సరిహద్దులో 230 మంది ఉగ్రవాదులు | NSA Ajit Doval confirms presence of around 230 Pak terrorists in Kashmir | Sakshi
Sakshi News home page

సరిహద్దులో 230 మంది ఉగ్రవాదులు

Published Sun, Sep 8 2019 5:23 AM | Last Updated on Sun, Sep 8 2019 9:17 AM

NSA Ajit Doval confirms presence of around 230 Pak terrorists in Kashmir - Sakshi

న్యూఢిల్లీ: భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్‌ కుట్ర పన్నుతోందని తెలిపారు. ఇందులోభాగంగా సరిహద్దులో 230 మంది ఉగ్రవాదులను పాక్‌ సిద్ధం చేసిందనీ, వీరిలో కొందరు ఇప్పటికే కశ్మీర్‌లోకి ప్రవేశించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి రావడం, లోయ నుంచి రోజుకు 750 ట్రక్కుల ఆపిల్స్‌ ఎగుమతి కావడంపై పాక్‌ లోని ఉగ్రమూకలు రగిలిపోతున్నారని దోవల్‌ వెల్లడించారు. ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీరీ యువతకు గొప్ప భవిష్యత్, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోయడమే పాక్‌ వద్దున్న ఏకైక అస్త్రమని విమర్శించారు. ఢిల్లీలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన దోవల్‌.. పాక్‌ వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు.

టవర్లు ఏర్పాటుచేసిన పాక్‌..
కశ్మీర్‌ వద్ద సరిహద్దులో 20 కి.మీ విస్తీర్ణంలో పాక్‌ ప్రత్యేకంగా కమ్యూనికేషన్‌ టవర్లను ఏర్పాటు చేసిందని ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ దోవల్‌ తెలిపారు. ‘‘ఈ టవర్ల సాయంతో కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పాక్‌లోని వారి హ్యాండ్లర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. వీరి సంభాషణల్ని మన నిపుణులు గుర్తించారు. ఈ సందర్భంగా పాకిస్తానీ హ్యాండ్లర్‌ మండిపడుతూ..‘అసలు అన్ని ఆపిల్‌ ట్రక్కులు రాకపోకలు ఎలా సాగిస్తున్నాయ్‌? వాటిని మీరు ఆపలేరా? చేతకాకుంటే ఒప్పుకోండి. మీకు తుపాకులకు బదులుగా గాజులు పంపుతాం’ అని రెచ్చగొట్టేలా పంజాబీలో పాక్‌ యాసలో మాట్లాడాడు. ఇది జరిగిన తర్వాత ఇద్దరు ఉగ్రవాదులు గత శుక్రవారం సోపోర్‌లోని దంగపురా ప్రాంతంలో ప్రముఖ ఆపిల్‌ వ్యాపారి హమీదుల్లా రాథర్‌ ఇంటికెళ్లారు.

హమీదుల్లా నమాజ్‌కు వెళ్లడంతో ఆగ్రహంతో ఆయన కుటుంబసభ్యులపై పిస్టళ్లతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హమీదుల్లా కుమారుడు ఇర్షాద్‌(25), రెండున్నరేళ్ల మనవరాలు అస్మాలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చిన్నారి అస్మా ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాం’’ అని దోవల్‌ వెల్లడించారు. ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడాన్ని మెజారిటీ కశ్మీరీలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370 ప్రత్యేక హక్కు ఎంతమాత్రం కాదనీ, అతి ప్రత్యేకమైన వివక్షని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లో ప్రస్తుతం 10 పోలీస్‌స్టేషన్ల పరిధిలోనే నిషేధాజ్ఞలు అమలవుతున్నాయనీ, ఉగ్రవాదులు సంప్రదింపులు జరపకుండా ఉండేందుకే ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్‌ వ్యవస్థలను స్తంభింపజేశామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement