీలు ‘హమ్ భారత్ కే లోగ్’ పేరుతో ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో వేలాదిగా పార్టీల కార్యకర్తలు, విద్యార్థులు, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఇదే మైదానం నుంచి 1942లో మహాత్మాగాంధీ క్విట్ ఇండియా’ నినాదం ఇచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న 94 ఏళ్ల జీజీ పారిఖ్ సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలోనూ పాల్గొని చరిత్ర సృష్టించారు.
పశ్చిమబెంగాల్‌లో..
కోల్‌కతాలో వరుసగా నాలుగోరోజు ముఖ్యమంత్రి మమత బెనర్జీ సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో స్వయంగా పాల్గొన్నారు. సీఏఏ, ఎన్నార్సీలపై దేశవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని మోదీ సర్కారును సవాలు చేశారు. ఈ రెఫరండంలో ఓడిపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కర్ణాటకలో ఇద్దరి మృతి
మంగళూరులో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారు. మంగళూరు నార్త్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి, పోలీసులపై దాడికి ఆందోళనకారులు ప్రయత్నించారని, వారిని అడ్డుకునే ప్రయత్నంలో జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారని పోలీస్ అధికారులు తెలిపారు. బెంగళూరు, హుబ్బలి, కలబుర్గి, హాసన్, మైసూర్, బళ్లారిల్లో విపక్షాలు, ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బెంగళూరులో ఆందోళనల్లో పాల్గొన్న రామచంద్ర గుహను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుత నిరసనలకు కూడా అనుమతించకపోవడం అప్రజాస్వామికమని గుహ విమర్శించారు.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద అప్రమత్తంగా ఉన్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సభ్యులు
గుహ అరెస్ట్ దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment