ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ (పాత చిత్రం)
జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ నివాసం వద్ద బుధవారం ఉదయం కలకలం రేగింది. గుర్తు తెలియని ఓ దుండగుడు నేరుగా దోవల్ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కారులో వేగంగా దూసుకొచ్చినప్పటికీ.. గేట్ వద్దే భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో దోవల్ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.
తన శరీరంలో ఎవరో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చారని, అందుకే తనకు తెలియకుండానే అలా వచ్చేశాని తొలుత ఆ వ్యక్తి చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. అప్రమత్తమై.. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే అతని వాలకానికి, సమాధానాలకు పొంతన లేకపోవడంతో వైద్యుల్ని పిలిపించారు. ప్రాథమిక విచారణలో అతను మతిస్థిమితం సరిగాలేని వ్యక్తి అని, కర్ణాటకవాసిగా గుర్తించామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
అజిత్ దోవల్ నివాసం ఢిల్లీ 5, జన్‌పథ్‌లో ఉంది. ఐబీ మాజీ చీఫ్, పైగా ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు కావడంతో.. ఆయన నివాసం వద్ద జెడ్ ఫ్లస్ కేటగిరీ కింద భారీగా సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది మోహరింపు ఉంటుంది. అంతేకాదు భద్రతా కారణాల దృష్ట్యాతో ఆయన నివాసానికి నేమ్ ప్లేట్ కూడా ఉండదు. అయినప్పటికీ ఆ వ్యక్తి సరాసరి దోవల్ ఇంట్లోకి దూసుకెళ్లడంతో అంతా ఉలిక్కిపడ్డారు. బుధవారం ఉదయం 7:30-8 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన క్లూస్ టీం ఆ అపరిచితుడి ఐడెంటిటీని గుర్తించే పనిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment