అమరులారా.. వందనం | Indravelli solid tribute at the stupham | Sakshi
Sakshi News home page

అమరులారా.. వందనం

Published Thu, Apr 21 2016 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

అమరులారా.. వందనం

అమరులారా.. వందనం

ఇంద్రవెల్లి స్తూపం వద్ద ఘన నివాళులు
ఏ సెక్షన్లు, యూక్టులు లేకుండా.. స్వేచ్ఛగా..
దాదాపు 35 ఏళ్ల తర్వాత మొదటిసారి ఇలా..
►  తరలివచ్చిన పలువురు నేతలు, గిరిజనులు

 
ఇంద్రవెల్లి ఘటన జరిగి 35 ఏళ్లు అయ్యింది.. ఇన్నేళ్ల తర్వాత ఆ అమరవీరులకు స్వేచ్ఛగా నివాళి అర్పించే అవకాశం లభించిం ది. ఎప్పుడూ పోలీసుల బూట్ల చప్పుడు.. మచ్చుకైనా కనిపించ ని ప్రజానీకం.. ఇదీ ఏటా ఇంద్రవెల్లి స్తూపం వద్ద సాక్షాత్కారమ య్యే పరిస్థితి. కానీ.. ఈసారి 144 సెక్షన్, పోలీసు యాక్టు లేకుండాపోయింది

 
ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి పోరుగడ్డ పులకరించింది. 35 ఏళ్ల తర్వాత, స్వరాష్ట్రంలో మొదటిసారిగా 144 సెక్షన్, పోలీసు యాక్టు 30 లేకుండా బధవారం స్వేచ్ఛగా అమరవీరులకు ఆదివాసీలు ఘనంగా నివాళులర్పించారు. అమరులారా వందనమంటూ ప్రణమిల్లారు. 1981 ఏప్రిల్ 20న జల్...జంగల్...జమీన్ పేరిటి నినాదించి అమరులైన ఆదివాసీ వీరులకు నివాళులు అర్పించడానికి వారి బంధువులు, జిల్లా ఆదివాసీలు 34 ఏళ్లుగా ఎదురు చూసినా ఇంత వరకు ఏ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

గతేడాది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించడానికి అనుమతి ఇచ్చినా ఆంక్షలు విధించింది. దీంతో ఆదివాసీలు మౌనంగా నివాళులర్పించారు. ఈ ఏడాది ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకపోవడంతో, పోలీసుల భద్రతతో కూడిన అనుమతి ఇవ్వడంతో ఆదివాసీలు అత్యంత ఉత్సాహంగా బుధవారం ఉదయం మండంకేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు.


 ఏళ్ల తర్వాత స్తూపానికి రంగులు
ముందుగా 1983లో స్తూపానికి పూర్తిస్థాయిలో ఎర్ర రంగు వేసినా, 1986లో గుర్తు తెలియని వ్యక్తులు ఆ స్తూపాన్ని పేల్చివేయడంతో 1987లో ప్రభుత్వ నిధులతో నిర్మించినా రంగులు వేయకుండా వదిలేశారు. పదేళ్ల క్రితం అజ్ఞాత వ్యక్తులు స్తూపానికి కొంత మేరకు రంగులు వేసినా అది అర్ధంతరంగానే మిగిలి ఉంది. గతేడాది తెలంగాణ ప్రభుత్వం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని గుర్తించి ఆదివాసీలకు నివాళులర్పించడానికి అనుమతి ఇచ్చినా సమయం సరిపోకపోవడంతో స్తూపానికి పూర్తిస్థాయిలో రంగులు వేయడం వీలు కాలేదు. ఈ ఏడాది ప్రభుత్వం ఆంక్షలు విధించకపోవడంతో ఆదివాసీ గిరిజనులు బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉత్సవంగా స్తూపానికి ఎర్ర రంగులు వేశారు.


 సంప్రదాయ రీతిలో నివాళులు.
అమరవీరులకు నివాళులర్పించడానికి మండలంలోని వారి కుటుంబ సభ్యులతో పాటు ఆదివాసీ గిరిజనులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా ఆనాటి సభకు సారథ్యం వహించిన ఉద్యమ సారధి తుమ్మగూడకు చెందిన తొడసం ఖట్టి స్మారకార్థం సమక్క కూడలి వద్ద ఏర్పాటు చేసిన జెండా గద్దె వద్ద జెండాను ఆవిష్కరించారు. సంప్రదాయ పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అక్కడి నుంచి మండలకేంద్రంలోని ఆదివాసీల ఆరద్యాదైవం ఇంద్రాదేవి ఆలయానికి చేరుకోని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని సంప్రదాయ వాయిద్యాలైన డోల్, పేప్రే, కాళీకోమ్, తుడుంల మోతల మధ్య అత్యంత వైభవంగా అమరవీరుల పేరిట జెండాను ఆవిష్కరించారు. సంప్రదాయ నృత్యం చేశారు.

ఇంద్రవెల్లి సర్పంచ్ మెస్రం గాంధారి, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, రాయిసెంటర్ జిల్లా సార్‌మెడి మెస్ర దుర్గు, రాయిసెంటర్ సార్‌మెడిలు తుమ్రం జుగాదిరావ్, మెస్రం వెంకట్‌రావ్, మావన హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆత్రం భుజంగ్‌రావ్, తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అజ్మీర శంకర్‌నాయక్, ఆదివాసీ గిరిజన నాయకులు కనక తుకారం, కనక లక్కేరావ్, కనక యాదవ్‌రావ్, వెడ్మ బొజ్జు, ఆత్రం సుగుణ, సెడ్మాకీ సీతారాం, కనక వెంకట్‌రావ్, సిడాం గంగాధర్, తొడసం నాగోరావ్, సర్పంచ్‌లు మెస్రం నాగ్‌నాథ్, జాదవ్ జమునాయక్, మడావి సుంగు పాల్గొన్నారు.


 200 మంది పోలీసులతో బందోబస్తు
 ఉట్నూర్ డీఎస్పీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 9 మంది డీఎస్పీ మల్లారెడ్డి, ఉట్నూర్, జైనూర్ సీఐలు స్వామి, రవికుమార్, 9 మంది ఎస్సైలతో కూడిన 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.


 వచ్చే ఏడాది అధికారికంగా.. : ఎమ్మెల్యే
వచ్చే ఏడాది ఏప్రిల్ 20న అమరవీరులకు అధికారికంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నివాళులర్పించేందుకు కృషి చేస్తామని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హామీ ఇచ్చారు. బుధవారం ముందుగా అమరవీరుల స్తూపం వద్ద చేరుకుని నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించడానికి అనుమతి ఇచ్చిందని తెలిపారు. వచ్చే ఏడాది ప్రభుత్వ పరంగా నివాళులు అర్పించడానికి త్వరలోనే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌తో కలిసి ఎంపీ గోడం నగేశ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement