ajit dowal
-
బలగాల రక్షణలో ప్రశాంతంగా...
న్యూఢిల్లీ: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది. అయోధ్య విషయంలో గతంలో అల్లర్లు జరిగిన నేపథ్యంలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు భారీ స్థాయిలో బలగాలను మోహరించారు. సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. డ్రోన్ల ద్వారా, సీసీ ఫుటేజీల ద్వారా ఆయా ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. హోంమంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం సెక్రటరీ అజిత్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అరవింద్ కుమార్‌లతో సమావేశమై పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. సుప్రీంకోర్టు వద్ద.. తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు వద్ద భారీగా బలగాలను మోహరించారు. కోర్టు ఆవరణలోకి ప్రవేశించే వాహనాలను, వ్యక్తులను బారికేడ్లతో అడ్డుకొని, క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాకే లోపలికి పంపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సహా ధర్మాసనంలోని మిగతా న్యాయమూర్తుల నివాసాల వద్ద కూడా బలగాలను మోహరించారు. రామ జన్మభూమి అయోధ్యలో... అయోధ్యతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో బలగాలను మోహరించి పరిస్థితులను ప్రభుత్వం పర్యవేక్షించింది. రాష్ట్రంలో మొత్తం 112 ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసి జిల్లాలను జోన్ల లెక్కన విభజించి సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను పరిశీలించారు. 31 జిల్లాల్లోని అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గొడవలు చెలరేగకుండా చర్యలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ స్పష్టం చేశారు. అనుకోని ఘటనలు ఎదురైతే తక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రతి జిల్లాలో తాత్కాలిక కారాగారాలను ఏర్పాటు చేసింది. సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కొన్ని చోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. అయోధ్య భూమి ప్రాంతంలో సంచరించే వారిని తనిఖీ చేశారు. దేశ రాజధానిలో.. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతల పర్యవేక్షణ దృష్ట్యా పలు నిబంధనలను విధించనున్నట్లు పోలీసులు శనివారం ఉదయమే ప్రకటించారు. కోర్టు తీర్పును స్వాగతించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. అసత్య వార్తలు ప్రచారం చేసినందుకుగానూ నోయిడాలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత ఢిల్లీ, జామా మసీదు పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఆర్థిక రాజధాని ముంబైలో.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. దాదాపు 40 వేల మంది పోలీసులు గస్తీ కాశారు. శనివారం ఉదయం 11 నుంచి 24 గంటల పాటు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. విద్యాసంస్థలను మూసేశారు. -
‘ఉగ్ర నిధులకు కోత’
న్యూఢిల్లీ : ఉగ్రవాదులను మట్టికరిపించాలంటే వారి సిద్ధాంతంతో పోరాడాల్సిన అవసరం ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పుకొచ్చారు. ‘ఉగ్రవాదం కొత్తేమీ కాదు..ఉగ్రవాదుల నుంచి ఆయుధాన్ని..వారి భావజాలాన్ని దూరం చేసినప్పుడే ఉగ్రవాదుల స్థైర్యాన్ని దెబ్బతీయగల’మని జాతీయ దర్యాప్తు ఏజెన్సీ కార్యక్రమంలో పాల్గొన్న దోవల్ పేర్కొన్నారు. ఉగ్రవాదంతో పోరాడటం ఒక్కటే సరిపోదని ఉగ్ర నిధులను నియంత్రించి వారిని ఏకాకులుగా చేయాలని చెప్పారు. నేరస్తుడికి ప్రభుత్వ ఊతం లభిస్తే మరింత చెలరేగుతాడని, అది ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత సంక్లిష్టం చేస్తుందని అన్నారు. ఈ ప్రక్రియలో కొన్ని ప్రభుత్వాలు ఆరితేరాయని, దురదృష్టవశాత్తూ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం ప్రభుత్వ విధానంగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ఉగ్రవాద నిరోధక బృందాల చీఫ్‌లు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ హెడ్ల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దోవల్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
సరిహద్దులో 230 మంది ఉగ్రవాదులు
న్యూఢిల్లీ: భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నుతోందని తెలిపారు. ఇందులోభాగంగా సరిహద్దులో 230 మంది ఉగ్రవాదులను పాక్ సిద్ధం చేసిందనీ, వీరిలో కొందరు ఇప్పటికే కశ్మీర్లోకి ప్రవేశించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. కశ్మీర్లో పరిస్థితులు సాధారణ స్థితికి రావడం, లోయ నుంచి రోజుకు 750 ట్రక్కుల ఆపిల్స్ ఎగుమతి కావడంపై పాక్ లోని ఉగ్రమూకలు రగిలిపోతున్నారని దోవల్ వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీ యువతకు గొప్ప భవిష్యత్, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఎగదోయడమే పాక్ వద్దున్న ఏకైక అస్త్రమని విమర్శించారు. ఢిల్లీలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన దోవల్.. పాక్ వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు. టవర్లు ఏర్పాటుచేసిన పాక్.. కశ్మీర్ వద్ద సరిహద్దులో 20 కి.మీ విస్తీర్ణంలో పాక్ ప్రత్యేకంగా కమ్యూనికేషన్ టవర్లను ఏర్పాటు చేసిందని ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తెలిపారు. ‘‘ఈ టవర్ల సాయంతో కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పాక్‌లోని వారి హ్యాండ్లర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. వీరి సంభాషణల్ని మన నిపుణులు గుర్తించారు. ఈ సందర్భంగా పాకిస్తానీ హ్యాండ్లర్ మండిపడుతూ..‘అసలు అన్ని ఆపిల్ ట్రక్కులు రాకపోకలు ఎలా సాగిస్తున్నాయ్? వాటిని మీరు ఆపలేరా? చేతకాకుంటే ఒప్పుకోండి. మీకు తుపాకులకు బదులుగా గాజులు పంపుతాం’ అని రెచ్చగొట్టేలా పంజాబీలో పాక్ యాసలో మాట్లాడాడు. ఇది జరిగిన తర్వాత ఇద్దరు ఉగ్రవాదులు గత శుక్రవారం సోపోర్‌లోని దంగపురా ప్రాంతంలో ప్రముఖ ఆపిల్ వ్యాపారి హమీదుల్లా రాథర్ ఇంటికెళ్లారు. హమీదుల్లా నమాజ్‌కు వెళ్లడంతో ఆగ్రహంతో ఆయన కుటుంబసభ్యులపై పిస్టళ్లతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హమీదుల్లా కుమారుడు ఇర్షాద్(25), రెండున్నరేళ్ల మనవరాలు అస్మాలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చిన్నారి అస్మా ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాం’’ అని దోవల్ వెల్లడించారు. ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడాన్ని మెజారిటీ కశ్మీరీలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 ప్రత్యేక హక్కు ఎంతమాత్రం కాదనీ, అతి ప్రత్యేకమైన వివక్షని వ్యాఖ్యానించారు. కశ్మీర్లో ప్రస్తుతం 10 పోలీస్స్టేషన్ల పరిధిలోనే నిషేధాజ్ఞలు అమలవుతున్నాయనీ, ఉగ్రవాదులు సంప్రదింపులు జరపకుండా ఉండేందుకే ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలను స్తంభింపజేశామన్నారు. -
భారత్‌కు మద్దతు ఇస్తాం: అమెరికా
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎలాంటి ఆత్మరక్షణ చర్యలు తీసుకున్నా, దాన్ని సమర్థిస్తామని అమెరికా జాతీయ భద్రత సలహాదారు జాన్ బోల్టన్ ప్రకటించారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు బోల్డన్ శుక్రవారం ఫోన్ చేశారు. దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించేందుకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దాడిని ఖండించిన అమెరికా అధ్యక్ష భవనం.. తమ భూభాగంలోని అన్ని ఉగ్రవాద సంస్థలకు అందిస్తున్న సాయాన్ని పాక్ నిలిపివేయాలని హెచ్చరించింది. పాక్ మూల్యం చెల్లించక తప్పదు: ఇరాన్ ఇస్ఫాహన్(ఇరాన్): తమ దేశంలో ఆత్మాహుతి దాడితో 27 మంది భద్రతా సిబ్బంది మృతికి కారణమైన పాకిస్తాన్‌పై ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. పాక్– ఇరాన్ సరిహద్దుల్లోని సిస్తాన్–బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బుధవారం సైనికులతో వెళ్తున్న బస్సును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చడంతో అందులోని 27 మంది మృతి చెందారు. ఆ సైనికుల అంతిమ యాత్రలో ఇరాన్ సైనిక దళాల(రివల్యూషనరీ గార్డ్స్) కమాండర్ మేజర్ జనరల్ మొహమ్మద్ అలీ జఫారీ పాల్గొని, ప్రసంగించారు. ‘ఇప్పటిదాకా ఉపేక్షించాం. ఇకపై ధీటుగా బదులిస్తాం. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాక్ భారీ మూల్యం చెల్లించక తప్పదు’ అని ఆయన హెచ్చరించారు. ఇరాన్ బద్ద విరోధి, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదివారం నుంచి పాక్ పర్యటన ప్రారంభమవుతున్న సమయంలో ఇలాంటి హెచ్చరికలు వెలువడటం గమనార్హం. తమ సైనికులపై దాడికి పాక్ ప్రోత్సాహంతో నడుస్తున్న ‘జైషే ఆదిల్’ కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది. -
ప్రధాని మోదీ దీపావళి పండుగ ఎక్కడో తెలుసా?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈసారి దీపావళి ఎక్కడ జరుపుకొంటారో తెలుసా? ఉత్తరాఖండ్‌లోని చమోలీలో ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు దళంతో కలిసి ఆయన ఈ ఏడాది పండుగ చేసుకుంటున్నారు. ఇందుకోసం ఆయన శనివారం బయల్దేరి ఉత్తరాఖండ్ వెళ్తున్నారు. సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతానికి ఆయనతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా వెళ్తున్నారు. దీపావళి సందర్భంగా సైనికులకు, భద్రతా దళాలకు శుభాకాంక్షలు తెలపాలని దేశవాసులకు ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. -
దాడికి సూత్రధారి ఎవరు?
ఉడీలో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారతీయుల గుండెలన్నీ ఒక్కసారిగా భగభగ మండిపోయాయి. ప్రతీకార జ్వాలలు రగులుకున్నాయి. పాకిస్థాన్ పీచమణచాల్సిన సమయం ఇదేనని మాజీ సైనికులు కూడా గర్జించారు. కానీ.. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఆశించిన స్పందన రాలేదు. జవాన్ల త్యాగాలు వృథాగా పోనివ్వబోమని మాత్రమే ప్రధానమంత్రి చెప్పారు. అయితే.. అప్పటికే తెరవెనక జరగాల్సింది అంతా జరిగిపోతోంది. రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ప్రధానమంత్రికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎక్కడా తెరమీద కనిపించలేదు. తెర వెనకనుంచే ఇద్దరూ వ్యూహరచనలో మునిగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. పారికర్ - దోవల్.. వీళ్లిద్దరూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నమ్మిన బంట్లు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు తాను తలపెట్టిన ఆర్థిక సంస్కరణలను సరిగ్గా అమలుచేయడానికి మన్మోహన్ సింగ్‌ను ఎలా ఎంచుకుని తీసుకొచ్చారో.. అలాగే నరేంద్రమోదీ ప్రధాని పదవి చేపట్టిన వెంటనే అప్పటివరకు గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్‌ను కూడా రక్షణ మంత్రిగా అలాగే తీసుకొచ్చారు. మరోవైపు అప్పటివరకు యూపీఏ హయాంలో పెద్దగా ప్రాధాన్యం లభించని అజిత్ దోవల్‌ను కూడా జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. 2014 మే 26న మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, 30వ తేదీన దోవల్ ఎన్ఎస్ఏ పదవిలో నియమితులయ్యారు. అప్పటి నుంచి ప్రభుత్వం విదేశీ వ్యవహారాలకు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఆయన హస్తం ఉండని సందర్భం లేదు. ఎవరీ దోవల్.. ఏం చేశారు అజిత్ దోవల్.. 1968 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి. కేరళ కేడర్‌లో చేరిన ఈయన, 2004-05 సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా వ్యవహరించారు. 1980లలో మిజో నేషనల్ ఫ్రంట్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించింది. ఆ సమయంలో దోవల్ ఆ సంస్థలోకి చొరబడి, దాని అగ్రకమాండర్లు ఆరుగురిని మట్టుబెట్టారు. దాంతో ఎంఎన్ఎఫ్ ఉనికి దాదాపు నిర్వీర్యం అయిపోయింది. ఇక పాకిస్థాన్‌లో గూఢచారిగా ఏడు సంవత్సరాలు పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఒక భిక్షగాడి వేషంలో కూడా తిరిగేవారని అంటారు. పాకిస్థాన్‌లో భారత గూఢచారులు పట్టుబడితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. చిత్రహింసలు పెట్టి మరీ చంపేస్తారు. అది తెలిసి కూడా ఏకంగా ఏడేళ్ల పాటు అక్కడే ఉండి వాళ్ల రహస్యాలను తెలుసుకున్న ఘనత దోవల్‌కు ఉంది. ఇక భారత సైన్యం ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించిన సమయంలో దోవల్ ముందుగానే స్వర్ణదేవాలయంలోకి వెళ్లిపోయారు. అక్కడ ఆయన పాకిస్థానీ గూఢచారిగా నటించి, ఉగ్రవాదుల ప్లాన్లు అన్నీ తెలుసుకుని, వాటిని సైన్యానికి అందించారు. కుక్కే పారే లాంటి కశ్మీరీ ఉగ్రవాదులను ఆయా ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా మార్చేశారు. ఇటీవలే ఎన్ఎస్ఏగా బాధ్యతలు స్వీకరించిన అతి కొద్ది కాలానికే ఇరాక్ నుంచి 45 మంది భారతీయ నర్సులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహీంద రాజపక్స ఓటమి వెనక ఉన్నది కూడా అజిత్ దోవలే! రాజపక్స భారతదేశానికి తలనొప్పిగా మారి, చైనాకు అనుకూలంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. దాంతో తర్వాతి ఎన్నికల్లో ఆయన నెగ్గడానికి ఏమాత్రం వీల్లేదని భావించిన దోవల్.. అక్కడకు వెళ్లి ఏం మాయ చేశారో గానీ, మైత్రిపాల సిరిసేన తదుపరి అధ్యక్షుడయ్యారు. ఒకప్పుడు రాజపక్సకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండే సిరిసేనను ఆయనపై రెచ్చగొట్టి పోటీకి నిలబెట్టింది కూడా దోవలే. అంతేకాదు.. మాజీ ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘేను పోటీ చేయొద్దని కోరి.. ఒప్పించారు కూడా. దాంతో రాజపక్స ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసి.. సిరిసేనను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు! -
అమెరికా నుంచి ఫోన్.. సాయం చేస్తామని ఆఫర్
ఉగ్రవాద నిరోధక చర్యల్లో తమ నుంచి కావల్సినంత సాయం అందజేస్తామని భారతదేశానికి అమెరికా హామీ ఇచ్చింది. ఉడీ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అమెరికా నుంచి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు ఫోన్ వచ్చింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సుసన్ రైస్ ఈ ఫోన్ చేశారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద బృందాలు భారతీయులపై దాడి చేస్తున్న విషయాన్ని ప్రస్తావించి.. ఉడీ ఉగ్రవాద దాడి విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్థాన్‌ను కూడా కోరినట్లు చెప్పారు. లష్కరే తాయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలపై పాక్ కఠిన చర్యలు తీసుకుంటుందని తాము భావిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఉడీ ఉగ్రదాడి అనంతరం అమెరికాకు చెందిన ఒక అత్యున్నత అధికారి భారత జాతీయ భద్రతా సలహాదారు దోవల్‌కు ఫోన్ చేయడం ఇదే తొలిసారి. ఉగ్రవాద బాధిత దేశాలకు న్యాయం చేసేందుకు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనే ఒబామా సందేశాన్ని ఆమె దోవల్‌కు వివరించారు. -
భారత్- పాక్ చర్చల్లో తీవ్ర ప్రతిష్ఠంభన
జాతీయ భద్రతా సలహదారు స్థాయిలో పాకిస్థాన్‌తో జరగాల్సిన చర్చలలో ప్రతిష్ఠంభన చోటుచేసుకుంది. పాకిస్థాన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ, ఆ చర్చలకు ముందుగానే కాశ్మీర్‌లోని వేర్పాటువాద నాయకులను పాకిస్థాన్ చర్చలకు పిలవడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హురియత్ నాయకులతో చర్చించడం తగదని స్పష్టంగా చెప్పినా.. పాక్ వినిపించుకోకుండా మొండిగా ముందుకెళ్లడం, మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ లాంటి హురియత్ నేతలు కూడా తాము పాకిస్థాన్‌తో చర్చలకు వెళ్తామని చెప్పడం.. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చర్చలు జరగాలా.. వద్దా అనే విషయాన్ని పాకిస్థాన్ కే వదిలేసింది. వాస్తవానికి రెండు దేశాల మధ్య చర్చల విషయంలో మూడో పక్షానికి అవకాశం లేదని భారత్ ఎప్పుడూ చెబుతూ వస్తున్నా, పాక్ మాత్రం పదే పదే అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ సమస్యను ప్రస్తావించడం, మూడో పక్షం జోక్యాన్ని ఆహ్వానించడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్‌తో శాంతియుత చర్చలకే భారత్ ఎప్పుడూ ముందుకెళ్లిందని, కానీ పాక్ ఎజెండా మాత్రం ఉగ్రవాదంతోనే ముడిపడి ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వ్యాఖ్యానించారు. ఏకపక్షంగా కొత్త నిబంధనలు విధించడం, ముందుగా ఒప్పుకొన్న ఎజెండాను తప్పించడం.. ఇదంతా ఏంటని ప్రశ్నించారు. పాకిస్థాన్ గతంలో చేసుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కడానికి దారి తీసిన పరిస్థితులేంటో వాళ్లే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో అజిత్ దోవల్ సమావేశమయ్యారు.