
సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్షన్ 144 జారీ చేశారు. 12 నుంచి 19వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమలవుతాయి. బడుల వద్ద గుంపులుగా ఉండరాదని, ధర్నాలు చేయరాదని ప్రకటించారు.
సాక్షి, బెంగళూరు(శివాజీనగర): పది రోజులుగా హిజబ్, కేసరి వివాదంతో పలు జిల్లాల్లో బుధవారం నుంచి మూతపడిన పాఠశాలలు సోమవారం ప్రారంభమతుండగా, గొడవలు తలెత్తకుండా ప్రభుత్వం భారీ బందోబస్తును కల్పిస్తోంది. ముందు జాగ్రత్తగా బెంగళూరు, మైసూరు, ఉడుపితో పాటు పలు జిల్లాల్లో భద్రతను పెంచాలని నిర్ణయించింది. సీఎం బొమ్మై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.
తొలి విడతలో 1 నుంచి 10వ తరగతి వరకు స్కూళ్లు మొదలవుతాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్షన్ 144 జారీ చేశారు. 12 నుంచి 19వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమలవుతాయి. బడుల వద్ద గుంపులుగా ఉండరాదని, ధర్నాలు చేయరాదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది. హిజబ్‌లు, కేసరి కండువాలను వేసుకొస్తే అధికారులు ఎలా వ్యవహరిస్తారో. కాగా, పాఠశాలల పరిస్థితిని గమనించిన తరువాత కాలేజీల ఆరంభంపై నిర్ణయానికి వస్తామని సీఎం చెప్పారు.