కోనేరుసెంటర్ (మచిలీపట్నం): ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకుని మహిళలను బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఓ ప్రబుద్ధుడిని కృష్ణాజిల్లా పోలీసులు పట్టుకున్నారు. అతడి చేతిలో సుమారు 19 మంది మహిళలు బ్లాక్‌మెయిల్‌కు గురైనట్లు గుర్తించారు. వివరాలను జిల్లా ఎస్పీ పి.జాషువా బుధవారం మచిలీపట్నంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో వెల్లడించారు. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కొండేరు మండలం కొండ్రపల్లి గ్రామానికి చెందిన భీమిని గణేష్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. కొంతకాలం హైదరాబాదులోని ఓ వ్యాపార సంస్థలో ఉద్యోగం చేశాడు. చేస్తున్న ఉద్యోగం మానేసిన గణేష్ సంపాదన కోసం అడ్డదారి ఎంచుకున్నాడు. ఫేస్‌బుక్‌లో ఉండే మహిళలను టార్గెట్‌గా చేసుకుని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఫేస్‌బుక్‌లో ప్రైవసీ లాక్ చేసుకోని మహిళల అకౌంట్లను ఎంచుకుని వారికి వేరే వ్యక్తుల ఫొటోలు కొత్త కొత్త పేర్లతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూ మహిళలతో పరిచయాలు పెంచుకుంటూ వచ్చాడు. కొంతకాలం మంచి ఫ్రెండ్‌గా నటిస్తూ వారి ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసి అందులోని వారి ఫొటోలు డౌన్‌లోడ్ చేయడంతో పాటు వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అలా అనేక మంది యువతులు, వివాహితులను తన ట్రాప్‌లో పడేసి డబ్బులు గుంజడం ప్రారంభించాడు.
మోసపోయిన 19 మంది మహిళలు..
గణేష్ చేస్తున్న సైబర్ నేరాలకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 19 మంది అమాయక మహిళలు మోసపోయారు. ఇదిలా ఉండగా ఇటీవల కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం గూడూరు గ్రామానికి చెందిన ఓ యువతి ఆన్‌లైన్ ఉద్యోగం చేసే క్రమంలో భాగంగా ఒక యాప్‌ను ప్రమోట్ చేసేందుకు ఫేస్‌బుక్ స్టేటస్‌లో షేర్ చేసింది. అదే సమయంలో వికాస్‌రామ్ అనే దొంగ పేరుతో గణేష్ ఆ యువతికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. యువతి పెట్టిన ఫేస్‌బుక్ స్టేటస్‌ను ప్రమోట్ చేస్తానని నమ్మించాడు. మాటలు కలిపి యాప్ డౌన్‌లోడ్ చేయగానే ఓటీపీ వస్తుందని ఆ నంబరును తనకు ఫార్వర్డ్ చేయాలని చెప్పాడు. యువతి ఫోన్ నంబరు చెప్పగా ఆ నంబరు కలవడం లేదని ఇంట్లో వాళ్ల నంబర్లు ఏవైనా ఉంటే చెప్పాలని అడిగాడు. నమ్మిన యువతి కుటుంబసభ్యుల నంబర్లు అతనికి మెసేజ్ చేసింది. నంబర్లు తీసుకున్న వెంటనే గణేష్ ఆమె ప్రొఫైల్ ఫొటోపై బాధితురాలి ఫోన్ నంబరుతో పాటు ఇంట్లోవాళ్ల నంబర్లు పెట్టి సెక్స్ గాళ్‌గా అప్ లోడ్ చేస్తానంటూ బెదిరించాడు. కాదు అంటే నూడ్‌గా వీడియో కాల్ చేయాలని డిమాండ్ చేశాడు. తప్పని పరిస్థితుల్లో సదరు యువతి అతనికి వీడియో కాల్ చేసింది. గణేష్ ఆమె వీడియో కాల్‌ను స్క్రీన్ రికార్డు ద్వారా వీడియో రికార్డు చేసి మరింత బ్లాక్ మెయిల్ చేయసాగాడు.
యువతి ఫిర్యాదుతో విచారణ..
గణేష్ చేతిలో మోసపోయిన యువతి జరిగిన విషయాన్ని స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న ఎస్పీ నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఎస్పీ ఆదేశాలతో గాలింపు చేపట్టిన పోలీసులు బాధితురాలి చేత అతనికి ఫోన్ చేయించారు. అడిగినంత డబ్బు ఇస్తానంటూ నమ్మించి గూడూరుకు పిలిపించారు. అప్పటికే అక్కడ కాపు కాసిన దిశ సీఐ నరేష్‌కుమార్, గూడూరు ఎస్‌ఐ ఇతర సిబ్బంది యువతి వద్దకు వస్తున్న గణేష్‌ను వెంబడించి పట్టుకున్నారు. కాగా, ఎస్పీ మాట్లాడుతూ యువతులు, మహిళలు తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లపై స్పందించవద్దని సూచించారు.ఫేస్‌బుక్ అకౌంట్ లాక్ మరిచారో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సైబర్ నేరగాడిని పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనబరచిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అడిషనల్ ఎస్పీ ఎన్.వెంకట రామాంజనేయులు, దిశ సీఐ నరేష్‌కుమార్, ఎస్‌ఐ మస్తాన్‌ఖాన్, ఐటీ కోర్ ఎస్‌ఐ దీపిక, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ప్రేమ పేరుతో వివాహితను వంచించిన ఏఆర్ ఎస్‌ఐ
Comments
Please login to add a commentAdd a comment