
సాక్షి, గుంటూరు: టీడీపీ కార్యకర్తల బరితెగింపుతో పల్నాడు ప్రాంతంలో టెన్షన్ వాతవారణం నెలకొంది. ప్రశాంతతను చెదరగొట్టి చిచ్చు రగిల్చేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తుగా 144 సెక్షన్‌ను అమలు చేశారు. అయినా పోలీసుల హెచ్చరికలను లెక్కచేయని టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నచ్చచెప్పేందుకు పోలీసులు ప్రయత్నించినా.. నారా లోకేష్, మరికొందరు నేతలు వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో చంద్రబాబు నివాస పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా బుధవారం తెల్లవారుజామునుంచి చంద్రబాబు ఇంటివద్ద టీడీపీ నేతలు ఓవర్ యాక్షన్‌కు దిగుతున్నారు. కార్యకర్తలను రెచ్చగొడుతూ.. రోడ్లపైకి పంపుతున్నారు.
ముందస్తు హౌస్ అరెస్ట్
సేవ్ పల్నాడు పేరుతో ఛలో ఆత్మకూరుకు ఇరుపార్టీలు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరుపక్షాల మోహరింపుతో పల్నాడులో ఉత్కంఠగా మారింది. బుధవారం ఉదయం 9 గంటలకు ఆత్మకూరు బయల్దేరాలని టీడీపీ నేతల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. తమ అనుమతి లేకుండా ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలు చేయవద్దని ఆదేశాలు జారీచేశారు. శాంతిభధ్రతల పరిరక్షణలో భాగంగా కొంతమంది నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేస్తున్నారు. గుంటూరుతో సహా సమస్యాత్మక ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.