
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 15 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. పోలింగ్ బూత్‌ల నుంచి 200 మీటర్ల వరకు సెక్షన్ 144 నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.
దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ తరఫున మమతా బెనర్జీ బరిలో ఉంటే, బీజేపీ ప్రియాంక టైబ్రెవాల్‌ను బరిలో దింపింది. ఇక సీపీఐ(ఎం) తరపున స్రిజిబ్ బిశ్వాస్ పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని 97 పోలింగ్ కేంద్రాల్లోని 287 బూత్‌ల లోపల సెంట్రల్ పారా మిలటరీకి చెందిన ముగ్గురేసి జవాన్లను మోహరించారు. ఇక పోలింగ్ బూత్ వెలుపల భద్రత కోసం కోల్‌కతాకు చెందిన పోలీసు అధికారులు పహారా కాస్తారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో అయిదుగురికి మించి గుమిగూడడాన్ని నిషేధించారు.