గిరిజనుల దరిచేరని ప్రభుత్వ పథకాలు
కనీస వసతులకు నోచుకోని గిరిజన గ్రామాలు
మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల కార్యదర్శి భుజంగ్‌రావు
ఉట్నూర్ రూరల్ : గిరిజనుల దరికి ప్రభుత్వ పథకాలు చేరడం లేదని, కనీసం మౌలిక వసతులు ప్రభుత్వం కల్పించడం లేదని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల కార్యదర్శి ఆత్రం భుజంగ్‌రావు ఆరోపించారు. శుక్రవారం మండలంలోని బీర్సాయిపేట పంచాయితీ పరిధిలోని లేండిగూడ, నర్సాపూర్-జే గ్రామాల్లో ఆయన పర్యటించారు. నిజ నిర్దారణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామాలను సందర్శించినట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా లేండిగూడ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా కరెంటు లేక గ్రామవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామాలకు కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసినప్పటికీ కరెంటు సరఫరా చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని వ్యాఖ్యానించారు.
గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం లేక గిరిజన చిన్నారులు పౌష్టికాహారానికి నోచుకోవడం లేదని, దీంతో రక్త హీనతకు గురయ్యే అవకాశం ఉందన్నారు. కనీసం తాగేందుకు నీరు కూడా దొరకని పరిస్థితి నెలకొందని అన్నారు. అదే విధంగా నర్సాపూర్-జే గ్రామంలో సందర్శించగా గ్రామంలో 300 జనాభా ఉన్నప్పటికీ కనీసం రోడ్డు సౌకర్యం , మంచి నీటి సౌకర్యం కూడా లేదని తెలిపారు. నీటి కోసం ఊరి పొలిమెరల్లో ఉన్న వాగు నుంచి చెలిమెలు ఏర్పాటు చేసుకొని నీటిని తీసుకువచ్చి తాగాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
ప్రభుత్వం గ్రామాల వైపు దృష్టి సారించి వారికి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి ,హెచ్‌ఆర్‌సీలకు పంపిస్తామన్నారు. ఆయన వెంట ప్రజా సంఘాల నాయకులు నేతావత్‌రాందాస్, రామారావు, సుగుణక్కలు తదితరులు ఉన్నారు.