భారత్తో చర్చల్లో పాక్ 'కశ్మీర్' కిరికిరి
న్యూఢిల్లీ: మరో నాలుగు రోజుల్లో ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల భేటీ జరగనున్న సందర్భంలో ఎప్పటిలాగే పాకిస్థాన్ తన మార్కు రాజకీయాలకు తెరలేపింది. ఆదివారం ఢిల్లీలో భారత్- పాక్ జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, సర్తాజ్ అజీజ్ సమావేశం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి ముందే అజీజ్.. కశ్మీర్ వేర్పాటువాద నేతలతో భేటీ అవుతారని పాకిస్థాన్ హైకమిషనర్ ప్రకటించడం తీవ్రచర్చనీయాంశమైంది.
అజీజ్తో సమావేశానికి రావాల్సిందిగా హురియత్ నేత సయ్యద్ అలీషా గిలానీ సహా పలువురు వేర్పాటువాద నాయకులకు పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ బుధవారం ఆహ్వానాలు పంపారు. పాక్ ఆహ్వానాన్ని గిలానీ సహా వేర్పాటువాదులు అంగీకరించారు కూడా. పాక్ అనూహ్య చర్యతో చర్చల ప్రక్రియపై ఒక్కసారిగా కారుమేఘాలు కమ్ముకున్నట్లయింది.
అయితే ఈ విషయంలో పాక్ లా దూకుడుగా కాకుండా పూర్తి సమన్వయంతో వ్యవహరించాని భారత్ ఇదివరకే నిర్ణయించుకున్న దరిమిలా.. ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చల ప్రక్రియ రద్దుకాదని ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి. 'నిజానికి పాక్ చర్య భారత ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. వారు ద్వంద్వ విధానాలు అవలంభిస్తున్నదని అందరికీ అర్థమవుతూనేఉంది. కానీ ఏం చేస్తాం? ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్యపై వారితో తప్ప ఎవరితో మాట్లాడగలం?' అని అత్యున్నత స్థాయి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
మరోవైపు ఐక్యరాజ్యసమితిలోనూ కశ్మీర్ అంశాన్నిపాక్ లేవనెత్తింది. 'ప్రాంతీయ సమాఖ్యలు, సమకాలీన ప్రపంచ భద్రతా సవాళ్లు' అనే అంశంపై బుధవారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి మలీహా లోథీ మాట్లాడారు. భారత్- పాక్ ల మధ్య ఏళ్లుగా నలిగిపోతోన్న కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ)లు సహకరించాలని కోరారు.