జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకి కుట్ర పన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆయన నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దీంతో దోవల్ కార్యాలయం, నివాసం వద్ద భద్రతను పెంచారు. జైషే మహమ్మద్ ఉగ్రవాది హిదయత్ ఉల్లా మాలిక్‌ను అరెస్ట్ చేసి ప్రశ్నించడంతో రెక్కీ విషయం బయటపడింది. దోవల్‌తో పాటుగా ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న వారి సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్‌కు చేరవేసినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 6న పోలీసులు మాలిక్‌ను అరెస్ట్ చేశారు. అతనితో సహా నలుగురిని పోలీసులు ప్రశ్నించారు. వారిలో మాలిక్ భార్య, చండీగఢ్‌కు చెందిన ఒక విద్యార్థి, బీహార్ నివాసి ఉన్నారు. పోలీసుల విచారణలో పాకిస్తాన్ ఆదేశాల మేరకే తామందరం రెక్కీ నిర్వహించామని మాలిక్ అంగీకరించాడు. గత ఏడాది మేలో న్యూఢిల్లీలోని దోవల్ కార్యాలయం సహా కొన్ని ప్రాంతాలను వీడియో తీసి పంపించామని వెల్లడించాడు. దోవల్ 2019 బాలాకోట్ వైమానిక దాడులు జరిగినప్పట్నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉన్నారు. దీంతో ఆయనకి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment