
అభివృద్ధిని అడ్డుకోకుంటే చాలు
పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: పార్టీ నేతలు అభివృద్ధిని అడ్డుకోకుంటే చాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై నేతలు అవగాహన పెంచుకోవాలని, ప్రజలకు వాటిద్వారా ఎలా లబ్ధి చేకూర్చాలో ఆలోచించాలన్నారు. అప్‌డేట్ కానివారు అవుట్‌డేట్ అవుతారన్నారు. పార్టీ ముఖ్యనేతల కార్యగోష్టి రెండోరోజున గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ జరిగింది.
ఆరోగ్యం, అవగాహన, నియోజకవర్గాలవారీగా అభివృద్ధి సూచికలు, ప్రభుత్వ పథకాల అమలు, సమ్మిళిత అభివృద్ధి, నియోజకవర్గాలవారీగా డ్యాష్‌బోర్డ్ నిర్వహణ తదితరఅంశాలపై బృందాలవారీ అవగాహన నిర్వహించారు. కార్యగోష్టికి హాజరైనవారు లేవనెత్తిన సందేహాలకు సీఎం సమాధానమిచ్చారు. నియోజకవర్గాల అభివృద్ధిలో తమ పాత్ర ఏమిటని ఓ నేత ప్రశ్నించగా అభివృద్ధిని అడ్డుకోకుంటే చాలని వ్యాఖ్యానించారు.