సాక్షి, అమరావతి : పల్నాడులో 144,30 సెక్షన్ విధించామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమన్నారు. శాంతి భద్రతల విషయంలో అన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని కోరారు. వినాయక నిమజ్జనం, మొహరం పండుగల నేపథ్యంలో ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పల్నాడులో ఎటువంటి అవాంచనీయ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని డీజీపీ తెలిపారు.
కాగా, తమ శ్రేణులపై దాడులు చేస్తున్నారంటూ టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతలు ఒకరి ఒకరు పోటీగా బాధితుల కోసం పల్నాడులో పునరావాస శిబిరాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్నాడులో ఉద్రిక్తత కొనసాగుతోంది.
ఆత్మకూరులో ప్రశాంత వాతావరణం : గురజాల డీఎస్పీ
ఆత్మకూరులో ప్రశాంత వాతావరణం నెలకొందని గురజాల డీఎస్పీ శ్రీహరి అన్నారు. గతంలో ఒకే కుటుంబానికి చెందిన ఎస్సీల మధ్య గొడవలు జరిగాయని, అవన్ని కుటుంబ వివాదాలే అన్నారు. వాటితో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలీసుల చొరవతో వారంతా కలిసిపోయారని, ఇప్పడు గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొందని శ్రీహరి తెలిపారు.
ఐజీని కలిసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
రేపటి ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను కలిశారు. టీడీపీ బాధితులకు న్యాయం చేసేందుకు చేపట్టబోయే ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఐజీని కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, బొల్లా బ్రాహ్మనాయుడు, ఎంపీలు నందిగం సురేష్, లావు శ్రీకృష్ణ దేవరాయలు, పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment