ఆదివారం ఢిల్లీలో ఏం మాట్లాడదాం?
ఇస్లామాబాద్: ఇరుదేశాలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న భారత్- పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం తేది సమీపిస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఆదివారం (ఆగస్టు 23న) భారత్- పాక్ జాతీయ భద్రతా సలహాదారులు అజీత్ దోవల్, సర్తాజ్ అజీజ్లు ఢిల్లీలో సమావేశం కానున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం నాటి భేటీలో సైనిక పరమైన అంశాలు ఏం మాట్లాడాలనేదానిపై స్పష్టత ఇచ్చేందుకు పాక్ ఆర్మీచీఫ్ రషీల్ షరీఫ్.. ప్రధని నవాజ్ షరీఫ్తో సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయానికి వచ్చిన ఆర్మీచీఫ్తో ప్రధాని నవాజ్ గంటన్నరకుపైగా మాట్లాడారు.
ముంబై దాడుల విషయంలో భారత్ చేస్తోన్న ఆరోపణలపై ఎదురుదాడి చేయాలని పాక్ భావిస్తున్నట్లు సమాచారం. దీనితోపాటు తాజాగా సరిహద్దు వెంబడి నెలకొన్న ఉద్రిక్తకర వాతావరణం, భారత గ్రామాలపై పాక్ సైన్యం కాల్పులు తదితర అంశాలపై భారత్ సంధించబోయే ప్రశ్నలకు ఎలా స్పందిచాలనేదానిపైనా ఈ ఇరువురూ చర్చించినట్లు తెలిసింది.