గాజాపై ట్రంప్ మాటలకు అధికారుల మరో భాష్యం
గ్వాటెమాలా సిటీ: గాజా ప్రాంతాన్ని నియంత్రణలోకి తెచ్చుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మిత్ర దేశాలతోపాటు, సొంత రిపబ్లికన్ పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో, ట్రంప్ యంత్రాంగం కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. విదేశాంగ మంత్రి మార్కో రుబియో, వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ గురువారం ట్రంప్ మాటలకు మరో అర్థం చెప్పారు.
గాజా పునర్నిర్మాణం చేపట్టేందుకు వీలుగా అక్కడున్న 18 లక్షల మంది పాలస్తీనియన్లకు మరో చోట తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేయాలన్నదే ట్రంప్ మాటల వెనుక అర్థమంటూ వివరించారు. విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మార్కో రుబియో గురువారం మొట్టమొదటి విదేశీ పర్యటన కోసం గ్వాటెమాలా వెళ్లారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగిన 15 నెలల యుద్ధం ఫలితంగా గాజా ప్రాంతం శిథిలాలతో నిండిపోయింది. వాటిని తొలగించి పునర్నిర్మాణం చేపట్టాలనే సదుద్దేశంతో ట్రంప్ చాలా జాలితో పాలస్తీనియన్లకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ప్రతిపాదన చేశారు.
పునర్నిర్మాణ పనులు జరిపేటప్పుడు అర్థంతరంగా వెళ్లాలన్నా వారు ఎక్కడికీ వెళ్లలేరు, అక్కడే ఉండిపోనూ లేరు’అని చెప్పుకొచ్చారు. లీవిట్ వాషింగ్టన్‌లో మీడియాతో సమావేశంలో.. గాజాను ధ్వంసమైన ప్రాంతంగా పేర్కొంటూ శిథిల భవనాలతో కూడిన ఫొటోను ప్రదర్శించారు. అధ్యక్షుడు అక్కడి వారిని గాజా నుంచి తాత్కాలికంగా తరలించాలని స్పష్టంగా చెప్పారు. గాజా ప్రస్తుతం మనుషులకు ఏమాత్రం నివాసయోగ్యంగా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వారిని అక్కడే ఉండిపోవాలనడం కూడా దుర్మార్గమైన సూచన అనిపించుకుంటుంది’అంటూ వివరించే ప్రయత్నం చేశారు. అయితే, గాజాకు అమెరికా బలగాలను పంపే యోచనను ఆయన కొట్టిపారేయలేదు. చర్చలు సవ్యంగా సాగాలంటే అమెరికా బలగాలు అక్కడుండాల్సిన అవసరముందని చెప్పారు. గాజా పునర్నిర్మాణానికి ఉన్న అన్ని రకాల ప్రత్యామ్నాయాలతో మిలటరీ సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ బుధవారం ప్రకటించారు.
జాతి నిర్మూలన ఆలోచన వద్దు: గ్యుటెరస్
ఇజ్రాయెల్–పాలస్తీనా రెండు దేశాల పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి కట్టుబడి ఉంటుందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ పునరుద్ఘాటించారు. జాతి నిర్మూలన యోచనను నివారించడం అత్యవసరమన్నారు. పాలస్తీనియన్లను వేరే ప్రాంతానికి పంపించి, గాజా నుంచి ను స్వా«దీనం చేసుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘సమస్య పరిష్కారాన్ని వెదికే ప్రయత్రంలో పరిస్థితిని మరింత దిగజార్చరాదు. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండటం అత్యావశ్యకం. ఏ రూపంలో అయినా జాతి నిర్మూలన నివారించాలి’అని పేర్కొన్నారు. ఆక్రమణలకు ముగింపు పలకాలన్నారు. గాజా అంతర్భాగంగా స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అన్ని వర్గాలు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. పశి్చమాసియా శాంతి సుస్థిరతలకు ఇదే అసలైన పరిష్కారమని నొక్కిచెప్పారు.
ట్రంప్ ఏమన్నారంటే..
గాజాలో పాలస్తీనియన్లందరినీ వేరే ప్రాంతానికి తరలించి, అక్కడే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేస్తామంటూ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. అనంతరం అక్కడ అమెరికా బలగాలను దించి, భారీగా పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామన్నారు. శాశ్వతమైన మంచి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ప్రస్తుతమున్నట్లుగా కాకుండా అప్పుడు గాజాలో సంతోషంగా ఉండొచ్చు. తుపాకీ కాల్పులు, ఎవరైనా పొడుస్తారని, చంపేస్తారని భయాలుండవు. అమెరికా దీర్ఘకాల యాజమాన్యంలో మధ్యధర సముద్ర తీరంలోని ఆ ప్రాంతంలో పునర్నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.
ఈ మాటలపై, పాలస్తీనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమ సొంత భూభాగాన్ని ఒకసారి వదిలేసి వెళితే, తిరిగి రానివ్వరంటూ వారు భయాందోళనలకు గురయ్యారు. అరబ్ దేశాలు సైతం ట్రంప్ ప్రతిపాదనను తప్పుబట్టాయి. ఈజిప్టు, జోర్డాన్ వంటి మిత్ర దేశాలు సైతం పాలస్తీనియన్ల తరలింపును వ్యతిరేకించాయి. ఇటువంటి చర్యవల్ల పశి్చమాసియా సుస్థిరత ప్రమాదంలో పడుతుందని, సంక్షోభం మరింత ముదురుతుందని హెచ్చరించాయి. సౌదీ అరేబియా కూడా ట్రంప్ ప్రకటనను తప్పుబట్టింది. ట్రంప్ ప్రకటన సమస్యాత్మకంగా ఉందని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment