అమెరికా విదేశాంగ మంత్రిగా రూబియో | Trump selects Mike Waltz as national security adviser | Sakshi
Sakshi News home page

అమెరికా విదేశాంగ మంత్రిగా రూబియో

Published Wed, Nov 13 2024 4:59 AM | Last Updated on Wed, Nov 13 2024 4:59 AM

Trump selects Mike Waltz as national security adviser

జాతీయ భద్రతా సలహాదారుగా మైక్‌ వాల్జ్‌

ఇద్దరూ భారత్‌కు అనుకూలురే

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిౖన డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక పదవులకు ఎంపికలను వేగిరం చేశారు. విదేశాంగ మంత్రిగా ఫ్లోరిడా సెనేటర్‌ మార్కో రూబియో(53)ను, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) పదవికి కాంగ్రెస్‌ సభ్యుడు మైక్‌ వాల్జ్‌ (50)లను ఎంపిక చేశారు. రూబియో, వాల్జ్‌ల ఎంపికను ట్రంప్‌ రెండో హయాంలో భారత్‌– అమెరికాల మధ్య సన్నిహిత సంబంధాలకు కొనసాగింపుగా భావిస్తు న్నారు. భారత్‌కు మిత్రుడిగా పేరున్న రూబియో, భారత్‌– అమెరికా సంబంధాలను మెరుగుపర్చడంలో కీలకంగా ఉంటున్నారు.

ట్రంప్‌కు నమ్మినబంటుగా పేరున్న వాల్జ్‌ భారత్‌కు పాత మిత్రుడే. భారతీయ అమెరికన్ల పక్షాన మాట్లాడే వాల్జ్, ఇండియా కంగ్రెషనల్‌ కాకస్‌కు సహాధ్యక్షుడిగా ఉండటం గమనార్హం. వీరిద్దరితోపాటు యునైటెడ్‌ స్టేట్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్టివ్‌ ఏజెన్సీ(ఈపీఏ) హెడ్‌గా కాంగ్రెస్‌ మాజీ సభ్యుడు లీ జెల్డిన్‌ పేరును ట్రంప్‌ ప్రకటించారు. అయితే తాజా ఎంపికలపై ట్రంప్‌ యంత్రాంగం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇండియా కాకస్‌ హెడ్‌కు ఎన్‌ఎస్‌ఏ బాధ్యతలు
భారత్‌ కాకస్‌ కో–చైర్‌గా ఉన్న వాల్జ్‌ ఎన్‌ఎస్‌ఏ హోదాలో ట్రంప్‌ విధానాలకు అనుగుణంగా కఠిన విధానాలను తీసుకొస్తారని భావిస్తు న్నారు. ఈ నియామకానికి సెనేట్‌ ఆమోదం అవసరం లేదు. అమెరికా ఆర్మీలో కల్నల్‌గా అఫ్గానిస్తాన్, పశ్చిమాసియా, ఆఫ్రికాల్లో పనిచేశారు. వీరోచితంగా పోరాడినందుకు ప్రతిష్టాత్మక గ్రీన్‌ బెరెట్‌ గౌరవం పొందారు. వాల్జ్‌ 2019 నుంచి అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడిగా ఉన్నారు.

ఆర్మ్‌డ్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌గా 2021లో అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా సేనల ఉపసంహరణపై అధ్యక్షుడు జో బైడెన్‌ను నిలదీసి వార్తల్లో కెక్కారు. ప్రాంతీయ సుస్థిరత సాధనకు చైనాపై కఠిన వైఖరి, భారత్‌ వంటి ప్రజాస్వామిక దేశాలతో బలమైన పొత్తులు అవసరమన్నది ఈయన వాదన. 2023లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా క్యాపిటల్‌ హిల్‌ వద్ద ప్రసంగాన్ని ఏర్పాటు చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. 

ఏమిటీ ఇండియా కాకస్‌..?
అమెరికా కాంగ్రెస్‌లో భాగమైన ఇండియా కాకస్‌ భారత్‌ అనుకూల విధానాల రూప కల్పనలో చురుగ్గా వ్యవహరిస్తుంది. భారత్‌–అమెరికా ఆర్థిక వ్యవస్థ, భద్రతలను ప్రభావితం చేస్తుంది. 2004లో అప్పటి సెనేటర్లు, విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్, జాన్‌ కార్నిన్‌లు నెలకొల్పారు. ప్రస్తుతం 40 మంది సభ్యులున్న ఈ కమిటీ సెనేట్‌లో అతిపెద్ద కాకస్‌గా గుర్తింపు పొందింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement