జాతీయ భద్రతా సలహాదారుగా: అజిత్ దోవల్
న్యూఢిల్లీ: కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధిపతి అజిత్ దోవల్ (69) నూతన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ)గా నియమితులయ్యారు. జాతీయ, అంతర్జాతీయ భద్రతా అంశాలపై అపారమైన అనుభవం ఉన్న ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ఆ అంశాలపై సలహాదారుగా వ్యవహరిస్తారు. దోవల్ నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం ఆయన నియామకం శుక్రవారం నుంచే అమలులోకి వచ్చింది.
ప్రస్తుత ప్రధాని పదవీకాలం ముగిసే వరకూ లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ దోవల్ ఈ పదవిలో కొనసాగుతారు. శివశంకర్ మీనన్ స్థానంలో దోవల్ బాధ్యతలు స్వీకరిస్తారు. భారత్-చైనా సరిహద్దు అంశంలో ప్రధాని ప్రతినిధిగానూ ఉంటారు. ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు చేపట్టిన అనంతరం జరిగిన రెండో కీలక నియామకం ఇది. ఇంతకుముందు ప్రధానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా నృపేంద్ర మిశ్రా నియమితులవడం తెలిసిందే. దోవల్ 1968 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి. ఇంటెలిజెన్స్ విభాగంలో అత్యుత్తమ వ్యూహరచన చేయడంలోనూ, అమలులోనూ నిష్ణాతునిగా ఆయన పేరుపొందారు.