సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాల పునర్విభజనతో ప్రకృతి సహజసిద్ధమైన కొల్లేరు సరస్సు సంపూర్ణంగా ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చింది. ఇప్పటివరకు రెండు జిల్లాల మధ్య సరస్సు సరిహద్దు, అభయారణ్యానికి సంబంధించి వివాదాలు, చేపల సాగులో ఆధిపత్య పోరు ఇలా రకరకాల సమస్యలు కొనసాగుతుండేవి. జిల్లాల పునర్విభజన కొల్లేరుకు అతి పెద్ద మేలు చేసింది. కృష్ణాజిల్లాలోని కైకలూరు నియోజకవర్గం కొత్తగా ఏర్పాటవుతున్న ఏలూరు జిల్లాలో కలవడంతో పూర్తి కొల్లేరు విస్తీర్ణం ఏలూరు పరిధిలోకి చేరింది. 64 కొల్లేరు గ్రామాలు, మూడున్నర లక్షల జనాభా, 2.32 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొల్లేరంతా కొత్త జిల్లాలో కలిసింది.
ఆసియాలోనే అతి పెద్ద సరస్సుగా ఖ్యాతి...
ఆసియాలోకెల్లా అతి పెద్ద మంచినీటి సరస్సుగా కొల్లేరు ఖ్యాతిగడించింది. కృష్ణా, గోదావరి డెల్టాల మధ్య ఇది సహజసిద్ధంగా ఏర్పడింది. 2,32,600 ఎకరాల్లో సుమారు 312 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొల్లేరు విస్తరించి ఉంది. ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, కైకలూరు, ఉండి నియోజకవర్గాల పరిధిలోని తొమ్మిది మండలాల్లో కొల్లేరు విస్తరించింది. కొల్లేరు పరిధిలో 64 గ్రామాల్లో 3.50 లక్షల జనాభా ఆవాసం ఉంటుండగా, 90 శాతం మందికి పైగా కొల్లేరు వేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న కొల్లేరుకు బుడమేరు, తమ్మిలేరు నదుల వరద నీటితో పాటు 14 పిల్ల కాలువలు, 15 డ్రెయిన్లు, కాలువల్లోని నీరు వచ్చి చేరుతుంది.
ఈ నీటినంతటినీ తనలో ఇముడ్చుకునే ప్రకృతిసిద్ధమైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా కొల్లేరు రూపాంతరం చెందింది. దీనికి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన ఏలూరు కాలువ ఉన్నాయి. సాధారణంగా కొల్లేరు సముద్ర మట్టానికి ఎనిమిది అడుగుల ఎత్తున ఉండేది. వివిధ వాగులు, నదుల నుంచి వచ్చే వరద నీటిని బట్టి ఇది ఒక్కోసారి పది అడుగుల వరకు ఉండేది. ఈ అడుగుల లెక్కనే కాంటూరు లెవెల్ అని పిలుస్తారు. 2,32,600 ఎకరాల విస్తీర్ణంలో 1.60 లక్షల ఎకరాలు అభయారణ్యం పరిధిలో ఉన్నాయి.
ఏటా రూ.200 కోట్ల చేపల విక్రయాలు
కొల్లేరుపై ఆధారపడి ప్రతి ఏటా రూ.200 కోట్ల చేపల విక్రయాలు జరుగుతున్నట్టు అంచనా. ప్రతిరోజూ ఇక్కడి నుంచి తమిళనాడు, అస్సాం, పశ్చిమబెంగాల్‌కు లారీల్లో ఎగుమతులు జరుగుతున్నాయి. కైకలూరు, ఆకివీడు, ఏలూరు, భీమడోలు కేంద్రాలుగా ప్రతి నిత్యం ఎగుమతులు జరుగుతున్నాయి. కొల్లేరులో నల్లజాతి చేప రకమైన కొరమేను ఎక్కువగా లభిస్తోంది. దీనికి దేశీయ మార్కెట్‌లో కేజీ రూ.400 నుంచి రూ.600 వరకు ధర పలుకుతోంది. ప్రస్తుతం ఈ రకం రోజూ 100 టన్నులకు పైగా ఎగుమతులు జరుగుతున్నట్టు అంచనా.
సరస్సు ఉనికి బతికింది
కొల్లేరు ప్రాంతాన్ని ఒకే గూటికి తీసుకురావడం హర్షణీయం. కృష్ణా జిల్లాలోని కొల్లేరు తీర గ్రామాలన్నింటినీ ఏలూరు జిల్లాలో కలుపుతూ తీసుకున్న నిర్ణయంతో దీని అభివృద్ధికి బాటలు వేసినట్టు అవుతుంది. సరస్సు అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి.
– భూపతిరాజు తిమ్మరాజు, కొల్లేరు పరిరక్షణ సమితి ప్రతినిధి, సిద్ధాపురం, ఆకివీడు మండలం
27 గ్రామాలు ఏలూరులోకే...
ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో 2,08,600 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 24 ఎకరాల్లో కొల్లేరు ఉంది. కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు, మండవల్లిలో 27 కొల్లేరు గ్రామాలు ఉన్నాయి. మిగిలిన 37 గ్రామాలు పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, గణపవరం, నిడమర్రు, భీమడోలు, ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు మండలాల పరిధిలో ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేస్తూ గెజిట్ జారీ చేసింది. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలోని కైకలూరు, నూజివీడు ఏలూరు జిల్లా పరిధిలోకి చేరాయి.
దీంతో కొల్లేరు పూర్తిగా ఒకే జిల్లా పరి«ధిలోకి చేరింది. కొల్లేరు అభివృద్ధికి సంబంధించి ఇప్పటి వరకు అనేక ప్రతిపాదనలున్నా, అభయారణ్యం, రెండు జిల్లాల హద్దుల సమస్యలు, ఇతర కారణాలతో బలంగా ముందుకు సాగని పరిస్థితి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కొల్లేరును ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు.
ఆయన మరణానంతరం దీనిపై ఎలాంటి పురోభివృద్ధీ లేదు. మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొల్లేరు అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనిలో భాగంగా కొల్లేరులో నిరంతరం నీరు నిలిచి ఉండేందుకు మూడు రెగ్యులేటర్లు నిర్మించాలని భావిస్తోంది. దీనివల్ల ఉప్పుటేరు కొల్లేరులోకి రాకుండా అడ్డుకోవడంతో పాటు సరస్సు తన స్వభావాన్ని కోల్పోకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment