
ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగా అడుగులేస్తున్నారు . ఉక్రెయిన్, గాజా సంక్షోభాలకు ముగింపు పలికేందుకు కఠిన నిర్ణయాలే తీసుకుంటున్నారు. అయితే ఆయన సాయంతోనే సున్నితమైన కశ్మీర్ సమస్య(Trump Kashmir Issue)ను భారత్ పరిష్కరించుకోవచ్చు కదా!. ఇదే ప్రశ్న భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌కు ఎదురైంది.
లండన్ చాథమ్ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి జై శంకర్ హాజరయ్యారు. కశ్మీర్ పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump)ను భారత ప్రధాని మోదీ కోరే ఉద్దేశమేదైనా ఉందా? అని ప్రతినిధులు ఆయన్ని అడిగారు. అయితే ఈ అంశంలో భారత్ ఇప్పటిదాకా స్వతంత్రంగానే వ్యవహరించిందని.. ఇక మీదటా ‘మూడో ప్రమేయం’ ఉండదని స్పష్టం చేశారాయన.
కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా ఇప్పటిదాకా మేం(భారత్) ఒంటరి ప్రయత్నాలే చేశాం. మంచి అడుగులెన్నో వేశాం. ఇప్పటికే నిర్ణయాత్మక చర్యలెన్నో తీసుకున్నాం. అందులో మొదటి అడుగే ఆర్టికల్ 370(Article 370) తొలగింపు. కశ్మీర్ అభివృద్ధి, ఆర్థిక పురోగతి, సామాజిక న్యాయం.. ఇవి రెండో అడుగు. అత్యధిక ఓటింగ్ శాతం నమోదు అయ్యేలా ఎన్నికలు నిర్వహించడం మూడో అడుగు. అయితే..
ఇంకా పరిష్కారం కాని అంశం.. దేశం అవతల ఉంది. అదే పాక్ ఆక్రమిత కశ్మీర్(Pak Occupied Kashmir). దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడం మాత్రమే మిగిలి ఉంది. అది పూర్తైతే గనుక కశ్మీర్ సమస్య పరిష్కారం అయినట్లే. అందుకు నేను మీకు హామీ ఇస్తున్నా’’ అని జైశంకర్ అన్నారు.
‘పీవోకే’ భారత్‌లో అంతర్భాగమని, అది 1947 నుంచి పాక్ ఆక్రమణలో ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఎప్పటికప్పుడు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కిందటి ఏడాది.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విదేశీ భూభాగమేనని స్వయంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టులో అంగీకరించింది. ఓ జర్నలిస్ట్ కిడ్నాప్ కేసులో హైకోర్టులో వాదనలు వినిపించిన అదనపు అటార్నీ జనరల్.. పీవోకే విదేశీ భూభాగమని, అక్కడ పాక్ చట్టాలు చెల్లవని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment