భారత్- పాక్ చర్చల్లో తీవ్ర ప్రతిష్ఠంభన
జాతీయ భద్రతా సలహదారు స్థాయిలో పాకిస్థాన్తో జరగాల్సిన చర్చలలో ప్రతిష్ఠంభన చోటుచేసుకుంది. పాకిస్థాన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ, ఆ చర్చలకు ముందుగానే కాశ్మీర్లోని వేర్పాటువాద నాయకులను పాకిస్థాన్ చర్చలకు పిలవడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హురియత్ నాయకులతో చర్చించడం తగదని స్పష్టంగా చెప్పినా.. పాక్ వినిపించుకోకుండా మొండిగా ముందుకెళ్లడం, మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ లాంటి హురియత్ నేతలు కూడా తాము పాకిస్థాన్తో చర్చలకు వెళ్తామని చెప్పడం.. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చర్చలు జరగాలా.. వద్దా అనే విషయాన్ని పాకిస్థాన్ కే వదిలేసింది.
వాస్తవానికి రెండు దేశాల మధ్య చర్చల విషయంలో మూడో పక్షానికి అవకాశం లేదని భారత్ ఎప్పుడూ చెబుతూ వస్తున్నా, పాక్ మాత్రం పదే పదే అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ సమస్యను ప్రస్తావించడం, మూడో పక్షం జోక్యాన్ని ఆహ్వానించడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్తో శాంతియుత చర్చలకే భారత్ ఎప్పుడూ ముందుకెళ్లిందని, కానీ పాక్ ఎజెండా మాత్రం ఉగ్రవాదంతోనే ముడిపడి ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వ్యాఖ్యానించారు.
ఏకపక్షంగా కొత్త నిబంధనలు విధించడం, ముందుగా ఒప్పుకొన్న ఎజెండాను తప్పించడం.. ఇదంతా ఏంటని ప్రశ్నించారు. పాకిస్థాన్ గతంలో చేసుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కడానికి దారి తీసిన పరిస్థితులేంటో వాళ్లే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో అజిత్ దోవల్ సమావేశమయ్యారు.