
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కోర్టు మధ‍్యంతర ఆదేశాలతో రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు తెరుచుకున్నప్పటికీ పలు చోట్ల హిజాబ్ తీసేందుకు విద్యార్థినులు నిరాకరిస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
బెంగళూరులో నిషేధాజ్ఞలను ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్టు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. హిజాబ్ వివాదం కారణంగా ప్రభుత్వం నగరంలోని అన్ని పాఠశాలల వద్ద 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, ప‍్రస్తుతం తొమ్మిది జిల్లాల్లో 144 సెక్షన్ అమలులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అనేక పట్టణాలు, విద్యాసంస్థల వద్ద పోలీసులు మోహరించారు. ఇదిలా ఉండగా హిజాబ్ వివాదం నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలను నిషేధించారు. ఫంక్షన్ హాల్స్, బహిరంగ ప్రదేశాల్లో జరిగే వివాహాల్లో 200-300 మంది హాజరయ్యేందుకే అనుమతించారు. మరోవైపు క్రీడా మైదానాల్లో వాటి సామర్థ్యంలో 50 శాతానికి మించి ప్రేక్షకులు హాజరు కాకుడదని పేర్కొన్నారు.