ముందు ‘వేర్పాటు’ చర్చలు! | Kashmir separatists invited to meet Aziz | Sakshi
Sakshi News home page

ముందు ‘వేర్పాటు’ చర్చలు!

Published Thu, Aug 20 2015 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

ముందు ‘వేర్పాటు’ చర్చలు!

ముందు ‘వేర్పాటు’ చర్చలు!

భద్రత సలహాదారు చర్చల ముందు పాక్ కవ్వింపు
* 23న భారత్ రానున్న పాక్ ఎన్‌ఎస్‌ఏ సర్తాజ్ అజీజ్
* అజీజ్‌తో భేటీకావాలని కశ్మీర్ వేర్పాటు నేతకు పాక్ హైకమిషన్ పిలుపు
* ఆయన గౌరవార్థం ఇచ్చే విందుకు మితవాద నేతలకు ఆహ్వానం

శ్రీనగర్: ఓపక్క భారత్‌తో చర్చలంటూనే, మరోపక్క వేర్పాటువాదులకు స్నేహహస్తం అందించే కవ్వింపు కుట్రలకు పాకిస్తాన్ మరోసారి తెరతీసింది.

ఇరుదేశాల మధ్య ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న జాతీయ భద్రత సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) స్థాయి చర్చల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వస్తున్న పాక్ ఎన్‌ఎస్‌ఏ సర్తాజ్ అజీజ్‌తో భేటీకి రావాలంటూ కశ్మీర్ వేర్పాటువాద సంస్థ, అతివాద హురియత్ కాన్ఫెరెన్స్ నేత సయ్యద్ అలీ షా గిలానీకి భారత్‌లోని పాక్ హై కమిషన్ ఆహ్వానం పంపింది. అలాగే, అజీజ్ గౌరవార్థం 23న తామిచ్చే విందుకు హాజరుకావాలంటూ మితవాద హురియత్ చైర్మన్ మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్ సహా పలువురు కశ్మీర్ మితవాద వేర్పాటు నేతలను పిలిచింది.

ఈ ఆహ్వానాన్ని గిలానీ మన్నించారని, 24న సర్తాజ్ అజీజ్‌తో ఆయన సమావేశమవుతారని అతివాద హురియత్ ప్రతినిధి అయాజ్ అక్బర్ ధ్రువీకరించారు. పాక్ హై కమిషన్ ఇస్తున్న విందుకు తనతో పాటు మితవాద నేతలు హాజరవుతారని మీర్వాయిజ్  ఫారూఖ్ చెప్పారు. ఆ విందుకు హాజరయ్యే విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని జేకేఎల్‌ఎఫ్ నేత యాసిన్ మాలిక్ తెలిపారు.
 
భారత్ సీరియస్!

పాక్ హై కమిషన్ చర్యపై భారత్ అధికారికంగా స్పందించనప్పటికీ, వేర్పాటువాదులకు ఆహ్వానం పంపడాన్ని తీవ్రంగా తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభుత్వం దీనిపై సరైన విధంగా స్పందిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాక్‌లోని కొన్ని వర్గాలు భారత్, పాక్ చర్చలను అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నాయని, వేర్పాటువాదులకు ఆహ్వానం అందులో భాగమేనన్నాయి. ఈ నేపథ్యంలో, భారత్ ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ బుధవారం హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు.  వేర్పాటువాద నేతలకు పాక్ హై కమిషన్ ఆహ్వానంప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

కశ్మీర్ వేర్పాటువాద నేతలకు ఆహ్వానం పంపడాన్ని భారత్‌లోని పాక్ హై కమిషన్ సమర్థించుకుంది. ‘ఇది కొత్తేం కాదు.  గతంలోనే వేర్పాటువాదులను కలిశాం. ఇలాంటి భేటీలు, విందులు గతంలోనూ జరిగాయి. దీనిపై ఇంత రాద్ధాంతం ఎందుకు?’ అంటూ కమిషన్‌లోని కౌన్సెలర్(ప్రెస్) మంజూర్ మెమన్ అన్నారు. అజిత్ దోవల్‌తో సర్తాజ్ అజీజ్ చర్చలు 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇరుదేశాలు ఎన్‌ఎస్‌ఏ స్థాయి చర్చలు ప్రారంభించాలంటూ జూలై 10న రష్యాలోని ఉఫాలో భేటీ సందర్భంగా భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ నిర్ణయించడం తెలిసిందే.
 
రాజకీయం చేయొద్దు: మీర్వాయిజ్
పాక్ ఎంబసీ నుంచి ఆహ్వానం అందగానే, మితవాద హురియత్ కాన్ఫెరెన్స్ బుధవారం అత్యవసర కార్యనిర్వాహక భేటీని ఏర్పాటు చేసింది. అజీజ్ గౌరవార్థం ఇస్తున్న విందుకు వెళ్లాలని నిర్ణయించింది. నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తత సడలేలా, సంపూర్ణ కాల్పుల విరమణ అమలయ్యేలా భారత్, పాక్‌లు చర్యలు తీసుకోవాలని  మీర్వాయిజ్  ఫారూఖ్ సూచించారు. ‘దక్షిణాసియాలో శాంతి నెలకొనే ఒక అవకాశాన్ని గత ఏడాది కోల్పోయాం. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మాకు ఆహ్వానం పంపడాన్ని రాజకీయం చేయొద్దు.

రాజకీయం చేసే అంశాలు వేరే ఉన్నాయి’ అన్నారు. గత ఆగస్ట్‌లో భారత్, పాక్‌ల మధ్య ప్రారంభం కానున్న విదేశాంగ కార్యదర్శుల భేటీ ఇదే కారణంతో రద్దవడం తెలిసిందే. కార్యదర్శుల సమావేశం కన్నా ముందు కశ్మీర్ వేర్పాటు వాదులతో పాక్ దౌత్యాధికారులు భేటీ కావడంపై ఆగ్రహంతో భారత్ ఆ చర్చల నుంచి వైదొలగింది. మోదీ, షరీఫ్‌ల మధ్య ఉఫాలో జరిగిన చర్చల సందర్భంగా కశ్మీర్ ప్రస్తావన లేకపోవడానికి నిరసనగా గత నెలలో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ ఇచ్చిన ఈద్ మిలన్ కార్యక్రమాన్ని అతివాద వేర్పాటు నేత సయ్యద్ అలీ షా గిలానీ బహిష్కరించారు. స్వాతంత్య్రం కోసం న్యాయ పోరాటం చేస్తున్న కశ్మీరీలను పాక్ వదిలేయబోదని గతవారం బాసిత్ అనడం గమనార్హం.
 
దారితెన్నూ లేకుండా చర్చలా?: కాంగ్రెస్
పాక్‌తో చర్చల విషయంలో ప్రభుత్వం  ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. కశ్మీర్ వేర్పాటువాద నేతలకు పాక్ దౌత్య కార్యాలయం ఆహ్వానం పంపడాన్ని తేలిగ్గా కొట్టేసిన కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ.. కశ్మీరీ వేర్పాటువాదులను ఎప్పుడో పక్కన పెట్టేసారన్నారు.
 
మధ్యవర్తిత్వం నెరపండి
* కశ్మీర్‌పై ఐరాసలో పాక్ పాతపాట
న్యూయార్క్: భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఎన్‌ఎస్‌ఏల చర్చలకు గడువు సమీపిస్తున్న కొద్దీ పాక్ కశ్మీర్‌పై తన దూకుడును పెంచింది. కశ్మీర్ అంశాన్ని పరిష్కరించటానికి ప్రపంచ శాంతి సంస్థ ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం నెరపాలని భద్రతామండలికి మళ్లీ విజ్ఞప్తి చేసింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) కూడా జోక్యం చేసుకోవాలంది. సమకాలీన ప్రపంచ భద్రతా సవాళ్లపై జరిగిన చర్చలో ఐరాసలో పాక్ శాశ్వత ప్రతినిధి మలీహా లోధీ మాట్లాడుతూ 57 మంది సభ్యులున్న ఓఐసీ కూడా ప్రపంచ శాంతి సౌభ్రాతృత్వాలకు తన వంతుగా పాటుపడాలని కోరారు.

అంతకు ముందు వాస్తవాధీన రేఖ వద్ద భారత్, పాకిస్తాన్‌లు పూర్తి సంయమనం పాటించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని.. దాని వల్ల త్వరలో జరగబోయే ఇరుదేశాల జాతీయ భద్రతాసలహాదారుల చర్చల్లో నిర్మాణాత్మకమైన ఫలితం వెలువడే అవకాశం ఉంటుందని అన్నారు.  
 
అవే ఉల్లంఘనలు.. పౌరులే లక్ష్యాలు
జమ్మూ: పాక్ బలగాలు బుధవారం రాత్రీ జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో జనావాసాలపై కాల్పులు జరిపాయి.  దీటుగా తిప్పికొట్టామని సైన్యం తెలిపింది.
 
యథావిధిగా ఎన్‌ఎస్‌ఏల చర్చలు!

కశ్మీర్ వేర్పాటునేతలకు పాక్ హైకమిషన్ ఆహ్వానం నేపథ్యంలో.. పాక్‌తో ఎన్‌ఎస్‌ఏ స్థాయి చర్చలను కొనసాగించాలనే భారత్ భావిస్తోందని తెలుస్తోంది. పాక్‌లో తలదాచుకున్నారని భావిస్తున్న దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ సహా 60 మంది ఉగ్ర నేరస్తుల జాబితాను భారత్ చర్చల్లో పాక్‌కు అందజేయనుంది. వారిని తమకప్పగించాలని డిమాండ్ చేయనుంది. ఇటీవలి గురుదాస్‌పూర్, ఉధంపూర్ ఉగ్ర ఘటనలను, భారత్‌కు చిక్కిన పాక్ ఉగ్రవాది నవేద్ ఉదంతాన్ని ప్రస్తావించనుంది.

ముంబై దాడుల కేసు సత్వర విచారణ అంశాన్నీ లేవనెత్తనుంది. సంరతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్లు, బలూచిస్తాన్ అస్థిరతను పాక్ లేవనెత్తొచ్చని, సంఝౌతా ఉదంతంతో ముంబై దాడులను పోల్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  అయితే, పాక్ వాదనను తిప్పికొట్టాలని, ముంబై దాడులు పాక్ ప్రభుత్వ సంస్థల సహకారంతో జరిగిన విషయాన్ని ఎత్తి చూపాలని భారత్ భావిస్తోందని పేర్కొన్నాయి. లష్కరే శిక్షణపై పాక్ ఉగ్రవాది నవేద్ ఇచ్చిన సమాచారాన్ని, నవేద్ తెలిపిన పాక్‌లోని తన ఇంటి అడ్రస్‌ను పాక్ ఎన్‌ఎస్‌ఏతో దోవల్ పంచుకుంటారని వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement