చర్చల ప్రక్రియకు పాక్ వెన్నుపోటు!
జాతీయ భద్రతా సలహాదారు స్థాయిలో భారత్, పాక్ల మధ్య జరగాల్సిన చర్చల ప్రక్రియను ఎలాగైనా అడ్డుకునేందుకు పాకిస్థాన్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. భారత్ నుంచి తమపై ఒత్తిడి వస్తోందని.. ఆ ఒత్తిడిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తాజాగా వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా తాము వేర్పాటువాద హురియత్ నేతలను కలుస్తామని, ఇందులో రాజీపడేది లేదని అన్నారు. పాకిస్థాన్ సైన్యం నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఉంటోందో.. అచ్చం అలాంటి పద్ధతిలోనే నవాజ్ కూడా మాట్లాడుతున్నట్లు అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు.
జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరగడానికి ముందే కాశ్మీర్లోని వేర్పాటువాద నేతలతో పాక్ జాతీయ భద్రతా సలహాదారు సమావేశం ఏర్పాడు చేయడంతో.. చర్చల ప్రక్రియకు విఘాతం కలిగేలాగే ఉంది. వేర్పాటువాదులతో పాకిస్థాన్ చర్చించడానికి వీల్లేదని భారత్ గట్టిగా హెచ్చరించడం ఒకరకంగా పాకిస్థాన్కు కలిసొచ్చినట్లయింది. ఇప్పుడు చర్చలు జరిగితే అందులో ప్రధాన అంశం పాక్ ఉగ్రవాదం, తాజాగా ఉధంపూర్లో సజీవంగా పట్టుబడిన నవేద్ తదితర అంశాలు చర్చకు వస్తాయి కాబట్టి.. ఈ చర్చలు జరగకుండా చూడాలన్నదే ముందునుంచి పాక్ ఉద్దేశంలా కనిపిస్తోంది.
ఇక ఇప్పుడు భారతదేశం నుంచి వేర్పాటువాద నేతలతో చర్చల విషయమై హెచ్చరికలు రావడంతో.. రెండు దేశాల మధ్య చర్చలకు 'షరతులు' పెడితే ఊరుకోబోమని పాక్ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. హురియత్ నేతలతో తమ చర్చలు కొనసాగి తీరుతాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై చర్చించారు. మరోవైపు శ్రీనగర్లోని మసీదు దగ్గర పాకిస్థాన్, లష్కరే తాయిబా, ఐఎస్ఐఎస్ జెండాలు కనిపించాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చర్చలు జరగడం అనుమానంగానే కనిపిస్తోంది.