సీఆర్‌డీఏ పరిధిలోకి ఏలూరు
సాక్షి, విజయవాడ: సీఆర్‌డీఏ పరిధి మరోమారు పెంచనున్నారు. ఇప్పటికే రెండుసార్లు పెంచడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 58 మండలాలు సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చాయి. కృష్ణా జిల్లాలో ఉత్తరం వైపున హనుమాన్‌జంక్షన్ వరకు ఉన్న పరిధిని పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు వరకు విస్తరించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీకి పెద్దపీట వేసినందున జిల్లాకు మేలు చేశామనిపించుకునేందుకు సీఎం చంద్రబాబు ఈ ఆలోచన చేసినట్లు సమాచారం.
ఇప్పటికే పరిధి ఎక్కువైందని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. ఏలూరు నగరాన్ని కూడా చేరిస్తే విజయవాడ నుంచి 60 కి.మీ. విస్తరిస్తుంది. ప్రస్తుతం హనుమాన్‌జంక్షన్ విజయవాడ నుంచి 35 కి.మీ. దూరంలో ఉంది. గుంటూరు నుంచి విజయవాడకు పశ్చిమంగా 180 కి.మీ. ఔటర్ రింగ్‌రోడ్డు వేస్తున్నందున ఈ పరిధి మొత్తం సీఆర్‌డీఏలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.