ఢిల్లీలోని జామా మసీదు వద్ద ప్రత్యేక పోలీసు గస్తీ
న్యూఢిల్లీ: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది. అయోధ్య విషయంలో గతంలో అల్లర్లు జరిగిన నేపథ్యంలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు భారీ స్థాయిలో బలగాలను మోహరించారు. సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. డ్రోన్ల ద్వారా, సీసీ ఫుటేజీల ద్వారా ఆయా ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. హోంమంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం సెక్రటరీ అజిత్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అరవింద్ కుమార్‌లతో సమావేశమై పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
సుప్రీంకోర్టు వద్ద..
తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు వద్ద భారీగా బలగాలను మోహరించారు. కోర్టు ఆవరణలోకి ప్రవేశించే వాహనాలను, వ్యక్తులను బారికేడ్లతో అడ్డుకొని, క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాకే లోపలికి పంపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సహా ధర్మాసనంలోని మిగతా న్యాయమూర్తుల నివాసాల వద్ద కూడా బలగాలను మోహరించారు.
రామ జన్మభూమి అయోధ్యలో...
అయోధ్యతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో బలగాలను మోహరించి పరిస్థితులను ప్రభుత్వం పర్యవేక్షించింది. రాష్ట్రంలో మొత్తం 112 ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసి జిల్లాలను జోన్ల లెక్కన విభజించి సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను పరిశీలించారు. 31 జిల్లాల్లోని అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గొడవలు చెలరేగకుండా చర్యలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ స్పష్టం చేశారు. అనుకోని ఘటనలు ఎదురైతే తక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రతి జిల్లాలో తాత్కాలిక కారాగారాలను ఏర్పాటు చేసింది. సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కొన్ని చోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. అయోధ్య భూమి ప్రాంతంలో సంచరించే వారిని తనిఖీ చేశారు.
దేశ రాజధానిలో..
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతల పర్యవేక్షణ దృష్ట్యా పలు నిబంధనలను విధించనున్నట్లు పోలీసులు శనివారం ఉదయమే ప్రకటించారు. కోర్టు తీర్పును స్వాగతించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. అసత్య వార్తలు ప్రచారం చేసినందుకుగానూ నోయిడాలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత ఢిల్లీ, జామా మసీదు పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.
ఆర్థిక రాజధాని ముంబైలో..
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. దాదాపు 40 వేల మంది పోలీసులు గస్తీ కాశారు. శనివారం ఉదయం 11 నుంచి 24 గంటల పాటు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. విద్యాసంస్థలను మూసేశారు.
Comments
Please login to add a commentAdd a comment