రైతు శ్రేయస్సే పరమావధిగా, ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి సేద్యం విస్తరణకు చర్యలు తీసుకుంటోంది. రసాయనాలు వద్దు – ప్రకృతి సేద్యం ముద్దు అనే రీతిలో ప్రోత్సహిస్తూ, ప్రకృతి సాగులో సలహాలు, సూచనలు అందిస్తూ అధిక దిగుబడులు పొందేలా భరోసాగా నిలుస్తోంది. ఫలితంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మొదట్లో వరికే పరిమితం కాగా, ప్రస్తుతం ఉద్యాన పంటలకూ ఈ విధానంలో సాగు విస్తరించింది. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల పరిధిలో లక్ష ఎకరాలకు విస్తరించాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం రైతులకు అవగాహన కల్పిస్తోంది.
ఏలూరు (మెట్రో): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2014లో ప్రకృతి సేద్యం వరి సాగుతో మొదలైంది. తొలినాళ్లలో 3,200 ఎకరాల్లో సాగు చేసేందుకు ముందుకు వచ్చిన రైతులు ప్రతి ఏటా దీనిని పెంచుకుంటూ వెళుతున్నారు. ఈ విధానంలో సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది చివరి నాటికి 42 వేల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. వరితో ప్రారంభమైన ప్రకృతి సేద్యం ఆయిల్‌పామ్, జామ, కూరగాయల సాగు వంటి ఉద్యాన పంటలకు విస్తరించింది. ప్రారంభంలో 3 వేల మంది రైతులతో మొదలుకాగా ప్రస్తుతం 40 వేల మంది ప్రకృతి సాగు చేస్తున్నారు.
దేశానికే స్ఫూర్తిగా.. ఇటీవల దేశానికే స్ఫూర్తిదా యకంగా ఆంధ్రప్రదేశ్‌లో సాగు విధానాలు ఉన్నాయని సేంద్రియ పద్ధతిలో సాగుపై పది రాష్ట్రాలు ఆసక్తి చూపించాయి. జిల్లా ప్రకృతి వ్యవసాయం అధికారులు గతం కంటే మిన్నగా ప్రకృతి సేద్యాన్ని ప్రజలకు, రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ప్రకృతి వ్యవసాయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నీతిఅయోగ్ సదస్సులో ప్రత్యేకించి ప్రసంగించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. \
కిచెన్ గార్డెన్స్‌పై ప్రత్యేక దృష్టి
జిల్లా అధికారులు కేవలం రైతులతో ప్రకృతి సాగు చేయించి సరిపెట్టకుండా మహిళలను కూడా ప్రకృతి సాగు, వాటి ఉపయోగాల వైపు మరల్చి మహిళా సంఘాల ద్వారా కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేయిస్తున్నారు. తద్వారా ప్రతి మహిళ ఆకుకూరలు, కూరగాయలను ఎటువంటి రసాయనాలు, పురుగుమందులు లేకుండా పండించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో 37 వేల మంది రైతులకు కిచెన్ గార్డెన్స్ పెంచేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. అదే విధంగా మహిళా సంఘాలను ఉపయోగించుకుని వారి పొదుపు సొమ్ములతో ప్రకృతి సేద్యానికి ఉపయోగపడే నవధాన్యాలను విక్రయించే ఏర్పాట్లు చేసి వారిని వ్యాపారులుగా మార్చేలా చర్యలు తీసుకున్నారు.
400 మంది సీఆర్పీలు
ఉమ్మడి జిల్లాలో 400 మంది సీఆర్పీలు ప్రకృతి సైద్యంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాల పునర్విభజనతో 160 మందిని ఏలూరు జిల్లాకు, 130 మందిని పశ్చిమగోదావరి జిల్లాకు, 110 మందిని తూర్పుగోదావరి జిల్లాకు ఉన్నతా ధికారులు కేటాయించారు.
సాగు విస్తరణపై ప్రధాన దృష్టి
ప్రకృతి సేద్యంపై దృష్టి కేంద్రీకరించాం. సాగు విస్తీర్ణం మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి సేద్యం విషయంలో 10 రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. అలాగే జిల్లా కూడా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచేలా చర్యలు తీసుకుంటున్నాం. పుడమికి జీవం పోయడంతో పాటు రైతులు అభివృద్ధి చెందుతూ ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండేలా ప్రకృతి సేద్యం ద్వారా పంటలు పండించేందుకు కృషిచేస్తున్నాం.
– ప్రసన్న వెంకటేష్, ఏలూరు జిల్లా కలెక్టర్
అన్ని పంటలకూ అనుకూలం
ప్రకృతి సేద్యాన్ని జిల్లాలో అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నారు. రానున్న రోజుల్లో లక్ష ఎకరాలలో ప్రకృతి సేద్యం చేసేలా రైతులను ముందుకు తీసుకువెళ్తున్నాం. అన్ని పంటలకు ప్రకృతి సేద్యం ఉపయోగకరం. ప్రజల ఆరోగ్యాలకు, రైతుల అభివృద్ధికి ప్రకృతి సేద్యం అనేది ఒక వరం. ప్రభుత్వం ప్రస్తుతం ప్రకృతి సేద్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో మరింతగా సాగును విస్తరింప చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
–బి.తాతారావు, జిల్లా కో–ఆర్డినేటర్, ప్రకృతి వ్యవసాయం
Comments
Please login to add a commentAdd a comment