NSA level talks
-
భారత్- పాక్ చర్చల్లో తీవ్ర ప్రతిష్ఠంభన
జాతీయ భద్రతా సలహదారు స్థాయిలో పాకిస్థాన్‌తో జరగాల్సిన చర్చలలో ప్రతిష్ఠంభన చోటుచేసుకుంది. పాకిస్థాన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ, ఆ చర్చలకు ముందుగానే కాశ్మీర్‌లోని వేర్పాటువాద నాయకులను పాకిస్థాన్ చర్చలకు పిలవడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హురియత్ నాయకులతో చర్చించడం తగదని స్పష్టంగా చెప్పినా.. పాక్ వినిపించుకోకుండా మొండిగా ముందుకెళ్లడం, మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ లాంటి హురియత్ నేతలు కూడా తాము పాకిస్థాన్‌తో చర్చలకు వెళ్తామని చెప్పడం.. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చర్చలు జరగాలా.. వద్దా అనే విషయాన్ని పాకిస్థాన్ కే వదిలేసింది. వాస్తవానికి రెండు దేశాల మధ్య చర్చల విషయంలో మూడో పక్షానికి అవకాశం లేదని భారత్ ఎప్పుడూ చెబుతూ వస్తున్నా, పాక్ మాత్రం పదే పదే అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ సమస్యను ప్రస్తావించడం, మూడో పక్షం జోక్యాన్ని ఆహ్వానించడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్‌తో శాంతియుత చర్చలకే భారత్ ఎప్పుడూ ముందుకెళ్లిందని, కానీ పాక్ ఎజెండా మాత్రం ఉగ్రవాదంతోనే ముడిపడి ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వ్యాఖ్యానించారు. ఏకపక్షంగా కొత్త నిబంధనలు విధించడం, ముందుగా ఒప్పుకొన్న ఎజెండాను తప్పించడం.. ఇదంతా ఏంటని ప్రశ్నించారు. పాకిస్థాన్ గతంలో చేసుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కడానికి దారి తీసిన పరిస్థితులేంటో వాళ్లే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో అజిత్ దోవల్ సమావేశమయ్యారు. -
చర్చల ప్రక్రియకు పాక్ వెన్నుపోటు!
జాతీయ భద్రతా సలహాదారు స్థాయిలో భారత్, పాక్‌ల మధ్య జరగాల్సిన చర్చల ప్రక్రియను ఎలాగైనా అడ్డుకునేందుకు పాకిస్థాన్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. భారత్ నుంచి తమపై ఒత్తిడి వస్తోందని.. ఆ ఒత్తిడిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తాజాగా వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా తాము వేర్పాటువాద హురియత్ నేతలను కలుస్తామని, ఇందులో రాజీపడేది లేదని అన్నారు. పాకిస్థాన్ సైన్యం నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఉంటోందో.. అచ్చం అలాంటి పద్ధతిలోనే నవాజ్ కూడా మాట్లాడుతున్నట్లు అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు. జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరగడానికి ముందే కాశ్మీర్‌లోని వేర్పాటువాద నేతలతో పాక్ జాతీయ భద్రతా సలహాదారు సమావేశం ఏర్పాడు చేయడంతో.. చర్చల ప్రక్రియకు విఘాతం కలిగేలాగే ఉంది. వేర్పాటువాదులతో పాకిస్థాన్ చర్చించడానికి వీల్లేదని భారత్ గట్టిగా హెచ్చరించడం ఒకరకంగా పాకిస్థాన్‌కు కలిసొచ్చినట్లయింది. ఇప్పుడు చర్చలు జరిగితే అందులో ప్రధాన అంశం పాక్ ఉగ్రవాదం, తాజాగా ఉధంపూర్‌లో సజీవంగా పట్టుబడిన నవేద్ తదితర అంశాలు చర్చకు వస్తాయి కాబట్టి.. ఈ చర్చలు జరగకుండా చూడాలన్నదే ముందునుంచి పాక్ ఉద్దేశంలా కనిపిస్తోంది. ఇక ఇప్పుడు భారతదేశం నుంచి వేర్పాటువాద నేతలతో చర్చల విషయమై హెచ్చరికలు రావడంతో.. రెండు దేశాల మధ్య చర్చలకు 'షరతులు' పెడితే ఊరుకోబోమని పాక్ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. హురియత్ నేతలతో తమ చర్చలు కొనసాగి తీరుతాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై చర్చించారు. మరోవైపు శ్రీనగర్‌లోని మసీదు దగ్గర పాకిస్థాన్, లష్కరే తాయిబా, ఐఎస్ఐఎస్ జెండాలు కనిపించాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చర్చలు జరగడం అనుమానంగానే కనిపిస్తోంది. -
ముందు ‘వేర్పాటు’ చర్చలు!
భద్రత సలహాదారు చర్చల ముందు పాక్ కవ్వింపు * 23న భారత్ రానున్న పాక్ ఎన్ఎస్ఏ సర్తాజ్ అజీజ్ * అజీజ్‌తో భేటీకావాలని కశ్మీర్ వేర్పాటు నేతకు పాక్ హైకమిషన్ పిలుపు * ఆయన గౌరవార్థం ఇచ్చే విందుకు మితవాద నేతలకు ఆహ్వానం శ్రీనగర్: ఓపక్క భారత్‌తో చర్చలంటూనే, మరోపక్క వేర్పాటువాదులకు స్నేహహస్తం అందించే కవ్వింపు కుట్రలకు పాకిస్తాన్ మరోసారి తెరతీసింది. ఇరుదేశాల మధ్య ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న జాతీయ భద్రత సలహాదారు(ఎన్ఎస్ఏ) స్థాయి చర్చల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వస్తున్న పాక్ ఎన్ఎస్ఏ సర్తాజ్ అజీజ్‌తో భేటీకి రావాలంటూ కశ్మీర్ వేర్పాటువాద సంస్థ, అతివాద హురియత్ కాన్ఫెరెన్స్ నేత సయ్యద్ అలీ షా గిలానీకి భారత్‌లోని పాక్ హై కమిషన్ ఆహ్వానం పంపింది. అలాగే, అజీజ్ గౌరవార్థం 23న తామిచ్చే విందుకు హాజరుకావాలంటూ మితవాద హురియత్ చైర్మన్ మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్ సహా పలువురు కశ్మీర్ మితవాద వేర్పాటు నేతలను పిలిచింది. ఈ ఆహ్వానాన్ని గిలానీ మన్నించారని, 24న సర్తాజ్ అజీజ్‌తో ఆయన సమావేశమవుతారని అతివాద హురియత్ ప్రతినిధి అయాజ్ అక్బర్ ధ్రువీకరించారు. పాక్ హై కమిషన్ ఇస్తున్న విందుకు తనతో పాటు మితవాద నేతలు హాజరవుతారని మీర్వాయిజ్ ఫారూఖ్ చెప్పారు. ఆ విందుకు హాజరయ్యే విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని జేకేఎల్ఎఫ్ నేత యాసిన్ మాలిక్ తెలిపారు. భారత్ సీరియస్! పాక్ హై కమిషన్ చర్యపై భారత్ అధికారికంగా స్పందించనప్పటికీ, వేర్పాటువాదులకు ఆహ్వానం పంపడాన్ని తీవ్రంగా తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభుత్వం దీనిపై సరైన విధంగా స్పందిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాక్‌లోని కొన్ని వర్గాలు భారత్, పాక్ చర్చలను అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నాయని, వేర్పాటువాదులకు ఆహ్వానం అందులో భాగమేనన్నాయి. ఈ నేపథ్యంలో, భారత్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ బుధవారం హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. వేర్పాటువాద నేతలకు పాక్ హై కమిషన్ ఆహ్వానంప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కశ్మీర్ వేర్పాటువాద నేతలకు ఆహ్వానం పంపడాన్ని భారత్‌లోని పాక్ హై కమిషన్ సమర్థించుకుంది. ‘ఇది కొత్తేం కాదు. గతంలోనే వేర్పాటువాదులను కలిశాం. ఇలాంటి భేటీలు, విందులు గతంలోనూ జరిగాయి. దీనిపై ఇంత రాద్ధాంతం ఎందుకు?’ అంటూ కమిషన్‌లోని కౌన్సెలర్(ప్రెస్) మంజూర్ మెమన్ అన్నారు. అజిత్ దోవల్‌తో సర్తాజ్ అజీజ్ చర్చలు 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇరుదేశాలు ఎన్ఎస్ఏ స్థాయి చర్చలు ప్రారంభించాలంటూ జూలై 10న రష్యాలోని ఉఫాలో భేటీ సందర్భంగా భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ నిర్ణయించడం తెలిసిందే. రాజకీయం చేయొద్దు: మీర్వాయిజ్ పాక్ ఎంబసీ నుంచి ఆహ్వానం అందగానే, మితవాద హురియత్ కాన్ఫెరెన్స్ బుధవారం అత్యవసర కార్యనిర్వాహక భేటీని ఏర్పాటు చేసింది. అజీజ్ గౌరవార్థం ఇస్తున్న విందుకు వెళ్లాలని నిర్ణయించింది. నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తత సడలేలా, సంపూర్ణ కాల్పుల విరమణ అమలయ్యేలా భారత్, పాక్‌లు చర్యలు తీసుకోవాలని మీర్వాయిజ్ ఫారూఖ్ సూచించారు. ‘దక్షిణాసియాలో శాంతి నెలకొనే ఒక అవకాశాన్ని గత ఏడాది కోల్పోయాం. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మాకు ఆహ్వానం పంపడాన్ని రాజకీయం చేయొద్దు. రాజకీయం చేసే అంశాలు వేరే ఉన్నాయి’ అన్నారు. గత ఆగస్ట్‌లో భారత్, పాక్‌ల మధ్య ప్రారంభం కానున్న విదేశాంగ కార్యదర్శుల భేటీ ఇదే కారణంతో రద్దవడం తెలిసిందే. కార్యదర్శుల సమావేశం కన్నా ముందు కశ్మీర్ వేర్పాటు వాదులతో పాక్ దౌత్యాధికారులు భేటీ కావడంపై ఆగ్రహంతో భారత్ ఆ చర్చల నుంచి వైదొలగింది. మోదీ, షరీఫ్‌ల మధ్య ఉఫాలో జరిగిన చర్చల సందర్భంగా కశ్మీర్ ప్రస్తావన లేకపోవడానికి నిరసనగా గత నెలలో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ ఇచ్చిన ఈద్ మిలన్ కార్యక్రమాన్ని అతివాద వేర్పాటు నేత సయ్యద్ అలీ షా గిలానీ బహిష్కరించారు. స్వాతంత్య్రం కోసం న్యాయ పోరాటం చేస్తున్న కశ్మీరీలను పాక్ వదిలేయబోదని గతవారం బాసిత్ అనడం గమనార్హం. దారితెన్నూ లేకుండా చర్చలా?: కాంగ్రెస్ పాక్‌తో చర్చల విషయంలో ప్రభుత్వం ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. కశ్మీర్ వేర్పాటువాద నేతలకు పాక్ దౌత్య కార్యాలయం ఆహ్వానం పంపడాన్ని తేలిగ్గా కొట్టేసిన కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ.. కశ్మీరీ వేర్పాటువాదులను ఎప్పుడో పక్కన పెట్టేసారన్నారు. మధ్యవర్తిత్వం నెరపండి * కశ్మీర్‌పై ఐరాసలో పాక్ పాతపాట న్యూయార్క్: భారత్-పాకిస్తాన్ల మధ్య ఎన్ఎస్ఏల చర్చలకు గడువు సమీపిస్తున్న కొద్దీ పాక్ కశ్మీర్‌పై తన దూకుడును పెంచింది. కశ్మీర్ అంశాన్ని పరిష్కరించటానికి ప్రపంచ శాంతి సంస్థ ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం నెరపాలని భద్రతామండలికి మళ్లీ విజ్ఞప్తి చేసింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) కూడా జోక్యం చేసుకోవాలంది. సమకాలీన ప్రపంచ భద్రతా సవాళ్లపై జరిగిన చర్చలో ఐరాసలో పాక్ శాశ్వత ప్రతినిధి మలీహా లోధీ మాట్లాడుతూ 57 మంది సభ్యులున్న ఓఐసీ కూడా ప్రపంచ శాంతి సౌభ్రాతృత్వాలకు తన వంతుగా పాటుపడాలని కోరారు. అంతకు ముందు వాస్తవాధీన రేఖ వద్ద భారత్, పాకిస్తాన్‌లు పూర్తి సంయమనం పాటించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని.. దాని వల్ల త్వరలో జరగబోయే ఇరుదేశాల జాతీయ భద్రతాసలహాదారుల చర్చల్లో నిర్మాణాత్మకమైన ఫలితం వెలువడే అవకాశం ఉంటుందని అన్నారు. అవే ఉల్లంఘనలు.. పౌరులే లక్ష్యాలు జమ్మూ: పాక్ బలగాలు బుధవారం రాత్రీ జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో జనావాసాలపై కాల్పులు జరిపాయి. దీటుగా తిప్పికొట్టామని సైన్యం తెలిపింది. యథావిధిగా ఎన్ఎస్ఏల చర్చలు! కశ్మీర్ వేర్పాటునేతలకు పాక్ హైకమిషన్ ఆహ్వానం నేపథ్యంలో.. పాక్‌తో ఎన్ఎస్ఏ స్థాయి చర్చలను కొనసాగించాలనే భారత్ భావిస్తోందని తెలుస్తోంది. పాక్‌లో తలదాచుకున్నారని భావిస్తున్న దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ సహా 60 మంది ఉగ్ర నేరస్తుల జాబితాను భారత్ చర్చల్లో పాక్‌కు అందజేయనుంది. వారిని తమకప్పగించాలని డిమాండ్ చేయనుంది. ఇటీవలి గురుదాస్‌పూర్, ఉధంపూర్ ఉగ్ర ఘటనలను, భారత్‌కు చిక్కిన పాక్ ఉగ్రవాది నవేద్ ఉదంతాన్ని ప్రస్తావించనుంది. ముంబై దాడుల కేసు సత్వర విచారణ అంశాన్నీ లేవనెత్తనుంది. సంరతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్లు, బలూచిస్తాన్ అస్థిరతను పాక్ లేవనెత్తొచ్చని, సంఝౌతా ఉదంతంతో ముంబై దాడులను పోల్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, పాక్ వాదనను తిప్పికొట్టాలని, ముంబై దాడులు పాక్ ప్రభుత్వ సంస్థల సహకారంతో జరిగిన విషయాన్ని ఎత్తి చూపాలని భారత్ భావిస్తోందని పేర్కొన్నాయి. లష్కరే శిక్షణపై పాక్ ఉగ్రవాది నవేద్ ఇచ్చిన సమాచారాన్ని, నవేద్ తెలిపిన పాక్‌లోని తన ఇంటి అడ్రస్‌ను పాక్ ఎన్ఎస్ఏతో దోవల్ పంచుకుంటారని వెల్లడించాయి. -
భారత్‌తో చర్చల్లో పాక్ 'కశ్మీర్' కిరికిరి
న్యూఢిల్లీ: మరో నాలుగు రోజుల్లో ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల భేటీ జరగనున్న సందర్భంలో ఎప్పటిలాగే పాకిస్థాన్ తన మార్కు రాజకీయాలకు తెరలేపింది. ఆదివారం ఢిల్లీలో భారత్- పాక్ జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, సర్తాజ్ అజీజ్ సమావేశం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి ముందే అజీజ్.. కశ్మీర్ వేర్పాటువాద నేతలతో భేటీ అవుతారని పాకిస్థాన్ హైకమిషనర్ ప్రకటించడం తీవ్రచర్చనీయాంశమైంది. అజీజ్‌తో సమావేశానికి రావాల్సిందిగా హురియత్ నేత సయ్యద్ అలీషా గిలానీ సహా పలువురు వేర్పాటువాద నాయకులకు పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ బుధవారం ఆహ్వానాలు పంపారు. పాక్ ఆహ్వానాన్ని గిలానీ సహా వేర్పాటువాదులు అంగీకరించారు కూడా. పాక్ అనూహ్య చర్యతో చర్చల ప్రక్రియపై ఒక్కసారిగా కారుమేఘాలు కమ్ముకున్నట్లయింది. అయితే ఈ విషయంలో పాక్ లా దూకుడుగా కాకుండా పూర్తి సమన్వయంతో వ్యవహరించాని భారత్ ఇదివరకే నిర్ణయించుకున్న దరిమిలా.. ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చల ప్రక్రియ రద్దుకాదని ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి. 'నిజానికి పాక్ చర్య భారత ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. వారు ద్వంద్వ విధానాలు అవలంభిస్తున్నదని అందరికీ అర్థమవుతూనేఉంది. కానీ ఏం చేస్తాం? ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్యపై వారితో తప్ప ఎవరితో మాట్లాడగలం?' అని అత్యున్నత స్థాయి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు ఐక్యరాజ్యసమితిలోనూ కశ్మీర్ అంశాన్నిపాక్ లేవనెత్తింది. 'ప్రాంతీయ సమాఖ్యలు, సమకాలీన ప్రపంచ భద్రతా సవాళ్లు' అనే అంశంపై బుధవారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి మలీహా లోథీ మాట్లాడారు. భారత్- పాక్ ల మధ్య ఏళ్లుగా నలిగిపోతోన్న కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ)లు సహకరించాలని కోరారు. -
ఆదివారం ఢిల్లీలో ఏం మాట్లాడదాం?
ఇస్లామాబాద్: ఇరుదేశాలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న భారత్- పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం తేది సమీపిస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఆదివారం (ఆగస్టు 23న) భారత్- పాక్ జాతీయ భద్రతా సలహాదారులు అజీత్ దోవల్, సర్తాజ్ అజీజ్‌లు ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి భేటీలో సైనిక పరమైన అంశాలు ఏం మాట్లాడాలనేదానిపై స్పష్టత ఇచ్చేందుకు పాక్ ఆర్మీచీఫ్ రషీల్ షరీఫ్.. ప్రధని నవాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయానికి వచ్చిన ఆర్మీచీఫ్తో ప్రధాని నవాజ్ గంటన్నరకుపైగా మాట్లాడారు. ముంబై దాడుల విషయంలో భారత్ చేస్తోన్న ఆరోపణలపై ఎదురుదాడి చేయాలని పాక్ భావిస్తున్నట్లు సమాచారం. దీనితోపాటు తాజాగా సరిహద్దు వెంబడి నెలకొన్న ఉద్రిక్తకర వాతావరణం, భారత గ్రామాలపై పాక్ సైన్యం కాల్పులు తదితర అంశాలపై భారత్ సంధించబోయే ప్రశ్నలకు ఎలా స్పందిచాలనేదానిపైనా ఈ ఇరువురూ చర్చించినట్లు తెలిసింది.