
ఆత్మకూరు పట్టణంలో కవాతు నిర్వహిస్తున్న పోలీసులు
ఆత్మకూరు/కర్నూలు కల్చరల్: కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిషేధాజ్ఞలు విధించారు. పెద్ద సంఖ్యలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 13వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తహసీల్దార్ ప్రకాశ్‌బాబు ప్రకటించారు. ఓ స్థలంలో చేపట్టిన నిర్మాణం విషయమై శనివారం రెండువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు.
చాలా దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. నంద్యాల టర్నింగ్, కొత్తపేట, మెయిన్‌బజార్, కప్పలకుంట్ల, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, కర్నూలు–గుంటూరు రహదారి వంటి ముఖ్యమైన ప్రదేశాల్లో పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు యథావిధిగా తిరుగుతున్నాయి. బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని ఎక్కడకు తరలించారో చెప్పడం లేదు. జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఆత్మకూరులోనే మకాం వేసి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.
హోంమంత్రి స్పందించరేం
ఆత్మకూరు ఘటనపై రాష్ట్ర హోంమంత్రి ఎందుకు స్పందించలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నాయకుల అక్రమ అరెస్ట్‌లను ఖండించారు. నిషేధిత సంస్థ పీఎఫ్‌ఐ అమాయకులను పావులుగా ఉపయోగించుకుని దాడులకు తెగబడుతోందని ఆయన ఆరోపించారు.
బీజేపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిపై హత్యాయత్నం చేశారని, ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదన్నారు. దాడిలో గాయపడ్డ ఆయనకు మెరుగైన వైద్యం అందించి, మీడియాకు చూపాలని డిమాండ్ చేశారు. బాధితులపై అక్రమ కేసులు పెడితే బీజేపీ ఊరుకోదని హెచ్చరించారు. ఆత్మకూరు ఘటన వ్యూహాత్మకంగా కుట్ర కోణంలో జరిగిందన్నారు. పాశవిక దాడిపై ఉగ్రవాద కోణంలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment