మావోయిస్టులా...దోపిడీదొంగలా..
- జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మండిపాటు
విశాఖపట్నం : మావోయిస్టుల దుశ్చర్యల కారణంగా గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ మండిపడ్డారు. జిల్లాలో మారుమూల గిరిజన గ్రామాల్లో వృద్ధాప్య, వితంతు పింఛన్లు, ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రజలకు నేరుగా పోస్టాఫీసుల ద్వారా డబ్బులు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. దానిలో భాగంగా వీఆర్‌సీల ద్వారా వేలిముద్రలు, పని వివరాలు వంటివి నమోదు చేసి పోస్టాఫీసులో అందజేయడం ద్వారా గిరిజనులకు నేరుగా డబ్బులు అందుతాయన్నారు.
ఈ ప్రక్రియకు నేడు మావోయిస్టులు చేసిన పిల్ల చేష్టల వల్ల తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. మావోయిస్టులు వారి అజ్ఞానంతో, అనాలోచిత విధానాలతో గిరిజనుల సమాచారం పొందుపరిచిన లాప్‌టాప్‌లు, వెబ్‌కేమ్‌లు, థంబ్‌మెషీన్, సెల్‌ఫోన్లు, కెమెరాలు, పర్సులు, ఏటీఎం, పాన్‌కార్డు, ఆధార్‌కార్డులు, పనిచేసే వారి జేబుల్లోని డబ్బులు, వ్యక్తిగత వస్తువులు కూడా దోపిడీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వారు మావోయిస్టులా లేక దోపిడీ దొంగలా..?అని జిల్లా ఎస్పీ ప్రశ్నించారు.
గత నెల 14న, ఈ నెల 7వ తేదీన పెదబయలు మండలం ఇంబరి గ్రామం, కొయ్యూరు మండలం మఠం భీమవరం, చీడిపాలెం, బూదరాళ్ల, పలకజీడి పంచాయితీల్లో మావోయిస్టులు ఈ తరహా దాడులకు పాల్పడ్డారన్నారు. వారు తమ బూజు పట్టిన సిద్ధాంతాలతో గిరిజనుల జీవితాలతో ఆడుకోవడం మానుకోవాలని ఎస్పీ హితవు పలికారు. అభివృద్ధి గిరిజన గ్రామాలకు చేరాలని ప్రతి గిరిజన యువతీ, యువకులు, మేధావులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం తనతో సహా, పోలీస్ సిబ్బంది నిత్యం కృతనిశ్చయంతో పనిచేస్తామని ఎస్పీ తెలిపారు.