శ్రీనగర్ : ఈద్ పండుగ సందర్భంగా శుక్రవారం ప్రార్థనలకు, వ్యాపారానికి కశ్మీర్‌లో విధించిన ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐదు రోజులుగా జమ్మూ కశ్మీర్‌లో కర్ఫ్యూ ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రత్యేక ప్రసంగంలో మాట్లాడుతూ ఈద్ జరుపుకునే ప్రజలు ‘ఇబ్బందులు ఎదుర్కోరు’ అని, త్వరలోనే పరిస్థితి సాధారణమవుతుందని కశ్మీరీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ దిశగా ప్రభుత్వం కశ్మీర్‌లో సాధారణ పరిస్థితి ఏర్పడటానికి వేగంగా కృషి చేస్తోంది. శ్రీనగర్‌లోని చరిత్రాత్మక జామామసీదులో కూడా ప్రార్థనలకు అనుమతించారు. బ్యాంకు లావాదేవీలు పరిమిత స్థాయిలో జరుగుతున్నాయి. కూరగాయల దుకాణాలు, మెడికల్ షాపులను వ్యాపారులు తెరుస్తున్నారు.
కశ్మీర్ లోయలో ఎవరినీ వేధించకుండా చూసుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ అధికారులను ఆదేశించిన తరువాత ఈ ప్రాంతంలో ఆంక్షలు సడలింపు మరింత వేగమైంది. పండుగ వస్తువులు కోసం దుకాణాల దగ్గరకి ప్రజలు రావాల్సిన అవసరం లేదని, ఇళ్ల దగ్గరకే వివిద వస్తువులు సరఫరా చేయబడతాయని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. అలాగే మార్కెట్లు కూడా ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపారు. కశ్మీర్ అంతటా సెక్షన్ 144 అమలులో ఉన్నా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే మినహాయింపులు ఇచ్చామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment