
ఉద్రిక్తం.. ఉద్విగ్నం
► గరగపర్రులో కొనసాగుతున్న 144 సెక్షన్
► తరలివచ్చిన అధికారగణం
► జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడి విచారణ
► నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశం
► నేడు గ్రామానికి వైఎస్సార్ సీపీ బృందం
పాలకోడేరు మండలం గరగపర్రులో ఇంకా ఉద్విగ్నం.. ఉద్రిక్తత కొనసాగుతున్నాయి. గ్రామం పోలీసు వలయంలో బందీ అయింది. 144 సెక్షన్ వల్ల గ్రామంలోకి బయట వ్యక్తులను ఎవరినీ రానీకుండా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు.
పాలకోడేరు : గరగపర్రు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై తలెత్తిన వివాదం నేపథ్యంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురైనట్టు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి దళిత నేతలను అరెస్ట్ చేయడంతో ఆందోళనలు మిన్నంటాయి. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. సోమవారం కూడా గ్రామం ఖాకీల వలయంలోనే ఉండాల్సి వచ్చింది. గ్రామంలోకి ఎవరినీ రానీకుండా పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. సాధారణ ప్రజాజీవనానికీ ఆటంకం కలిగించారు. ప్రతిఒక్కరూ తాము గ్రామస్తులమనే ఆధారం చూపించాల్సిన పరిస్థితి నెలకొంది. అడుగడుగునా నిర్బంధాల వల్ల బయట నుంచి వచ్చిన ప్రజా, దళిత సంఘాల నేతలు అతి కష్టమ్మీద దళితవాడకు చేరుకుని బాధితులకు సంఘీభావం ప్రకటించారు.
నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలి : రాములు
జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కె.రాములు సోమవారం గ్రామానికి వచ్చారు. ఆయనతోపాటు కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ ఎం.రవిప్రకాష్, ఇతర అధికారగణం తరలివచ్చారు. దళితుల సాంఘిక బహిష్కరణ ఘటనపై రాములు బహిరంగ విచారణ చేపట్టారు. బాధితుల నుంచి, వివిధ ప్రజా సంఘాల నుంచి వివరాలను సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో పూర్వ పరిస్థితి నెలకొనే వరకూ బాధితులకు ఉపాధి కల్పించాలని ఆదేశించారు.
ముందుగానే ఈ చర్యలు తీసుకుంటే ఇప్పుడీ విపత్కర పరిస్థితులు తలెత్తేవి కావని అభిప్రాయపడ్డారు. దళితులు కౌలు చేస్తున్న భూములను తిరిగి ఇప్పించాలని, వెంటనే పనులు కల్పించాలని, వారికి సరుకులు ఇవ్వని దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించారు. అంతేగాక దళితులకు దగ్గర్లో ఉండేలా దుకాణాలను ఏర్పాటు చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. శాంతి కమిటీని ఏర్పాటు చేసి ఇరువర్గాల్లో సభ్యులను ఎంపిక చేసి చర్చల ద్వారా న్యాయం చేయాలని కోరారు. దీంతో పోలీసులు కొంత గడువు కావాలని కోరారు.
న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చారు. తహసీల్దార్, తదితర అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చారని, గ్రామంలో 400 ఎకరాలు ప్రభుత్వ భూములను బడా బాబులు కబ్జా చేశారని పలువురు ఆయన దృష్టికి తీసుకురాగా.. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే వెంటనే చర్యలు చేపడతామని బదులిచ్చారు.
నేతల నిర్బంధం
గొల్లలకోడేరు వద్ద వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మానుకొండ ప్రదీప్, లీగల్ సెల్ నాయకులు స్టాలిన్ రాజును పోలీసులు అడ్డుకుని రెండు గంటలపాటు నిర్బంధించారు. వీరు అతికష్టమ్మీద గ్రామానికి చేరుకుని దళితులను పరామర్శించారు. దళిత స్త్రీశక్తి జాతీయ అధ్యక్షురాలు గెడ్డం ఝాన్సీ, ఢిల్లీ నుంచి వచ్చిన దళిత రైట్స్ జాతీయ అధ్యక్షుడు కందుకూరి ఆనందరావు గ్రామంలో పోలీసుల అత్యుత్సాహాన్ని చూసి రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపారు.
ఉత్తరప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, కోల్‌కతాల నుంచీ దళిత, మానవహక్కుల నేతలు గరగపర్రు తరలివచ్చారు. వీరిని పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపేశారు. ఇదిలా ఉంటే ఏపీ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి గురుప్రసాద్, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి సుంకర సీతారాం, ఆపార్టీ జిల్లా నాయకుడు పాలా సత్తిరామరెడ్డి, ఐఏఎస్ ఫోరం కార్యదర్శి సిద్దోజిరావు, సీపీఎం, వివిధ ప్రజాసంఘాల నేతలు బాధిత దళితులను పరామర్శించారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
నాడు తుందుర్రు.. నేడు గరగపర్రు..
భీమవరం : అధికారులు, పోలీసుల అత్యుత్సాహం వల్లే గరగపర్రు సమస్య మరింత జఠిలమవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలోకి ప్రవేశించాలంటే గ్రామస్తులతో సహా అందరూ ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సి రావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గతంలో భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో గోదావరి ఆక్వా మెగా ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని నిలిపివేయాలని తుందుర్రు, జొన్నలగరువు, కె.బేతపూడితో సహా భీమవరం, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని సుమారు 40 గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనలు చేపట్టిన సమయంలోనూ అధికారులు, పోలీసులు యాజమాన్యానికి కొమ్ముకాస్తూ బాధిత గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు.
బాధితులను ముప్పుతిప్పలు పెట్టారు. గ్రామం నుంచి బయటకు వెళ్లాలన్నా.. లోపలకు రావాలన్నా.. ధ్రువీకరణ చూపించాలని ఆంక్షలు పెట్టారు. దీంతో ప్రజల్లో ఆగ్రహం రెట్టింపయింది. ఇప్పుడు గరగపర్రు విషయంలోనూ పోలీసులు, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి శనివారమే కలెక్టర్ గ్రామానికి వచ్చి ఇరువర్గాలకూ నచ్చచెప్పారు. అయితే ఆ రోజు అర్ధరాత్రి దళితనేతలను అరెస్ట్ చేయడం, తదనంతరం 144 సెక్షన్ విధించడం బాధితుల్లో ఆగ్రహానికి కారణమైంది. వివాదం చినికిచినికి గాలివాన అయింది.
ప్రజాజీవనానికి ఆటంకం కలుగుతోంది. గ్రామంలో పోలీసులు లేకపోతేనే సమస్య త్వరగా పరిష్కారమవుతుందని, ఎక్కువ మంది పోలీసులను మోహరించడం వల్ల ఏదో జరిగిపోతుందన్న ఆందోళన ఇటు బాధితుల్లోనూ, ఇటు మిగిలిన గ్రామస్తుల్లోనూ పెరిగిపోతుందని, దీనివల్ల సమస్య మరింత జఠిలమవుతుందని ఓ పోలీసు అధికారి చెప్పారు. వెంటనే పోలీసు బలగాలను ఉపసంహరించి అధికారులు సావధానంగా ఇరువర్గాలతో చర్చలు జరిపితే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.