అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న భక్తులు (ఫైల్)
కైకలూరు: తెలంగాణ బోనాల సంప్రదాయం కొల్లేరు సరస్సుకు ప్రవహిస్తోంది. కృష్ణా జిల్లా కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరలో రెండేళ్ల క్రితం ప్రారంభమైన బోనాల సమర్పణకు ఏటా మహిళా భక్తులు పెరుగుతున్నారు. ఈ ఏడాది నుంచి కొల్లేరు సరస్సులో సహజ సిద్ధంగా లభించే కలువ పువ్వులతో బోనాలు సమర్పించాలని పెద్దలు నిర్ణయించారు. మార్చి 3 నుంచి 18వ తేదీ వరకు వేడుకగా జరిగే ఈ జాతరకు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు పరీవాహక ప్రాంత గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారు. బోనాలకు సంబంధించిన సామగ్రిని ఇప్పటి నుంచే గ్రామస్తులు సిద్ధం చేస్తున్నారు.
నీటి మధ్యలో ద్వీపకల్పం
పద్మాసన భంగిమలో ఆశీనులైన పెద్దింట్లమ్మ తల్లి.. వేంగిరాజుల కాలంలో నిర్మించిన పురాతన దేవాలయం.. కొల్లేటి గ్రామాల ప్రజలకు ఆరాధ్యదైవం. దేవాలయంలో అనేక విశేషాలున్నాయి. అమ్మకు ఏటా జాతర (తీర్థం) నిర్వహిస్తారు. ఆ సమయంలో కొల్లేటికోట పెద్ద జనారణ్యంగా మారుతుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గాగోకర్ణేశ్వరస్వామి కల్యాణం రోజున ప్రభల ఊరేగింపు, బోనాల సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
బోనాల సమయంలో అమ్మవారి రూపాలు
బోనం ఇలా సమర్పిస్తారు..
భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. తెలంగాణలో ఉజ్జయిని మహంకాళి, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, మారెమ్మలకు జూలై నెలలో బోనాలు సమర్పిస్తారు. అదే విధంగా 2020 నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మకు బోనాలు సమర్పిస్తున్నారు. మొదటి ఏడాది 60 మంది బోనాలు సమర్పిస్తే, రెండో ఏడాది ఆ సంఖ్య 200కు చేరింది. మహిళలు మూడు మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలో పానకం, పిండి వంట, వడపప్పు, చలివిడి నింపి చివర కుండపై నెయ్యితో నిండిన దీపాన్ని ఉంచుతారు. బోనాలకు ముందు వరసలో 7 కావిళ్లలో పసుపు, కుంకుమ, నెయ్యి, వేప రొట్టలు, నిమ్మకాయలు, పానకం, కల్లు, అమ్మవారి ప్రతిరూపాలుగా భక్తులు మోసుకెళ్తారు.
అమ్మకు ఇష్టం కలువ బోనాలు..
ఈ ఏడాది నుంచి కొల్లేరు సరస్సులో లభించే కలువ పువ్వుల బోనాలను సమర్పించాలని నిర్ణయించారు. అమ్మవారి దేవస్థానానికి 2 కిలోమీటర్ల దూరంలోని పందిరిపల్లిగూడెం నుంచి ప్రభల ఊరేగింపుతో పాటు బోనాలను ఎత్తుకుని మహిళలు ప్రారంభమవుతారు. పూర్వం అమ్మవారికి కొల్లేరు సరస్సులో లభించే కలువ పువ్వులతో పూజలు చేసేవారు. పెద్దింట్లమ్మకు ఈ పువ్వులంటే ఇష్టమని భక్తులు భావిస్తారు.
దేవాలయం మరింత అభివృద్ధి
కొల్లేరు మధ్యలో ఉన్న పెద్దింట్లమ్మ దేవాలయం వద్ద దేవదాయ శాఖ, ఎమ్మెల్యే డీఎన్నార్ కృషితో అభివృద్థి కార్యక్రమాలు చేపడుతున్నాం. మార్చి 15న జల దుర్గాగోకర్ణేశ్వర స్వామి కల్యాణం, 18న తెప్పోత్సవం నిర్వహిస్తాం. మహిళా భక్తులు ఏటేటా పెరుగుతుండటం శుభపరిణామం.
– కె.వి.గోపాలరావు, పెద్దింట్లమ్మ దేవస్థానం ఈవో
Comments
Please login to add a commentAdd a comment