- ∙సరైన మందులు లేక ప్రైవేట్ ఆస్పత్రులను
- ఆశ్రయించాల్సిన దుస్థితి
- l కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్
గిరిజనుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం
Published Thu, Aug 11 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
ములుగు : ఏజెన్సీ ప్రజల అవసరాలకు అనుగుణంగా వైద్య సామగ్రిని అందుబాటులో ఉంచకుండా ప్రభుత్వం గిరిజనుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్ ఆరోపించారు.
బుధవారం నాయకులతో కలిసి ఆయన మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడారు. మందులను ప్రైవేట్ మెడికల్ షాపుల నుంచి కొనుగోలు చేసుకుంటున్నామని దృష్టికి తీసుకొచ్చారు. వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో సరైన మందులు అందుబాటులో లేకపోవడంతో నిరుపేద ప్రజలు జేబులు ఖాళీ చేసుకొని ప్రైవేట్ షాపులను ఆశ్రయించాల్సి వస్తుందని, ప్రణాళిక లేని ప్రభుత్వ తీరు వల్ల ఈ దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గొప్పలు చెప్పుకోవడం తప్ప నాణ్యమైన వైద్యం కరువైందని ఆరోపించారు. ఆస్పత్రిలో మందుల నిల్వపై సూపరింటెండెంట్ గోపాల్, వైద్యుడు నారాయణరెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, ఓఎస్డీ ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఫోన్‌లో సమాచారం అందించారు. జ్వరానికి బయటికి మందులు రాసినప్పుడు ప్రభుత్వ ఆస్పత్రి అని పేరు ఎందుకని ప్రైవేట్ ఆసుపత్రి అంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.
గిరిజనులను పట్టించుకోవాలి...
రాష్ట్రంలో ఆదిలాబాద్, మణుగూరు, భద్రాచలం, ఏటూర్‌నాగారం ఏజెన్సీ ప్రాంతాల్లో వందలాది మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని, దీనిపై ప్రభుత్వం పట్టించుకునేది ఉందా లేదా అని బలరాం నాయక్ ప్రశ్నించారు. భద్రాచలం ఏజెన్సీలో నాలుగు రోజుల క్రితం నలుగురు విద్యార్థులు విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోయారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి నదితీరాల వెంబడి ఉన్న గిరిజనులు విషజ్వరాలతో బాధపడుతున్నారని తెలిపారు. వారికి సరైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వర్షా కాలంలోనైనా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ మందులు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. ఈ మేరకు స్వప్న అనే యువతితో జిల్లా కలెక్టర్ కరుణతో ఫోన్లో మాట్లాడించారు. టెస్టులతో సహా అన్ని బయటికి రాస్తున్నారని ఆమె కలెక్టర్‌తో తెలిపింది.
దీనిపై స్పందించిన కలెక్టర్ రెండు, మూడు రోజుల్లో ఆస్పత్రిని సందర్శిస్తానని తెలిపారు. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్, వెంకటాపురం జెడ్పీటీసీ బానోతు విజయ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లాడి రాంరెడ్డి, మండల అధ్యక్షుడు వేముల బిక్షపతి, చింతలపూడి నరేందర్, ఇమ్మడి రమేశ్, మల్క రమేశ్, యుగేందర్, యూనస్, భద్రయ్య తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement