సాక్షి, బెంగళూరు: కరోనా వికృత నీడ విద్యావ్యవస్థను కల్లోలం చేసింది. బాలలు స్కూళ్ల మొహాలు చూడలేకపోతున్నారు. ప్రస్తుత విద్యా ఏడాది పాఠశాలల ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమై సుమారు నెలన్నర రోజులు గడుస్తున్నా బెంగళూరులో అడ్మిషన్లు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. విద్యాశాఖ అంచనాల మేరకు సుమారు 25 నుంచి 28 శాతం మంది బాలలు ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో చేరలేదు. రాష్ట్రవ్యాప్తంగా అయితే 92 శాతం మంది పిల్లలు ప్రవేశాలు తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
ఎక్కడెక్కడ ఎంతెంత?
- చిత్రదుర్గ, కారవార, దక్షిణ కన్నడ జిల్లాలో అత్యధికంగా 98 శాతం మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చేరారు. మిగిలిన జిల్లాల్లో 92 శాతం నుంచి 97 శాతం మేర చేరారు.
- బెంగళూరు ఉత్తరం 74, దక్షిణ విభాగం 72 శాతాలతో చివరిస్థానంలో ఉన్నాయి. లాక్‌డౌన్‌లో చాలా కుటుంబాలు నగరాన్ని విడిచి వెళ్లాయి. పిల్లలను కూడా తమతోపాటు ఊర్లకు తీసుకెళ్లారు. ఈ కారణాలతో నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ మందగించింది.
- ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల కంటే అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు చాలా స్వల్పంగా ఉన్నాయి. వీటిలో 68 – 70 శాతం మంది మాత్రమే చేరారు.
ప్రైవేటు స్కూళ్లకు గిరాకీ
2021– 22వ విద్యా సంవత్సరం పాఠశాలల ప్రవేశాల ప్రక్రియ జూన్ 1 నుంచి ప్రారంభమయింది. నేరుగా బోధన లేకపోయినా, జూలై 15 నుంచి ఆన్‌లైన్ ద్వారా పాఠశాలలు నడుస్తున్నాయి. ఇప్పటివరకు అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు ఎక్కువగా ప్రైవేటు స్కూళ్లకు చెందిన వారే. వారిలో చాలామంది తల్లిదండ్రులు పాఠశాలలకు ఫీజులు చెల్లించడం లేదు. కొందరు కొంతభాగం ఫీజులను చెల్లించారు. ఫీజు చెల్లింపులపై కోర్టులో కేసులు నడుస్తున్నందున వేచి చూసే ధోరణిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment